రెండు పాదాలకు.. రెండు లక్షలు జత కలిశాయి

ఉత్సాహంగా సాగిన షర్మిల మరో ప్రజాప్రస్థానం 
వైయస్ఆర్ జిల్లా: చారిత్రాత్మక ఘట్టానికి ఇడుపులపాయ వేదికైంది. రెండు పాదాలకు లక్షలాది పాదాలు తోడయ్యాయి. లక్షలాది హృదయాలు ఏకమయ్యాయి. కుల, మత, వయోబేధం, ఆడమగ, చిన్నాపెద్ద తేడా లేకుండా అడుగులో అడుగులేశారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, ఎంపీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర వైయస్‌ఆర్ జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది.

పులివెందుల వాసులు తమ ఆడబిడ్డకు అఖండ స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. పల్లెలన్నీ పాదయాత్ర వైపు చూశాయి. జిల్లాలో ఆరు రోజుల పాదయాత్ర మంగళవారం మధ్యాహ్నం తర్వాత అనంతపురం జిల్లాకు చేరింది. ఇడుపులపాయలో మొదలైన యాత్ర వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె, నందిపల్లె, తాళ్లపల్లె, అమ్మయ్యగారిపల్లె, వి.కొత్తపల్లె, వేముల, వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల, చిన్నరంగాపురం, ఇప్పట్ల, పెద్దకూడాల, లింగాల, వెలి దండ్ల, కర్నపాపాయపల్లె, నేర్జాంపల్లె, పార్నపల్లె మీదుగా అనంతపురం జిల్లాలోకి వెళ్లింది. జిల్లాలో సుమారు 82.5 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది.

లక్షలాది గొంతులు ఏకం
చరిత్రలో ఇడుపులపాయ గ్రామం సువర్ణాక్షరాకృతం కానుంది. వైయస్ అభిమానులు రాష్ర్ట వ్యాప్తంగా తరలివచ్చారు. మండుటెండలో ప్రారంభమైన పాదయాత్రలో లక్షలాది పాదాలు జతకట్టి పయనించాయి. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రారంభించిన యాత్రకు అడుగడుగునా ప్రజానీకం నీరాజనాలు పలికారు. ఆదరించే ముఖ్యమంత్రి అర్ధంతరంగా అంతర్థానమైతే, ఊరిడించే నేతను జైలుపాలు చేశారంటూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. విజయమ్మను, ఆమె కుమార్తె షర్మిలమ్మను చూసేందుకు పల్లెలన్నీ ఆరాటపడ్డాయి. మా జీవితకాలమంతా మీ వెంటే ఉంటాం తల్లీ...ఇన్నీ బాధల్లో కూడా ప్రజల కోసం నడవడం తట్టుకోలేకున్నాం అంటూ ఆవేదన చెందారు.

తొలి సమస్య ట్రిపుల్ ఐటీ..తుది సమస్య చిత్రావతి
కరవు నేపథ్యంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. తట్టిలేపాల్సిన ప్రతిపక్షం కుయుక్తులతో ప్రజానీకాన్ని విస్మరించింది. ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఒకరికొకరుగా విడదీయరాని అనుబంధంతో మెలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల ఆ పార్టీ సామాన్య కార్యకర్తగా, సైనికురాలిగా ప్రజలపక్షాన సమస్యలు ఎత్తి చూపేందుకు కఠోర సంకల్పానికి సిద్ధమయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. గత గురువారం(ఈనెల 18న) ఇడుపులపాయలో పాదయాత్ర ఆరంభమైంది. తొలిగా షర్మిల ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అక్కడి విద్యార్థుల బాధలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చివరగా చిత్రావతి రిజర్వాయర్ యంత్రాంగం వైఖరిపై రైతులు ఆగ్రహం వెళ్లగక్కారు.

ప్రజలతో మమేకం
ప్రజలతో మమైకం కావడంలో వైయస్ కుటుంబం తర్వాతే ఎవరైనా అని మరోమారు షర్మిల నిరూపించారు. ప్రజా సమస్యలకు, పోరాటానికి ఇంతకాలం దూరంగా ఉన్న ఆమె, అన్నమాట కోసం, పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ పాదయాత్రను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

కన్నబిడ్డలాంటి చీనీ చెట్లు నీరులేక దిగుబడులు చేతికందే సమయంలో నరుక్కోవాల్సి వస్తే ఆ రైతు బాధ వర్ణనాతీతం. అదే విషయాన్ని బెస్తవారిపల్లె సమీపంలో రమణారెడ్డి అనే రైతు వ్యక్త పరిచారు. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని వాపోయారు. మనోనిబ్బరంగా ఉండాలి అన్నా ..ప్రాణం అతి ముఖ్యం అన్న విషయం మరవద్దు. ఒకరి ఒకరం అండగా పయనిద్దాం. రాజన్న రాజ్యం జగనన్న నాయకత్వంలో త్వరలో వస్తుంది. నిబ్బరంగా ఉండండి..మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని తట్టి లేపుదాం అంటూ ఊరడించారు.

దిగ్విజయం చేసిన జిల్లా నేతలు
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో జిల్లా నేతలు స్వయంగా పాల్గొని దిగ్విజయంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు కొల్లం, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, డీసీ గోవిందరెడ్డి, జీవీ ప్రసాద్, గడికోట మోహన్‌రెడ్డి, గడికోట ద్వారకనాథరెడ్డి, మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, రాచమల్లు పాల్గొన్నారు. అఫ్జల్‌ఖాన్, హఫీజుల్లా, పత్తిరాజేశ్వరి, టీపీ వెంకట సుబ్బమ్మ, నిత్యానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌నాయక్, మూర్తితోపాటు అల్లె ప్రభావతి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఈవీ సుధాకర్‌రెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, ఈవీ మహేశ్వర్‌రెడ్డి, డీఎల్ సోదరులు(మైదుకూరు) మునెయ్య, గురుమోహన్, మాసీమబాబు, మాజీ కార్పొరేటర్లు(కడప), వైయస్ కుటుంబ సభ్యులతోపాటు సమన్వయకర్తలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, భరత్‌రెడ్డి తదితరులు పాదయాత్ర దిగ్విజయంలో కీలకపాత్ర పోషించారు.

మహానేతను గుర్తుకు తెచ్చుకున్న ప్రజానీకం
కష్టాల్లో ఉన్న ప్రజానీకం కళ్లు తుడవాలనే దిశగా 2003 ఏప్రిల్ 9న వైయస్‌ఆర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి  మండు వేసవిలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజాప్రస్థానాన్ని ఇచ్చాపురంలో ముగించారు. ఆ పాదయాత్రతో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు, పాదయాత్రను చూసిన వారు ఉన్నారు. మరోమారు పాదయాత్రను చేపట్టిన షర్మిలను చూసి ప్రజానీకం మహానేత రాజశేఖరరెడ్డిని జ్ఙప్తికి తెచ్చుకున్నారు. అప్పటియాత్ర అనుభవాలను తెలిసిన వారితో పంచుకున్నారు. హావభావాలు, ప్రజానీకం సమస్యలు తెలుసుకోవడం, వారిలో ధైర్యం నింపే స్థితి, ప్రభుత్వాన్ని ఎండగట్టడం ఇలాంటి విషయాల్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి లక్షణాలను షర్మిల పుణికి పుచ్చుకున్నారు.

Back to Top