రైతుల్లో స్థైర్యం.. 'అనంత' జల జాగరణ

అనంతపురం:

పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు 10 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇరవైనాలుగు గంటల ‘జల జాగరణ’ రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.  పీఏబీఆర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఆయకట్టు పరిధిలోని వేలాది మంది రైతులు తరలి వచ్చారు. చిమ్మచీకటిలో చలిగాలులు వీస్తున్నా లెక్క చేయకుండా చలిమంట వేసుకుని నాయకులతో కలిసి జాగరణ చేశారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డే జీవించిఉంటే, చలిలో జాగరణ చేయాల్సిన పరిస్థితే ఉండేది కాదని  గుర్తు చేసుకున్నారు. ఎన్ని కష్టాలున్నా ‘రాజన్నా’ అని ఒక్కమాట అంటే ఇట్టే తీర్చేవారనీ, ఆయన చనిపోయాక తమ కష్టాలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదనీ రైతులు వాపోయారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయనీ, శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సీఎం కాగానే తిరిగి రాజన్న రాజ్యం వస్తుందని నాయకులు రైతులు భరోసా ఇచ్చారు.

రైతన్నల జగన్నినాదాలు

     అలాంటి రోజు కోసమే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని రైతులు ఒక్కసారిగా జగన్నినాదాలు చేశారు. మహానేత పాలనను గుర్తు చేస్తూ కళాకారులు ఆలపించిన పాటలు కూడా రైతుల్లో ఉత్సాహం నింపాయి. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురాలేకపోయారనీ, ఈసారి ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమికొడతామనీ పలువురు రైతులు ప్రతినబూనారు. రైతుల సంక్షేమానికి పోరాడుతున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు బి. గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు శంకరనారాయణ, వై.విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి తమ ప్రసంగాల్లో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ వ్యవహారశైలిని ఎండగట్టారు. మహానేత వైఎస్ పీఏబీఆర్‌కు కేటాయించిన పది టీఎంసీల నీటి గురించి ఏ ఒక్కరూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

Back to Top