మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన తనయుడు శ్రీ జగన్, తనయ శ్రీమతి షర్మిల ఎన్నెన్నో సవాళ్లు, సంక్లిష్ట సమస్యలను అధిగమిస్తూ జనమే శ్వాసగా, జన సంక్షేమమే ఊపిరిగా తమ ప్రస్థానం సాగిస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుమ్మక్కులు జరిపినా.. అక్రమ కేసులు బనాయించినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి పునీతునిగా నిర్బంధం నుంచి విముక్తి లభించే రోజు దగ్గరలోనే ఉంది. జన హృదయ నేతగా ఆయన తన తండ్రి రాజన్న రాజ్యాన్ని నెలకొల్పి తీరుతారు. శాంతి, కరుణ, ప్రేమ త్రిసూత్రాలుగా, పేదల అభ్యున్నతికి త్రికరణశుద్ధిగా పాలన సాగిస్తారు.. ఇది జనంలోంచి వస్తున్న తిరుగులేని మాట... ఇదే సత్యమై నిలిచే బాట. శ్రీమతి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’లో వైయస్ అభిమానులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీమతి షర్మిల ఇస్తున్న భరోసా ఇది.
విజయవాడ : పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జనం హృదయాలను గెలుచుకున్నారు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఏసుక్రీస్తు ప్రబోధించిన శాంతి, కరుణ, ప్రేమ మార్గంలో.. వైయస్ ఆశించిన సమసమాజ సాధన కోసం శ్రీ జగనన్న ఎక్కుపెట్టిన బాణమై ‘మరో ప్రజాప్రస్థానం’ చేస్తున్న శ్రీమతి షర్మిల శుక్రవారం ఉదయం నిర్మలా కాన్వెంట్ రోడ్డులోని సెయింట్‌పాల్ కెథడ్రల్‌లో లోక రక్షకుని ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభించారు. జగనన్న త్వరలోనే పునీతుడిగా బంధవిముక్తుడవుతాడని, భవిష్యత్తు మనదేనని.. అది మనకు గుడ్ ప్రైడేగా నిలుస్తుందని వైయస్ అభిమానులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
నాన్న ఆశయాలు, అన్న ఆకాంక్షలు భుజానికెత్తుకుని ప్రజల కోసం మరో ప్రజాప్రస్థానం చేస్తున్న శ్రీమతి షర్మిల మూడు రోజుల పాటు దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ చల్లని చూపులు, అభిమానుల ప్రేమానురాగాల మధ్య విజయవాడలో ఆత్మీయ అతిథ్యం పొందారు. నాలుగవ రోజు శుక్రవారంనాడు పటమట జనకెరటమై చెల్లెమ్మ శ్రీమతి షర్మిలను ముందుకు సాగనంపింది. పటమటలంక నుంచి బయలుదేరిన ఆమె పాదయాత్ర ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ చెక్‌పోస్టుకు చేరింది. అక్కడ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు డప్పు బృందాలు, బేతాళ నృత్యాలు, గుండెల్లో నిండిన ఆనందోత్సాహాల మధ్య ఆమెకు ఘనస్వాగతం పలికారు. బందరురోడ్డు అభిమానకెరటమే అయింది. మేడలు, మిద్దెలతో పాటు ఆర్టీసీ బస్సులపైకి ఎక్కి తమ ఆత్మీయ అతిథికి స్వాగతం పలికారు.
ఆటోనగర్ చెక్‌పోస్టు నుంచి కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, గంగూరు జంక్షన్, ఈడుపుగల్లు రోడ్డు, గోసాల వరకూ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. మరో ప్రజాప్రస్థానం పొడవునా పల్లెలన్నీ కదలి వచ్చాయా అన్నట్టుగా జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. శ్రీమి షర్మిలను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా చంటిబిడ్డలను చంకన పెట్టుకుని శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేశారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థినులు బయటకువచ్చి శ్రీమతి షర్మిలను చూస్తూ చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. తాడిగడపలో నిర్వహించాల్సిన రచ్చబండకు అభిమానులు భారీగా పోటెత్తడంతో పెనమలూరుకు మార్చి నిర్వహించారు.