అంతు చూస్తానన్న బాబునేం చేయాలి

– అసెంబ్లీలో అన్న మాటలను వదిలేయాలా..?
– రోజాను మాటలతో చేష్టలతో వేధించడం తప్పుకాదా 
– జగన్‌ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన
– ఓటమి భయంతోనే టీడీపీ అసత్య ప్రచారం

ఓటమి భయంతో టీడీపీ నాయకులు తమకే అలవాటైన గోబెల్స్‌ ప్రచారానికి మరోసారి డోర్లు తెరిచారు. నంద్యాల్లో ఉప ఎన్నికల్లో గెలవలేక ప్రజలను పింఛన్లు, రేషన్లు కట్‌ చేస్తామని వేధింపులకు గురిచేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి జగన్‌ నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ సానుభూతి కోసం మరింత దిగజారి ప్రచారం చేసుకుంటున్నారు. అధికారంలో ఉండీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తికి ప్రతిపక్ష నాయకుడి నుంచి రక్షణ లేదని చెప్పడం కూడా పచ్చ పార్టీ అవివేకానికి, అసహనానికి నిదర్శనం. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా సంధిస్తున్న ప్రశ్నలకు పచ్చ నేతల దగ్గర సమాధానం కరువైంది. నడిరోడ్డుపై చంద్రబాబుని కాల్చిపారెయ్యాలన్నా, చంద్రబాబుని ఉరితీసినా తప్పు లేదన్న మాటలు పట్టుకుని మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న హడావుడి తప్పించి..... పార్టీ ఫిరాయింపులు కానీ, మూడేళ్లుగా చేసిన అభివృద్ధిపైనగానీ, కర్నూలు జిల్లా, నంద్యాల నియోజకవర్గానికి ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడు ప్రశించినా సమాధానం చెప్పుకునే స్థితిలో టీడీపీ నాయకులు లేరు. జగన్‌ విమర్శలు పట్టుకుని వేలాడుతున్నా ఆ విమర్శల ముందూ వెనుకా ఆయన మాట్లాడిన మాటలే టీడీపీ నాయకులకు సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలాయి. దీనిపైనే చంద్రబాబు తీవ్ర అసహనంగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా టీడీపీ ముఖ్య నేతలంతా నంద్యాలలో మోహరించినా ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. 

సీఎం అసెంబ్లీలో అంటే తప్పులేదట..
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిపక్ష నేతను పట్టుకొని ’నీ అంతు చూస్తా..’ అని అసెంబ్లీ సాక్షిగా అంటే తప్పు లేదట. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అసెంబ్లీలోనే ప్రతిపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ’పాతేస్తా నా కొడకా అంటే తప్పు లేదట.! ఎందుకంటే, అధికార పార్టీ గనుక ఏమైనా అనొచ్చట. మహిళా ఎమ్మెల్యే రోజాని దుర్భాషలాడినా తప్పులేదట. ప్రజలు బాబును ప్రశ్నిస్తే మాత్రం  ఇంటికి పోలీసులను పంపించి కేసులు పెట్టిస్తాడట. నేను వేసిన రోడ్ల మీద నడవొద్దు, నేనిచ్చిన పింఛన్‌ తీసుకోవద్దు, ఓటుకి ఐదు వేలు ఇవ్వలేనా అని చెప్పిన విషయాలు మాత్రం పచ్చ పార్టీకి గుర్తుండవు. విద్యార్థులకు రాజకీయాలు వద్దు అని చెప్పిన వ్యక్తే.. నిరుద్యోగులను, బీటెక్‌ స్టూడెంట్‌లను డబ్బుల ఆశ చూపించి ఎన్నికల రంగంలోకి దించినా తప్పుండదు. నోరెత్తితే నంగనాచి కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు ఓటెయ్యని వాళ్ల పింఛన్లు తీసేస్తాం, రేషన్‌ ఆపేస్తామని తన మనుషులను పంపి బెదిరించినా ఎవరూ ప్రశ్నించకూడదు. అదే ప్రతిపక్ష నాయకుడు మాత్రం జనాన్ని మోసం చేసిన ఇలాంటి వ్యక్తిని ఉరితీయాలని చెబితే మాత్రం పెద్ద రాద్ధాంతం చేసేస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కి, ప్రజల్ని మోసగించినందుకుగాను బాబుకు ’ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటే అది తప్పట. మోసం చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తే తప్పెల అవుతుంది. .! ’కాల్చి పారేయాలి..’ అన్న మాట జగన్‌ ఏ సందర్భంలో ఉపయోగించారు.? ఉరి శిక్ష వేసినా తక్కువేనని జగన్‌ ఎందుకు అంటున్నారు.? బాబు అన్ని వర్గాల ప్రజలను వంచంచడం వల్లే కదా..? ఆయా సందర్భాల నేపథ్యం గురించి ఆలోచించకుండా, జగన్‌ వైపు నుంచి కుట్రలు షురూ అయ్యాయనీ, చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వుందనీ టీడీపీ ప్రచారం చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు.
Back to Top