పార్టీ శ్రేణుల్ని చైత‌న్య‌ప‌రిచిన తీర్మానాలు

విజ‌య‌వాడ‌:  రాజ‌ధానికి చేరువ‌లో వైయస్సార్సీపీ నిర్వ‌హించిన విస్త్ర‌త స్థాయి స‌మావేశం ప‌లు రాజ‌కీయ తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాల్ని ప్ర‌తినిధులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలతో రూ.1,45,549 కోట్లు కొల్లగొట్టి సాక్షాత్తూ గా ఎదిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఎన్నికల హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తున్న టీడీపీ ప్రభుత్వ దగాకోరు విధానాలను ఎండగట్టింది. కాపులను బీసీలలో చేరుస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చాలని ప్రశ్నించినందునే కాపు నేత ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఇతర బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరగకుండా కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులు ప్రోత్సహించడం, జన్మభూమి కమిటీలతో స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను హరించడంవంటి అప్రజాస్వామిక విధానాలపై ధ్వజమెత్తింది. 

తీర్మానాలు
♦ గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అవినీతి సామ్రాజ్యంగా తయారుచేసిన టీడీపీ ప్రభుత్వ విధానాలను వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇసుక దందాలు, మట్టి అమ్మకాలు, అక్రమ మద్యం వ్యాపారాలు, బొగ్గు కొనుగోలులో అవినీతి, బినామీ భూ కొనుగోళ్లలో కూరుకుపోయి రూ.1,45,549కోట్ల అక్రమార్జనతో సాక్షాత్తు గా ఎదిగారని ధ్వజమెత్తింది.
♦ వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యవంటి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న దగాకోరు విధానాలను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది.
♦ కాపు సామాజికవర్గాన్ని బీసీలలో చేరుస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందునే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ముద్రగడను అక్రమంగా నిర్బంధించి, ఆయన అనారోగ్యంతో చెలగాటమాడుతూ, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించింది. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం స్థిమితపడాలని సమావేశం ఆకాంక్షించింది. తుని సంఘటన నేపథ్యంలో అమాయకులను అరెస్టు చేస్తూ అనేకమందిని వేధిస్తున్న ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన వ్యక్తం చేసింది. ఆ సంఘటన తదుపరి పరిణామాలపై సీబీఐ విచారణకు ఆదేశించి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేసింది. ఇతర బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరగకుండా కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

♦ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభాలను గురిచేసి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న టీడీపీ అప్రజాస్వామిక విధానాలు దారుణమని ఈ సమావేశం మండిపడింది. అధికారం, డబ్బు, కాంట్రాక్టులువంటి ప్రలోభాలను ఎరవేస్తున్నారని ధ్వజమెత్తింది. 1985, 2003 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అక్రమమని విరుచుకుపడింది. టీడీపీ అప్రజాస్వామిక విధానాలను ఖండించింది.
♦ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను గండికొడుతూ జన్మభూమి కమిటీల వంటి అప్రజాస్వామిక సమాంతర వ్యవస్థలను సృష్టించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రతిపక్ష శాసనసభ్యులను నిర్లక్ష్యం చేస్తూ వారిని అపహాస్యం చేసేలా వారి అధికారాలకు గండికొడుతున్న టీడీపీ అప్రజాస్వామిక విధానాలను ఖండించింది.
♦ ఎమర్జెన్సీని తలపించేలా సాక్షి పత్రిక, టీవీ చానల్ ప్రసారాలపై ఆంక్షలు విధించి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. వెంటనే ప్రభుత్వం తన చర్యను ఉపసంహరించుకుని సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

♦ రాజధాని నిర్మాణ ప్రక్రియలో ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న అవినీతిపై ఈ సమావేశం మండిపడింది. విదేశీమోజులో అక్రమార్జనకు కక్కుర్తిపడుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టింది. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని తాకట్టుపెట్టిన విధానం, విచ్చలవిడిగా భూములు లాక్కోవడం, భవన నిర్మాణాలు, భూకేటాయింపుల వరకు ఆశ్రీత పక్షపాతంతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలను ఖండించింది.
♦ విభజన ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించి రాష్ట్ర విభజనకు దోహదపడిన టీడీపీ తదనంతరం కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో విఫలమైందని ఈ సమావేశం విరుచుకుపడింది. రాష్ట్ర ప్రయోజనాలమేరకు రాజ్యసభలో చర్చించి ఆమోదించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, రైల్వేజోన్‌లను సాధించలేక అసమర్థత చాటుకున్న టీడీపీ ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన వ్యక్తం చేసింది.

♦ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కాల్‌మనీ పేరుతో మహిళలను వేధించడం, వారిపై అకృత్యాలు, టీడీపీ అవినీతి-అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్న అధికారులపై యథేచ్ఛగా దాడులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపుపై నిరసన వ్యక్తం చేసింది.
♦ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపట్ల ఈ సమావేశం నిరసన వ్యక్తం చేసింది. పెరుగిపోతున్న వ్యవసాయ పెట్టుబడులు, సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు, సరైన మద్దతు ధర లేకపోవడంతో వ్యవసాయరంగం నానాటికీ క్షీణించిపోతుండటంపై ఈ సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై మండిపడింది.
Back to Top