రాజకీయ బాహుబలి వైఎస్సార్ - 8పాలనలో మెరుపువేగం అనే మాట తరచూ వింటుంటాము. కానీ మనం ఎన్నడైనా అలాంటి మెరుపువేగం చూశామా? ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా ఏళ్లతరబడి సాగదీసి నాన్చే మన ప్రభుత్వ వ్యవస్థలో అసలు సిసలైన మెరుపువేగం అంటే ఏమిటో చాటి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డాక్టర్ వైఎస్సార్ ఒకరే. ఒకే ఒకడు అని చెప్పుకోవచ్చు. వైఎస్సార్ ఒక విషయాన్ని విశ్లేషించి, చర్చించి, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారంటే... అది ఎలా ఉంటుందంటే.. తటిల్లతలు కూడా తడబడి పోవాల్సిందే.

ఏదైనా ఒక విషయాన్ని ఒక సమావేశంలో చర్చించడం, మరు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం. అంతే.. ఇక చర్చలు లేవు, శషభిషలు లేవు. ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాలు ఎంత యాగీ చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. జనం నాడి పసిగట్టడంలో ఆయన అపూర్వమైన రాజకీయ భిషక్కు. ఆకాశంలో విహరించే డేగ..నేలమీద ఉన్న తన ఆహారాన్ని పసిగట్టిందంటే శంపాలత కన్నా వేగంతో రివ్వున దిగి ఆహారాన్ని నోటకరచుకుని మళ్ళీ గగనంలోకి ఎగిరిపోతుంది. దాని గురి తప్పడం జరగదు. వైఎస్సార్ నిర్ణయాలు కూడా అంతే. ఏ పధకాన్ని ప్రజలు ఇష్టపడతారో, మెచ్చుతారో, దాన్ని అమలుచేయడంలో తిరిగి చూసుకునే పనేలేదు. ఆ సాహసమే, ఆ తెగువే.. ఏ పరిపాలకుడినైనా ప్రజల హృదయాల్లో చిరంజీవిని చేస్తుంది. ప్రజలు ప్రతాపవంతుడిని ఆరాధిస్తారు. పిరికివాడిని అసహ్యించుకుంటారు. వైఎస్సార్ మొదటికోవలోకి వస్తారు.

రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫీజుల చెల్లింపు, అభయహస్తం లాంటి పధకాలు కాంగ్రెస్ మానిఫెస్టోలో లేనే లేవు. కానీ, వేలకోట్ల రూపాయల వ్యయం కాగల ఆ పధకాలను అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకోవడంలో, వాటిని నిర్దాక్షిణ్యంగా అమలు చెయ్యడంలో వైఎస్సార్ చూపిన సాహసం మెరుపువేగం కాక మరేమిటి? ఆ పధకాలు కాంగ్రెస్ వి కావు. అవి వైఎస్సార్ సొంతపధకాలు. బానిస మనస్తత్వం కలిగినవారే చీటికిమాటికి అధిష్టానం అంటూ ఢిల్లీ పరుగెత్తుతారు. కానీ, వైఎస్సార్ దృష్టిలో అధిష్టానం ప్రజలు మాత్రమే. ఆ విషయాన్ని గ్రహించడానికి సోనియా గాంధీ చాలా ఆలస్యం చేశారు.

ఇక పాలనలో ఆయన ఏనాడూ సమీక్షలు అంటూ అధికారులు బాత్ రూమ్స్ లో ఉన్నా, ఫోన్స్ చేసి విసిగించే చంద్రబాబు పద్ధతిని ఎంచుకోలేదు. పదేపదే తన ఆఫీసుకు పిలిపించుకోలేదు. ఒకసారి ఆదేశాలు ఇవ్వడం... ఇక పర్యవేక్షించడం.. అంతే. వైఎస్సార్ ఆగ్రహాన్ని రుచి చూడాలని ఏ అధికారి మాత్రం కోరుకుంటాడు? అందుకే ఆయన ఆదేశాలన్ని సాఫీగా అమలయ్యాయి.
"ప్రభుత్వం చేపట్టిన ప్రతి పధకం లబ్ధిదారు ప్రతి ఒక్క గ్రామంలో ఉండి తీరాలి" అన్నది ఆయన ఆదేశం. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలను చూసి దేశం మొత్తం నోరు వెళ్లబెట్టింది. ఆ పధకాన్ని ఎలా అమలుచేశారో ఒక్కరికీ అర్ధం కాలేదు. వైఎస్సార్ ను అనుకరించాలని ఎంతమంది ప్రయత్నించినా వారివలన కాలేదంటే వైఎస్సార్ ధృడమనస్తత్వం ఏమిటో బోధపడుతుంది.

చంద్రబాబుకు - వైఎస్సార్ కు మధ్య ఉన్న తేడా ఏమిటంటే... చంద్రబాబు చేసేది చెప్పరు. చెప్పేది చెయ్యరు.
వైఎస్సార్ చేసేదే చెపుతారు. చేయలేనిది చెప్పరు. అందుకే విశ్వసనీయతకు వైఎస్సార్ ఒక చిరునామాగా నిలిచారు. ఆ విశ్వసనీయతే ఆయన్ను దేవుడిగా నిలిపింది. అక్రమాలు చేసి డబ్బు సంపాదించవచ్చు. మాయమాటలు చెప్పి దోపిడీ చెయ్యవచ్చు. ప్రపంచంలోని ధనం మొత్తం తెచ్చి రాసులు పోసినా, విశ్వసనీయత కొనుక్కోవడం సాధ్యం కాదు. మాట అంటే అది వేదం. మాట అంటే అది ఒక మంత్రం.
ఇక్కడ మరో విశేషం కూడా చెప్పుకోవాలి. పధకాల అమలులో ఆయన కుల, మత పార్టీ భేదాలను పాటించలేదు. తెలుగుదేశం వారయినా, కాంగ్రెస్ వారయినా, పధకాలను అర్హతను బట్టి, ఒక్కోసారి అర్హతను మించి కూడా ఆయన మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లక్షకు మించి మంజూరు చెయ్యకూడదని ఒక నిబంధన ఉండేది. కానీ ఆయన కొన్ని ప్రత్యేక కేసులలో ఐదు లక్షలవరకూ మంజూరు చేశారు. ఆ ఔదార్యం వైఎస్సార్ కు మాత్రమే సొంతం.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రముఖ కవి ఆరుద్ర మూత్రపిండాల వ్యాధితో నిమ్స్ లో చేరి ఆపరేషన్ కు లక్ష రూపాయలు మంజూరు చెయ్యమని కొందరు కవులు చంద్రబాబును కలిసి ప్రాధేయపడినప్పుడు ఆయన బ్రాహ్మణుడు కావడంతో చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారుట. చంద్రబాబు కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే సాయం అందేది.
కానీ వైఎస్సార్ వచ్చాక ఆ భేదాలను పక్కన పెట్టి ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ సాయం చేశారు. ఆ సాయం కూడా ఇరవై నాలుగు గంటలలో అందించాలని అధికారులను ఆదేశించారు. కొన్నాళ్ల తరువాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి సహాయ నిధి కేవలం కాంగ్రెస్ వారికి మాత్రమే అందుతున్నదని ఫిర్యాదు చేసినపుడు ఆశ్చర్యపోయి లెక్కలను తెప్పించారు వైఎస్సార్. అవి చూసాక తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిగ్గుపడి పారిపోయారు. కారణం కాంగ్రెస్ వారికంటే తెలుగుదేశం వారికే ఎక్కువ సాయం అందింది!

THAT IS YSR ! HE WAS NOT ONLY A CHIEF MINISTER .
HE WAS A GREAT HUMAN BEING !!
అలాంటి వాడు నభూతో నభవిష్యతి!!
(సశేషం)
 రచన ఇలపావులూరి

తాజా ఫోటోలు

Back to Top