మండుటెండలు, కుండపోతలు బలాదూర్!

‘వైయస్’‌ అనే రెండక్షరాలూ ప్రతి తెలుగుబిడ్డ మనోఫలకంపై ప్రతిబింబించేది మహానేత రాజశేఖరరెడ్డి రూపమే. ఆ రెండక్షరాలూ ఆయన ఇంటిపేరైన ‘యెడుగూరి సందింటి’కి సంకేతం. ఆ మహానేత తన ‘ప్రజాప్రస్థానం’ ద్వారా జనజీవితంలోని ఎగుడు దిగుళ్ళను మథించాక, ప్రజలు అభిమానించి, అధికారాన్నిచ్చాక అందరికీ సంక్షేమ ఫలాలు అందించాక.. ఆ రెండక్షరాలూ ‘యెల్లరికీ సొంతం’ అన్నంతగా జనహృదయాలకు హత్తుకుపోయాయి. ఆ మహానేత హఠాన్మరణం అనంతరం అదే వరవడినీ, వారసత్వాన్నీ కొనసాగిస్తున్నారు జననేత శ్రీ జగన్.‌ కాంగ్రెస్‌, టిడిపిలు కుట్రలు చేసి ఆయనను జైలు పాలు చేసినా ‘వైయస్’కు అర్థం మారదనీ, అందరినీ సొంత మనుషుల్లా చూసుకునే తమ కుటుంబపు రివాజు మరింత బలపడిందనీ చాటుతున్నారు జగనన్న సోదరి శ్రీమతి షర్మిల. అందుకే ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కొనసాగినంత మేరా జనం ఆమెను తమ కుటుంబంలో ఒకరిగా ఆదరిస్తున్నారు.

పెద్దాపురం :

మండుటెండైనా... కుండపోత వానైనా జగనన్న సోదరి వెంట జనసంద్రం పోటెత్తుతూనే ఉంది. అభిమాన తరంగాల్లో మహానేత రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలను ముంచెత్తుతూనే ఉంది. వాతావరణ మార్పులతో నిమిత్తం లేకుండా తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నిన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం సోమవారం ఒక్కసారిగా వేడెక్కింది. మండు వేసవిని తలపిస్తూ ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు చెరిగాడు. ఉదయం పాదయాత్ర మొదలైంది మొదలు.. సాయంత్రం ముగిసే వరకు అదే ఎండ... అదే ఉక్కపోత. అయినప్పటికీ పాదయాత్ర కొనసాగిన దారిపొడవునా జనసంద్రం ఎగసిపడింది.

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీ‌ల్, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ‌ం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు‌ నాయుడు ఆధ్వర్యంలో శ్రీమతి షర్మిలకు హారతులతో స్వాగతం పలికి, పూల బాటలు పరిచారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తన 182వ రోజు సోమవారంనాటి పాదయాత్రను సామర్లకోట, పెద్దాపురం పట్టణాలతో పాటు అనేక గ్రామాల మీదుగా చేశారు. సామర్లకోట యూనియన్ బ్యాంకు సమీపంలో ఆదివారం రాత్రి ఏర్పాటు‌ చేసిన బస నుంచి ఉదయం తొమ్మిది గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నేత రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలను చూడాలని, ఆమెతో మాట్లాడాలని, తమ వెతలు చెప్పుకోవాలని మండుటెండను సైతం లెక్కచేయకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు రోడ్డు వెంట బారులుతీరి గంటల తరబడి ఎదురుచూశారు. శ్రీమతి షర్మిల నడిచే దారిలో పలు చోట్ల పూల బాటలు పరిచారు.

‘ఏమ్మా బాగున్నారా.. త్వరలోనే మంచి రోజులు వస్తాయమ్మా, ధైర్యంగా ఉండండి’ అన్న శ్రీమతి షర్మిల ఆత్మీయ పలకరింపులు విని అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించుకుంటూ చిన్నా పెద్దా అంతా ఆనందంలో మునిగిపోయారు. ప్రసన్న ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న దివంగత మహానేత వైయస్ విగ్రహానికి‌ శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్ర పెద్దాపురం రోడ్డు మీదుగా సాగింది.

పెద్దాపురం సమీపంలో సేవాదళ్ జిల్లా కన్వీన‌ర్ మార్గాని గంగాధ‌ర్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సేవాద‌ళ్ కార్యకర్తలు‌ శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. స్వర్ణదేవాలయం, ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని లూథరన్ చర్చి వద్ద క్రైస్తవులు ‌ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద గల వై‌యస్ విగ్రహానికి‌ శ్రీమతి షర్మిల పూలమాలల వేసి నివాళులు అర్పించారు.

‌దాసాంజనేయ స్వామి ఆలయం సమీపంలో మున్సిపల్ మాజీ వై‌స్ చైర్‌పర్సన్, పట్టణ మహిళా కాంగ్రె‌స్ అధ్యక్షురాలు కాపుగంటి విమల శ్రీమతి షర్మిల సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో చేరారు. భోజన విరామం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు మొదలైన పాదయాత్ర కుమ్మరవీధి, ఆర్టీసీ బస్టాండు, పద్మనాభ కాలనీ, వి.రాగంపేటల మీదుగా కొనసాగింది. దారి పొడవునా ప్రజలు శ్రీమతి షర్మిలకు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ జగనన్న సోదరి ముందుకు సాగారు. గోరింటలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం పులిమేరులో ఆమెకు ఘనస్వాగతం లభించింది. రాత్రి 7.30 గంటలకు గ్రామంలోని పిహెచ్‌సి సమీపంలోని ఆవరణలో ఏర్పాటు చేసిన బస వద్దకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు.

కుష్టురోగులకు షర్మిల ఆత్మీయ పరామర్శ :
‘సరిగా మాత్రలు వేసుకోండమ్మా, వ్యాధి నయమవుతుంది’ అని లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న పలువురికి శ్రీమతి షర్మిల సూచించారు. పాదయాత్ర పెద్దాపురం వైపు సాగుతుండగా లెప్రసీ రోగుల కాలనీ నుంచి పలువురు ఆమెను చూసేందుకు వచ్చారు. ఆమె ఆత్మీయ పలకరింపుతో ఆనందభరితులయ్యారు. 'ప్రభుత్వ సాయం అందుతోందమ్మా? మందులన్నీ అందుతున్నాయా?’ అంటూ అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్లు నిర్మించి ఇచ్చినా పట్టాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు.

పెద్దాపురంలోని స్వర్ణదేవాలయం సమీపంలో విద్యార్థినులతో మాట్లాడిన శ్రీమతి షర్మిల ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ‌గురించి ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆ పథకం సరిగా అమలవక చాలా మంది చదువులు మధ్యలోనే మానేస్తున్నారని వివరించారు. ఈ పథకాన్ని మళ్ళీ సక్రమంగా అమలు చేసేందుకు కృషిచేయాలని వారు కోరగా త్వరలోనే మంచి రోజులు వస్తాయని శ్రీమతి షర్మిల భరోసానిచ్చారు.

రైతులతో మమేకం అవుతున్న షర్మిల :
పాదయాత్రలో పలుచోట్ల శ్రీమతి షర్మిల రైతులతో మమేకమయ్యారు. మహానేత డాక్టర్ వైయస్ ‌సిఎంగా ఉన్నప్పుడు తమ పరిస్థితి బాగు‌న్నదని, ప్రస్తుత ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఉచిత విద్యుత్ మూడు గంటలకు మించి అందడం లేదని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఎ‌న్‌.జి. రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద దుంప రైతులను కలిసిన శ్రీమతి షర్మిల వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మెట్ట, ఏజెన్సీలలోని 80 వేల ఎకరాల్లో దుంప సాగుచేస్తున్నామని కంటే వీర్రాఘవరావు, ఎండ్ర సత్తిబాబు, నల్లల నాగేంద్రబాబు వివరించారు. గిట్టుబాటు ధర కల్పించడం లేదని, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారం అందడం లేదని చెప్పారు.

చెరకు పంట సాగులో పెట్టుబడులు పెరిగిపోతుంటే ఆ మేరకు గిట్టుబాటు ధర అందడం లేదని వడ్లమూరు రోడ్‌లో చెరకు రైతులు వినుకొండ వీర విష్ణుచక్రం, తాటికొండ వెంకటేశ్వరరావు, గంటా రామస్వామి శ్రీమతి షర్మిలకు వివరించారు. మిగిలిన రైతులకు మాదిరి చెరకు రైతులకు విత్తనం కర్ర సబ్సిడీపై ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని వారు కోరారు. ‘త్వరలోనే మంచి రోజులు వస్తా’యని రైతులకు శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

Back to Top