నాడు ఒక చరిత్ర...రేపు గోదావరి చెంత మరోచరిత్ర9 ఏప్రిల్‌ 2003లో వైయస్సార్‌ ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. తన పాదయాత్ర అనుభవాలను ప్రతిరోజు డైరీలో రాసుకున్నారు. 39వరోజు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆ సందర్భంగా వైయస్‌...ఆరోజు రాసుకున్న డైరీలోని అక్షరాలు....


39 వరోజు
ఈరోజు నా పర్యటన పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఘోషించే వేదంలా ఉంది ఇక్కడ జనసంద్రం. ఇక్కడి వాతావరణం చూడగానే తన్మయత్వం  ఆవరించింది. రాజమండ్రి, కోటిలింగాల, ధవళేశ్వరం ఇలా ఇక్కడ ఏ ఇటుకను కదిలించినా శతాబ్దాల చరిత్ర వీనులవిందుగా వినిపిస్తుంది. నీటికి నడకలు నేర్పి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపరభగీరథుడు కాటన్‌దొర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఎక్కడోపుట్టి, పెరిగి ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చిన ఆ మహానుభావుడి తపనలో వెయ్యోవంతు, లక్షోవంతు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి లేకపోవడం బాధగా వుంది.  పైపై ప్రచారానికి పనికొచ్చే ఇంకుడు గుంతలమీద ప్రభుత్వానికి ఎక్కడలేని అభిమానం వుంది.  కాని ఇదమిద్దంగా తాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టు మీద మాత్రం ధ్యాసలేదని, ఇక్కడ కాటన్‌ కృషిని చూసినప్పుడు అనిపిస్తుంది. తాగునీరు, సాగునీరు వున్నా అధిక కరెంటు బిల్లులు, నిరుద్యోగం, ప్రభుత్వపథకాల అమలులో వివక్ష ఇలా సవాలక్ష సమస్యలు ఇక్కడివారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే  దారి పొడవునా వేలమంది కిలోమీటర్ల మేర పాదయాత్రలో కదం కలుపుతున్నారు. 
గోదావరి నదిపై రైలు, రోడ్డు వంతెనపై నాలుగున్నర కిలోమీటర్ల మేరకు జనసంద్రంలా, మువ్వన్నెల జెండా రెపరెపలతో పాదయాత్ర సాగింది. అమీబియాసిస్‌ వల్ల ఉదయం పాదయాత్రలోనూ, మధ్యాహ్నం విరామంలోను ఇబ్బంది పడ్డా. జనస్పందన, ఉత్సాహం ముందు ఆ ఇబ్బంది ఎంతోసేపు నిలవలేదు. వైద్యపరీక్షల అనంతరం యధావిధిగా నడకసాగింది. పశ్చిమగోదావరిలో స్నానం చేసి, ఇలాగే మిగతా ప్రాంతాల్లో కూడా నదీజలాలు బీడు పడ్డ భూముల్ని సస్యశ్యామలం చేయాలని మనసారా కోరుకున్నాను. 
కొట్టుకుపోయినవి కోటిలింగాలు  వీరేశలింగమొకడు మిగిలిన చాలు అని ఆరుద్ర అన్నట్లు, వీరేశలింగం రగిలించిన స్పూర్తిని స్మరించుకొంటూ పాదయాత్ర రాజమహేంద్రవరంలోని బహిరంగసభకు చేరింది. 
 
 
Back to Top