మోసం..మోసం.. మళ్లీ మళ్లీ మోసం

- ముస్లింలపై మళ్లీ మంత్రి పదవి వల
- 2014లో 15 మంది మైనారిటీలకు టిక్కెట్‌ ఇస్తామని మోసం 
- 2019కు ముందు మంత్రి పద‌వుల పందేరం
- ఎమ్మెల్యేని కాపాడాలేని భ‌ద్ర‌తా వైఫల్యం బ‌య‌ట‌కు రాకూడ‌ద‌నే కిడారి కొడుక్కి మంత్రి ప‌ద‌వి..!

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ముస్లింలను పావులుగా వాడుకునేందుకు సిద్దమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు చెప్పిన అవే మాయ మాటలను మళ్లీ మళ్లీ వినిపించి వశ పరుచుకోవాలని చూస్తున్నాడు. ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న దగ్గర్నుంచి ఒక పద్దతి ప్రకారం నరేంద్రమోడీని విమర్శిస్తూ ముస్లింల ఓట్లకు గాలం వేస్తున్నాడు. ‘నారా హమారా.. టీడీపీ హమారా’ అంటూ తేనె పూసిన కత్తితో ముస్లింలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యాడు చంద్రబాబు. 
ఎన్నికలొస్తే ముస్లింలు గుర్తుకొస్తారు
నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఒక్కరినీ మంత్రిని చేయలేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు గుంజుకునేందుకు కొత్త కార్యక్రమానికి తెరలేపాడు. గడిచిన ఎన్నికల్లో ముస్లింలకు 15 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కరిద్దరితో సరిపెట్టారు.  కొడుకు లోకేష్‌ను పోటీ చేయకుండానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. కనీసం ఆ విధంగా కూడా ఒక్క ముస్లింను కూడా మంత్రిని చేయలేదు. తప్పినిసరి పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో ఫరూక్‌ను ఎమ్మెల్సీని చేశాడు. ముస్లింలకు మంత్రి పదవి ఇస్తానన్నాడు. నంద్యాల ఎన్నికలకు ముందు రంజాన్‌ రావడంతో రూ. 93 లక్షలు ఖర్చు చేసి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశాడు. ఎలాగైతేనేం.. నంద్యాల ఎన్నికల్లో గెలిచాడు. అంతే.. చెప్పినవన్నీ మరిచిపోయాడు. ముస్లింలకు మంత్రి పదవి లేదు. 15 మందికి ఎమ్మెల్యే టిక్కెట్‌లు ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. చివరికి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. పార్టీలో  చేరితే మంత్రి పదవులు దక్కుతాయన్న హామీతో టీడీపీలో చేరిన వారిద్దరికీ హామీ నెరవేర్చలేదు. ముస్లిం ఎమ్మెల్యేలను విస్మరించారు. భారతదేశంలో ఇప్పటి వరకు ముస్లింలు ప్రాతినిథ్యం లేని కేబినెట్‌ నడుపుతున్న ఒకే ఒక్క సీఎంగా చంద్రబాబు అపఖ్యాతి మూటగట్టుకున్నారు. 
ఐదు నెల‌ల ముందు మంత్రి ప‌ద‌వులా
చంద్ర‌బాబుకు ముస్లింల మీద అంత గౌర‌వం ఉంటే.. నాలుగేళ్లలో ఒక్క‌రికీ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ముస్లిం నాయ‌కులు లేకున్నా.. ముస్లింల అభివృద్ధిని కోరుకునే వాడే అయితే.. నామినేటెడ్ ప‌ద‌వులు అప్ప‌ట్లోనే వారి పార్టీ వాళ్ల‌కు ఇచ్చేవాడే. అలా కాదు.. ఎమ్మెల్యేల‌కే ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు వైయ‌స్ ఆర్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన జ‌లీల్‌ఖాన్‌, చాంద్‌బాషాల్లో ఒక్క‌రికైనా మంత్రి ప‌ద‌వి ఇచ్చేవాడే. అలా కాదు ఫ‌రూఖ్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే ఆనాడే ఎందుకివ్వ‌లేద‌నేది ముస్లింల ప్ర‌శ్న‌. నాలుగున్న‌రేళ్లు ఏనాడూ ముస్లింలను ప‌ట్టించుకోని చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల‌కు ముందు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా  ముస్లిం సామాజిక వ‌ర్గం ఓట్లు పొందాల‌ని క‌ల‌లు కంటున్నాడు. 
కిడారి కొడుక్కి ఇందుకే ఇచ్చారా...
కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు మ‌ర‌ణించిన‌ప్పుడు.. దాని వెనుక కుట్ర కోణాలు వెలుగులోకి వ‌చ్చాయి. న‌క్స‌లైట్ల‌కు టీడీపీ నాయ‌కులే ఆశ్ర‌య‌మిచ్చి ఎమ్మెల్యే చావుకు కార‌ణ‌మ‌య్యార‌ని వార్త‌లొచ్చాయి. దానితోపాటు న‌క్స‌లైట్లు రాసిన లేఖ‌లో పార్టీ ఫిరాయించినందుకే చంపామ‌ని.. బాక్సైట్ నిక్షేపాల‌పై క‌న్నేశార‌ని.. వంద‌ల కోట్ల‌లో లూటీ జ‌రుగుతోంద‌ని.. గిరిజ‌నుల‌కు న‌ష్టం చేస్తున్నార‌ని ఆరోపించారు. అంటే చంద్ర‌బాబుకు తెలియ‌కుండా బాక్సైట్ నిక్షేపాల త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌వు. ఆయ‌న హ‌స్తం త‌ప్ప‌కుండా ఉండి ఉంటుంది. దాడి గురించి లోతైన విచార‌ణ జ‌రిగి ఉంటే.. టీడీపీ నాయ‌కులు ఉన్నార‌ని తెలుస్తుంది. ఇది పార్టీకి చెడ్డ‌పేరు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. ఎమ్మెల్యేను కాపాడ‌లేని స‌ర్కారు అని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం తేట‌తెల్లం అవుతుంది. ఇవ‌న్నీ జ‌రిగితే చంద్ర‌బాబుకే ప్ర‌మాదం. అందుకే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెట్టి కిడారి కొడుకుని మంత్రిని చేశార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 

Back to Top