పూడి శ్రీహరిపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చ‌ర్య‌లు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్రమ అరెస్ట్ 

గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తరలింపు.. వైద్య పరీక్షలు 

గుంటూరు: వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీ‌హ‌రిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వద్ద సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం వివాదాస్పదమైంది.

నిన్న కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు మరో కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇది మూడోసారి అరెస్టు కావడం గమనార్హం. సీఎం చంద్ర‌బాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేశారన్న ఆరోపణలతో శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

శుక్రవారం ఉదయం పూడి శ్రీహరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)కు ఆటోలో తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న కుప్పంకు నాలుగు వాహనాల్లో వెళ్లి హడావిడిగా అరెస్టు చేసి గుంటూరుకు తీసుకువచ్చిన పోలీసులు, ఇవాళ ఆయన్ను ఆటోలో తరలించడం చర్చనీయాంశంగా మారింది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని  పోలీసులు ఆసుపత్రిలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఎమర్జెన్సీ వార్డు గేట్లు మూసివేయడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. “నేను శ్రీహరి కోసం కాదు, మరో రోగిని చూడటానికి వచ్చాను” అని అప్పిరెడ్డి చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ఆసుపత్రి గేట్లు మూసివేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
 

Back to Top