మెడికల్ హబ్ లో మరణ ఘోష


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను మెడికల్ హబ్ చేసేస్తానని ఏడాదికోసారైనా అంటుంటారు. రాష్ట్రం నలుమూలలా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ అయిపోతోందని ఆర్భాటంగా చెప్పుకుంటారు. కానీ రాజధాని నగరం గుంటూరు ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్  అత్యున్నత ప్రమాణాలతో ప్రాణాలు గాల్లో కలుపుతోంది. దిక్కులేక, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక ప్రభుత్వాసుపత్రికి చేరిన సీరియస్ పేషంట్ల ప్రాణాలు గాల్లో దీపాలే. జీజీహెచ్ అత్యవసర విభాగం వెయిటింగ్ హాల్ లో మూడురోజులుగా పడిఉన్నా పట్టించుకోకపోవడంతో ఓ మహిళ మృతి చెందింది. ఆసుపత్రి ఆవరణలోనే, అత్యవసర విభాగం వద్ద, నిత్యం డాక్టర్లు తిరుగుతూ ఉండే ప్రదేశంలోనే వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తూ మరణించిందా అభాగిని. మూడు రోజులుగా డాక్టర్లను, సిబ్బందిని బతిమాలినా ఏ ఒక్కరూ కనికరించి రోగిని చూడనైనా లేదని బాధితులు వాపోవడం మానవత్వం ఉన్న ఎవ్వరి మనసునైనా కలిచేస్తుంది. 
టెక్నాలజీ ముఖ్యమంత్రిగారి పాలనా ప్రాంతం, అమరావతిలో ఉంటే పదేళ్ల ఆయుష్షు పెరుగుతుందని చెప్పే చంద్రబాబుగారి నివాసప్రాంతం కూడా ఈ జీజీహెచ్ పరిధిలోనే ఉంది. విదేశాలనుంచి వచ్చేవారికి తప్ప బాబుగారు చెప్పిన ఆయుష్షు ఈ రాష్ట్రంలో, ఈ అమరావతిలో బతికే వారికి వర్తించదల్లే ఉంది. మెడికల్ హబ్ గా మారే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మనుషుల ప్రాణాలకు చీమలు, దోమలకున్న పాటి విలువ కూడా లేదు. ఇదే ఆసుపత్రిలో నాలుగేళ్ల క్రితం అప్పుడే పుట్టిన పసికందును ఎలుకలు కొరికితిన్నాయి. ఇదే ఆసుపత్రిలో కరెంటు లేక సెల్ ఫోన్ లైట్ లో ఆపరేషన్ లు జరిగాయి.  ఆసుపత్రి గుదుల్లోనే కత్తులతో మారణాయుధాలతో దాడులు జరిగినా పట్టించుకునే నాథుడు ఉండడు. జీజీహెచ్ గేటు బయట వైద్యంకోసం ఎదురుచూస్తూ రోగులు మరణించిన సంఘటనలెన్నో.  ఇలా ఎన్ని జరిగినా సరే బాబుగారి పాలనలో ఆంధ్రరాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశే. అమరావతి ఆయుష్షును పెంచే స్వర్గమే. మరణమృదంగాల ప్రభుత్వాసుపత్రులు ఒక్కొక్కటీ ఒక్కో మెడికల్ హబ్ లే. 

Back to Top