స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం ఏమేమి ఒరగదోసి కరగబోసిందో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏకరువు పెట్టే సమయంలోనే ...స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం ఏమేమి ఒరగదోసి కరగబోసిందో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏకరువు పెట్టే సమయంలోనే వివిధ ప్రాంతాల్లో మూడు ఘోరాలు జరిగిపోవడం దారుణం! ప్రజా సేవలో తనకు లభిస్తున్న తృప్తి నాయకత్వం చెలాయించడంలో దక్కడం లేదని ముఖ్యమంత్రి -వేదాంత ధోరణిలో- ఉపన్యాసం వెలువరించారు. అయితే, ఆయనంతగా పడదోస్తున్న ప్రజాసేవ ఏమిటో ఓ పట్టాన బోధపడడంలేదు. రాష్ట్ర రాజధానీ నగరానికి చేర్చి ఉన్న పారిశ్రామిక వాడ జీడిమెట్లలో ఈ ఉదయమే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేలే స్వభావం కలిగిన ప్రమాదకరమయిన రసాయనాలతో నిండిన పీపా పేలి పది కిలో మీటర్ల దూరం వరకూ పొగలు అలుముకున్నాయట! ఇక హైదరాబాద్‌కు సమీపంలోనే ఉండే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పట్టణం షాద్ నగర్‌లో ఓ స్టీల్ కోర్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్ పేలి ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ఆదిలాబాద్ నగరం నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న భవనం కూటిపడి ఓ కూటీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరిని శిథిలాల కిందనుంచి వెలికి తీసి ఆస్పత్రికి చేర్చారు- వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఈ సంఘటనలకూ స్వాతంత్య్ర దినోత్సవానికీ ప్రత్యక్షంగా సంబంధం లేకపోవచ్చు. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం భద్రత ప్రమాణాల విషయంలో ఎంత దారుణమయిన స్థితిలో ఉందో అర్థం చేసుకోడానికి ఈ వివరాలు సహాయపడతాయి. రాష్ట్ర ప్రజలకు కనీస భద్రత కల్పించడమనేది ప్రజాసేవకు తొలిమెట్టు. బుధవారం నాటి సంఘటనలు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఈ మెట్టుకన్నా ఎన్నో యోజనాల దిగువన అఘోరిస్తోందని అర్థమవుతోంది. ‘మీ సేవ’ ద్వారా ఇప్పటికి 34 రకాల సేవలు అందిస్తున్నామనీ, త్వరలోనే వీటి సంఖ్యను వందకు పెంచుతామనీ ముఖ్యమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సెలవిచ్చారు. ప్రజా సేవలో రాశికన్నా వాసికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకుంటే బావుంటుంది.జీడిమెట్లలో జరిగిన సంఘటనలలాంటివి సిటీ చుట్టుపక్కల తరచూ జరుగుతూనే ఉన్నాయి. అవే కాకుండా మరెన్నో అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆరు నెలల కిందట -ఫిబ్రవరి 18న-రంగారెడ్డి జిల్లా కిందకు వచ్చే నగర శివారు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పసివాళ్లతో సహా ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. సరయిన ప్రమాణాలు పాటించని ఎల్పీజీ సిలిండర్ పేలినందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానించారు. దాదాపు మూడు నెలల కిందట -మే 27న- బేగంపేట ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ తగలబడి కోట్ల రూపాయల విలువ చేసే సంపద సర్వనాశనమయింది. ఈ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం నుంచి రక్షణ సౌకర్యం లేకపోవడం వల్లనే ఇంత భారీ నష్టం జరిగిందని నిపుణులు తేల్చారు. అంత పెద్ద భవంతిలో అలాంటి సౌకర్యం ఉందో లేదో చూసుకోకుండానే అన్నాళ్లుగా గుడ్డి దర్బారు చెలాయించింది కిరణ్ సర్కారే! ఈ సంఘటన జరిగిన మూడో రోజునే ఆబిడ్స్‌లోని ఫంటూష్ షోరూమ్ తగలబడిపోయి అరకోటి రూపాయల సంపద నాశనమయిందని పత్రికల్లో వార్తలొచ్చాయి. అదే రోజున నాచారం పారిశ్రామిక వాడలో ఒక రసాయనాల గోదాము తగలబడి లక్షల రూపాయల సొమ్ము పరశురామప్రీతి అయింది. ఈ రెండు సంఘటనలూ దాదాపు అరగంట వ్యవధిలోనే జరగడం కాకతాళీయమే కావచ్చు. కానీ, ఆరేడు గంటల వరకూ మంటలు అదుపులోకి రాకపోవడం మాత్రం కేవలం అసమర్ధతకు నిదర్శనం. జూన్ నెల 13న కుక్కట్‌పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం భీతాహం సృష్టించింది. కరెంట్ సరఫరా విషయంలో సక్రమమయిన భద్రత ప్రమాణాలు పాటించనందువల్లనే 75 దుకాణాలూ, నాలుగు నిండు లారీలూ ఈ దుర్ఘటనలో తగలబడిపోయాయి. ఇలాంటి భారీ దుర్ఘటన ఒక్కటయినా జరగనిదే, ఏ నెలా గడవడం లేదు. ఇవన్నీ చెప్పేదేమిటి? ఈ రాష్ట్రంలో వర్త వాణిజ్య పారిశ్రామిక సంస్థల విషయంలో భద్రత నిబంధనల అమలు పరమ నీచంగా ఉందని! పెద్దపెద్ద కబుర్లూ, వేదాంత ప్రసంగాలూ చేయడం ఆపి, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని భద్రత యంత్రాంగం కనీస విధినిర్వహన్ చేసేందుకు చర్యలు తీసుకుంటే, అది నిజమయిన ప్రజాసేవ అనిపించుకుంటుంది! జనం కూడా కాస్తో కూస్తో సుఖపడతారు!