మరో ప్రజా ప్రస్థానంలో జన తుపాను

కూడేరు:

మరో ప్రజాప్రస్థానాన్ని ‘జన’ తుపాను జోరు పెరుగుతోంది. నానాటికీ  షర్మిల వెంట ప్రజలు తండోపతండాలుగా కదం తొక్కుతుండటంతో జన తుపాను బలబడుతోంది. కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో ప్రళయం సృష్టిస్తోంది. మహానేత వైయస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలం ముద్దలాపురం, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేటల్లో జనం పోటెత్తారు. నీలం తుపాన్ ప్రభావం వల్ల జోరుగా వర్షం కురిసినా జనం చెక్కుచెదరలేదు. సరి కదా సమయం పెరిగే కొద్దీ జనం రెట్టింపయ్యారు.
బుధవారం రాత్రి కూడేరుకు నాలుగు కిమీలోమీటర్ల దూరంలో బస చేసిన షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించే సరికి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ముద్దలాపురం శివారులో ఇద్దరు మరుగుజ్జు మహిళలను అప్యాయంగా పలకరించిన షర్మిల.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ‘అమ్మా.. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు నెలకు రూ.వెయ్యి చొప్పున వికలాంగులకు పింఛను వస్తుంది’ అంటూ ధైర్యం చెప్పడంతో వారి కళ్లలో వెలుగులు నిండాయి. ముద్దలాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన షర్మిల.. విద్యార్థులతో మమైకమయ్యారు. బాగా చదువుకోవాలని సూచించారు. ఆ తర్వాత ముద్దలాపురంలో షర్మిలకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీసి, ఇంటి బిడ్డలా ఆదరించారు. వారి ఆదరణకు షర్మిల ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

Back to Top