మణిపూర్ పక్కలో బల్లెం!

దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా సాగుతున్న వేళ, ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.

దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా సాగుతున్న వేళ, ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మూడు చోట్ల, మారుమూల జిల్లా థౌబాల్‌లో ఒకచోట బాంబులు పేలాయి. ఇంతవరకూ అందిన సమాచారం ప్రకారం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
మణిపూర్‌లో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారిణుల జయపతాకాన్ని వినువీథుల ఎగరేసిన మేరీ కామ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. అలాగే, భవిష్యత్తున్న బాక్సర్ అనిపించుకున్న వేవేంద్ర సింగ్‌ది కూడా మణిపూరే. లండన్‌లో దేశప్రతిష్టను ఇనుమడింపచేసిన ఈ క్రీడాకారులకు రాష్ట్రప్రభుత్వం భారీ పురస్కారాలను అందించడం ఒక ఎత్తు. సామాన్య ప్రజానీకం నుంచి వారికి దక్కిన ఆదరాభిమానాలు మరో ఎత్తు. ఈ నేపథ్యంలోనే, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం మణిపూర్‌లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, ఆ రాష్ట్రంలో చెలరేగుతున్న తీవ్రవాదులు ఈ ఉత్సవాల్లో పాల్గోడానికి వీల్లేదని ‘నిషేధాజ్ఞలు’ విధించారు. భారత దేశంలో తమ రాష్ట్రాన్ని కానీ, ప్రజలను గానీ భాగంగా పరిగణించడం లేదంటూ మణిపూరీ తీవ్రవాదులు ఈ ‘ఆదేశాలు’ జారీచేశారు. అయితే, మణిపూరీలు మేరీ కామ్‌ను ఎంతగా అభిమానిస్తున్నారో అందరికీ తెలిసిందే. కరెంటున్న కొద్ది సమయంలోనే మేరీ పాల్గొన్న పోటీల క్యాసెట్లను (రీప్లేలనే!) చూసేందుకు మణిపూర్ క్రీడాభిమానులు ఎగబడుతున్నారని జాతీయ మీడియా -సచిత్రంగా- ప్రకటించింది. అయితే, ప్రజల అభిప్రాయాలతో తీవ్రవాదులకు సంబంధమేముంది? అందుకే, అగస్ట్ 15 వేడుకల్లో ఎవ్వరూ పాల్గొనరాదంటూ కఠినమయిన ఆదేశాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో సంభవించిన నాలుగు పేలుళ్ల వెనుక తీవ్రవాదుల హస్తం ఉందని పరిశీలకులు అనుమానిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కూడా ప్రమాదకరమయిన ప్రమాణాలకు చేరుకుంది. ఇంఫాల్‌లో జరిగిన ఒక బాంబు -ముఖ్యమంత్రి పాల్గొన్న ఉత్సవం జరిగే వేదికకు- రెండుకిలోమీటర్ల లోపే పేలడం గమనార్హం. కాగా, ఇదే వేదికకు మరింత చేరువలో -కిలోమీటరు దూరంలోనే- మరొక పేలని బాంబు బయటపడిందట. ప్రభుత్వం చేసుకున్న భద్రత ఏర్పాట్లు ఇంత ఘనంగా ఉన్నాయన్నమాట! ఈ సందర్భంగా ఒక మాట చెప్పక తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట వ్యతిరేక శక్తుల నుంచి పాలకులను కాపాడగలిగే శక్తి ప్రజల కు మాత్రమే ఉంటుంది. ప్రజల్లో వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించడంలో విఫలమయిన నేతను ఎంత గొప్ప భద్రత వ్యవస్థ అయినా కాపాడలేదు. ఇందిరా గాంధీ నుంచి బే నజీర్ భుట్టో వరకూ అందరి కథలూ చెప్పే వాస్తవమిదే. మణిపూర్ లో కథ వేరేవిధంగా ఉండే అవకాశం లేదు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఓ ఇబోబీ సింగ్ తీవ్రవాద శక్తులను -సైనికంగా- అరికట్టడంలో ఓ మేరకు విజయం సాధించి ఉండవచ్చు. మేరీ కామ్, దేవేంద్రొ సింగ్ తదితర క్రీడాకారులకు భారీ నగదు పురస్కారాలు ప్రకటించి జనాదరణకు నోచుకునికూడా ఉండవచ్చు. అయితే, దశాబ్దాల తరబడి పేరుకుపోయిన మణిపూర్ విభజనవాద పోరాటానికి రాజకీయ, సామాజిక పరిష్కారం సాధించే క్రమంలో అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ఈ తరహా ఉద్యమాలను కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడడంవల్ల ప్రయోజనం శూన్యం. ఈ శక్తుకు జీవశక్తినిచ్చే సామాజిక ఆర్థిక సమస్యలను రాజకీయ స్ఫూర్తితో పరిష్కరించే ప్రయత్నం చెయ్యకపోతే, ఈ పక్కలో బల్లెం ఎప్పుడూ గుచ్చుకుంటూనే ఉంటుంది. బుధవారం నాటి సంఘటనలే ఇందుకు సాక్ష్యం!

Back to Top