మమత దెబ్బకు యూపీఏ కుదేలు

డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధింపు,  ఎఫ్‌డీఐలకు రిటైల్ రంగంలో అనుమతి అంశాలు  కేంద్రంలోని యూపీఏ-2 ప్రభుత్వానికి ఇరకాటాన్నే తెచ్చిపెట్టింది. ఈ నిర్ణయాలపై ఆగ్రహించిన 19మంది ఎంపీలున్న తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. యూపీఏ విధానాలకు ప్రజల మద్దతు ఉందా లేదా అనే అంశాన్ని రూఢీచేసుకోడానికి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామం సహజంగానే కేంద్రాన్ని మైనార్టీలో పడేసింది. 
తమ మద్దతు కొనసాగుతుందన్న డీఎంకే ప్రకటన, సమాజ్ వాదీ పార్టీ కర్ర లాగేసే ప్రయత్నాన్ని చేయడకపోవడం కొంత ఊరట కలిగించే అంశాలు. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠ మసకబారి ఇబ్బందులో ఉన్న తరుణంలో కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయబోదని మిగిలిన పార్టీలు భావిస్తున్నాయి. 
సంస్కరణల పేరుతో ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనవని.. యూపీఏ విధానాలకు ప్రజల మద్దతు ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రధాని రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజా మద్దతును నిర్ధారించుకోవడానికి మన్మోహన్ తాజా తీర్పును కోరాల్సిన అవసరం ఏర్పడిందని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ప్రైవేట్ గవర్నమెంట్ లాగా యూపీఏ వ్యవహరిస్తోందని పదునైన వ్యాఖ్యల్ని తృణమూల్ సంధించింది. ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకే యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత విధానాలతో ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కును మన్మోహన్ సర్కార్ కోల్పోయిందన్నారు. ప్రధానిపై మన్మోహన్ పై విమర్శల జోరును మమతా బృందం మరింత పెంచింది.  యూపీఏ ప్రభుత్వంపై విమర్శలను చేస్తూనే ప్రస్తుత పరిస్థితిని మహాభారత యుద్దంతో పోల్చుతూ ఆ పార్టీకి చెందిన ఎంపీ కునాల్ ఘోష్ గమ్మత్తయిన వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో కృష్ణుడి నుంచి ధుర్యోధనుడు సైన్యాన్ని కోరుకుంటే.. అర్జునుడు తెలివిగా కృష్ణుడిని కోరుకున్నాడు. ఆతర్వాత రథసారధిగా కృష్ణుడి సలహాలు, సూచనలతో అర్జునుడు యుద్దాన్ని జయించారని కునాల్ పురాణాల్ని తవ్వారు. ఇక్కడ కునాల్ చెప్పిన ఆసక్తికరమైన విషయమేమిటంటే.. దీదీని కృష్ణుడినితో పోల్చటం.. యూపీఏ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంటే.. తమకు దీదీ మమతా ఉందని కునాల్ ధీమా వ్యక్తం చేశారు. మహాభారత యుద్దంలో కృష్ణుడు అండతో అర్జునుడు గెలిస్తే.. తాము దీదీ అండతో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తామనే ధోరణిలో సదరు ఎంపీ కొంచెం ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
ప్రస్తుత లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543. మంగళవారం ఉదయం వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకున్న సంఖ్యాబలం 272. అంటే ప్రభుత్వం మైనారిటీలో పడిపోకుండా బొటాబొటి మద్దతు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు 19 మంది లోక్‌సభ సభ్యులుగల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వ బలం 253కు పడిపోయింది. ప్రభుత్వానికి వెలుపలి నుంచి సమాజ్‌వాది పార్టీ (22), బహుజన్ సమాజ్ పార్టీ (21)లతో పాటు మరో మూడు చిన్న పార్టీల నుంచి 9 మంది సభ్యులు మద్దతిస్తున్నారు. తృణమూల్ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత యూపీఏ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేదు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పేందుకు ఇప్పటి నుంచే తృతీయ ఫ్రంట్ కోసం పావులు కదుపుతున్న ములాయం ఎప్పుడైనా మన్మోహన్ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పొచ్చు. అదే జరిగితే యూపీఏ ప్రభుత్వం మరింత బలహీనపడి దాని బలం తగ్గి ప్రమాదంలో పడవచ్చు. అప్పటికి కూడా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు గానీ చిన్నాచితకా పార్టీల ఒత్తిళ్లకు సైతం తలొగ్గాల్సి వస్తుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికే మొగ్గుచూపి తృణమూల్‌ను కాదనుకున్న మన్మోహన్ వ్యూహం భవిష్యత్‌లో ఎలా ఉంటుందో రానున్న పరిణామాలే తేల్చాలి.

Back to Top