కల్తీ విత్తనాలతో మోడులవుతున్న పొలాలు

గూళ్యపాళ్యం

: ఉరవకొండ నియోజకవర్గం గూళ్ళపాళ్యంలో మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల రచ్చబండ నిర్వహించారు. భారీ జనసందోహం  అందులో పాల్గొంది. ఆ గ్రామ ప్రజలు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు.  ప్రజల సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ‘అమ్మా.. ప్రభుత్వం రాయితీపై అందిస్తోన్న విత్తనాల్లోనే కల్తీ విత్తనాలు ఇస్తున్నారు. అవి కూడా పంట కాలం పూర్తయిన తర్వాత ఇస్తున్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ ఆ గ్రామానికి చెందిన ఓ రైతు షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా ఇదో కల్తీ సర్కారు. అందుకే కల్తీ విత్తనాలు ఇస్తోంది.. కల్తీ ఎరువులు అంటగట్టి రైతులను దగా చేస్తోంది. రాజన్న హయాంలో రైతే రాజు.

జగనన్న ముఖ్యమంత్రయితే రైతే రాజవుతారు
     కొన్నాళ్లు ఆగితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అయితే రైతే రాజవుతారు’ అంటూ ధైర్యం చెప్పారు. ఇంతలోనే మరో రైతు స్పందిస్తూ.. ‘అమ్మా 2010 ఇన్‌పుట్ సబ్సిడీనే ఇప్పటిదాకా ఇవ్వలేదు.. 2011 ఇన్‌పుట్ సబ్సిడీ నేటికీ చేరలేదు. వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీరే ఆదుకోవాలి’ అంటూ కోరారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ... ‘అన్నా ఇది కోతల సర్కారు. అందుకే మాటలు చెబుతోంది. కొన్నాళ్లు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యంలో రైతుకు జగనన్న అండగా ఉంటారు’ అంటూ ధైర్యం చెప్పారు. ‘అక్కా హాస్టల్‌లో పురుగుల అన్నం.. నీళ్ల సాంబారు పోస్తున్నారు. వాటిని తిని జబ్బుల బారిన పడుతున్నాం’ అంటూ ప్రభుత్వ హాస్టల్‌లో చదువుతోన్న విద్యార్థులు షర్మిల ముందు వాపోయారు. దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘తమ్ముడూ.. జైల్లో ఉన్న ఖైదీలకే రోజుకు రూ.40 వంతున మెస్ చార్జీలు ఇస్తున్నారు. విద్యార్థులకు మాత్రం రూ.17 ఇస్తున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఈ కష్టాలు కొద్ది రోజులే. ఓపికపట్టండి.. జగనన్న సీఎం అయితే అన్నీ సర్దుకుంటాయి’ అంటూ హామీ ఇచ్చారు.
ఉరవకొండలో ముగింపు..
     గూళ్యపాళ్యం నుంచి కొనకొండ్లకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కొనకొండ్ల బహిరంగసభకు భారీ ఎత్తున జనం పోటెత్తారు. ఈ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘రెండో సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండు హామీలు ఇచ్చారు. వాటిలో ఒకటి సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్.. రేషన్‌కార్డులకు అదనంగా పది కేజీల బియ్యం. కానీ.. ఈ ప్రభుత్వం సేద్యానికి రెండు మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు. రూపాయికే కిలో బియ్యం పేరుతో దగా చేస్తోంది. వైయస్ ఇచ్చిన హామీ మేరకు రూ.2కే కిలో బియ్యం ఇస్తే రూ.60 వెచ్చిస్తే సరిపోతుంది. రూపాయికే కిలో బియ్యం వల్ల 20 కేజీల బియ్యానికి రూ.20.. పది కేజీల బియ్యాన్ని బయట కొంటే రూ.వంద.. మొత్తం రూ.120 వెచ్చించాల్సి వస్తోంది. రూపాయికే కిలో బియ్యం పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది.

     విద్యుత్తు సంక్షోభానికి ఈ ప్రభుత్వ విధానాలే కారణం.. జనం అష్టకష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజల కోసం పోరాడుతోన్న జగనన్నపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా జైలుకు పంపారు. జగనన్నను ఆశీర్వదించండి.. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.. అప్పుడు వైయస్ ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుంది.. అన్ని వర్గాల ప్రజలకూ మంచి జరుగుతుంది’ అంటూ హామీ ఇచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎనిమిది రోజులపాటు సాగిన పాదయాత్ర మంగళవారంతో ముగిసింది. బుధవారం గుంతకల్లు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. మంగళవారం పాదయాత్రను రాత్రి 8 గంటలకు కొనకొండ్ల శివారులో ముగించిన షర్మిల అక్కడే బస చేశారు. మంగళవారం 12.5 కిలోమీటర్లు నడిచారు.

Back to Top