జగనన్నను ఆశీర్వదిస్తే.. రాజన్న రాజ్యం

ప్రజలు విన్నవించుకుంటున్న సమస్యలను షర్మిల  ఎంతో ఓపికగా వింటున్నారు. తదుపరి వారికి చెబుతున్న సమాధానం ఒక్కటే.. ‘జగనన్నను ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు మీ అందరికీ మేలు జరుగుతుంది’.
     ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో షర్మిలకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఉరవకొండ మార్కెట్‌ యార్డు నుంచి ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించిన షర్మిల వెంట పెద్ద ఎత్తున జనం వెంటనడిచారు. ఆయా గ్రామాల్లో ప్రజలు వారి కష్టాలు చెప్పుకుంటుంటే.. షర్మిల ఎంతో ఓపికతో వారి సమస్యలను విని ధైర్యం చెప్పారు. గడేహోతూరు, చిన్నహోతూరుకు చెందిన గొర్రెల కాపరులు పూజారి సురేష్, సిద్ధప్ప, సుంకన్నలతో షర్మిల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నాడందిన బీమా నేడు కరవు

      ‘అమ్మా.. వైయస్ ఉన్నప్పుడు గొర్రెలకు రూ.18 కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం వచ్చేది. అప్పుడు మందులు కూడా సక్రమంగా వేసేవారు. కానీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం బీమా రద్దు చేసింది. మందులు కూడా సక్రమం గా ఇవ్వడంలేదు. అంటువ్యాధులతో గొర్రెలు చనిపోతున్నాయి. మాకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. మీరే ఆదుకోవాలి’ అంటూ కోరారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ..‘అన్నా.. ఈ ప్రభుత్వానికి కులవృత్తులంటే ఎంత చిన్నచూపో దీన్ని బట్టే అర్థమవుతోంది. సీఎం కిరణ్‌కు ప్రజల సమస్యలు పరిష్కరించే తీరిక లేదు. ఢిల్లీ వెళ్లి పదవిని కాపాడుకోవడానికి సమయం చాలడం లేదు. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న గొర్రెల కాపరులను ఆదుకుంటారు. 103 పేరుతో మొబైల్ వెటర్నరీ సర్వీసును ఏర్పాటుచేసి గొర్రెలు, మేకలకు వైద్య సహాయం అందిస్తాం’ అంటూ హామీ ఇచ్చారు.

పచ్చి అబద్ధాల కోరు మంత్రి రఘువీరా..
     గాలిమరల సర్కిల్ నుంచి కొద్ది దూరం వెళ్లగానే రైతులు చెన్నయ్య, బెస్త ముసలప్ప, రామాంజనేయులు కుళ్లిపోయిన వేరుశనగ కట్టెను షర్మిలకు చూపించి, బోరున విలపించారు. ‘అమ్మా.. వర్షాభావ పరిస్థితుల వల్ల అరకొరగా వేరుశనగ దిగుబడి వచ్చింది. కానీ.. వేరుశనగ కట్టె తొలగించిన తర్వాత వర్షం వచ్చింది. ఆ వర్షానికి వేరుశనగ కట్టె కుళ్లిపోయి.. ఎందుకూ పనికి రాకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అంద డం లేదు. మంత్రి రఘువీరా పూటకో అబద్ధం చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు. వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వైయస్ ఉన్నప్పుడు పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ సక్రమంగా అందేవి’ అంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంతలోనే రామాంజనేయులు అనే రైతు మాట్లాడుతూ ‘అమ్మా.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచారానికి పెట్టిన ఖర్చులో కొంత మొత్తం రైతుల కోసం వెచ్చిస్తే చాలు.. రైతులు సంతోషంగా ఉంటారు’ అంటూ విలపించారు.

    ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. ఈ ప్రభుత్వానికి రైతులంటే చులకన. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకూ అంతే. ఆయన కాలంలో రైతులను చిన్నచూపు చూడటం వల్లే నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాడింది ఒక్క వైయస్సే. ఇప్పుడు జగనన్న రైతుల కోసం పోరాడుతున్నారు. జగనన్నను ఆశీర్వదించండి. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు మీ కష్టాలు అన్నీ తీరుతాయి’ అంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పప్పుశనగ రైతులతో సమావేశమయ్యారు. ‘అమ్మా.. పప్పుశనగ విత్తనాలను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయడం లేదు. రైతులు అంతా పప్పుశనగ విత్తాక ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసింది’ అంటూ చాబాల నారాయణస్వామి అనే రైతు షర్మిలకు వివరించారు.

కొద్ది రోజులు ఓపికపట్టండి: షర్మిల

    ‘అన్నా.. కొద్ది రోజులు ఓపికపట్టండి.. జగనన్న సీఎం అవుతారు. అప్పుడు సక్రమంగా విత్తనాలు, ఎరువులు అందిస్తాం’ అంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పీసీ ప్యాపిలి క్రాస్ సమీపంలో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత 3.30 గంటలకు పాదయాత్ర కొనసాగించారు. పీసీ ప్యాపిల్ క్రాస్‌లో మహిళలు భారీ ఎత్తున షర్మిలపై పూల వర్షం కురిపించారు. ‘అమ్మా.. ఈ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తామని చె ప్పి రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తోంది.. వైఎస్ ఉన్నప్పుడు రుణాలు, పావలావడ్డీ రాయితీ సక్రమంగా అందేది’ అంటూ చెప్పుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలని వైయస్ భావించారు. అందుకే రుణాలు, వడ్డీ రాయితీ సక్రమంగా అందించారు. ఈ ప్రభుత్వానికి మహిళలు అంటే చులకన భావం. ఈ కష్టాలు కొన్ని రోజులే. జగనన్న సీఎం అయ్యాక మీకు మంచి జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.

Back to Top