ఇదేనా ప్రజాస్వామ్యం

()ప్రత్యేకహోదా కోసం పోరాడితే నోటీసులా..?
()ప్రతిపక్ష సభ్యులపై ఎందుకంత కక్ష
()ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే నేరమా..?
()అధికారముందని అడ్డగోలుగా వ్యవహరిస్తారా..?
()ఎంతమందిని సస్పెండ్ చేసిన హోదా పోరాటం ఆగదు
()వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టీకరణ

హైదరాబాద్: ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరమా...? రాష్ట్ర హక్కుల కోసం పోరాడడమే ప్రతిక్షం చేసిన తప్పా..? ఏం నేరం చేశారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తున్నారని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆనాటి కాంగ్రెస్, బీజేపీలతో టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయి. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్లు ఇస్తామని ఆనాటి కాంగ్రెస్ అంటే కాదు పదేళ్లు ఇవ్వాలని ప్రస్తుత బీజేపీ డిమాండ్ చేసింది. ప్రత్యేకహోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని తిరపతి ఎన్నికల సభలో చంద్రబాబు కోరారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. పార్లమెంట్, తిరుపతి సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు పొడిచారు. బాబు తన స్వప్రయోజనాల కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీని స్వాగతించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇలాంటి సమయంలో ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేకహోదాపై చర్చ జరపలాలని ప్రజల ఆకాంక్షను ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రతిబింబించారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేకహోదాపై చర్చ జరపాలని శాంతియుత నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షంపై అధికార టీడీపీ కక్షగట్టింది. సభా హక్కులకు భంగం కలిగించారన్న నెపం వేసి ఏకంగా 12 మంది ప్రతిపక్ష సభ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై గళం విప్పిన 12 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు ఇవ్వడం, ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొనడం చంద్రబాబు ఏపీకి ద్రోహం చేయడమే. 

ప్రతిపక్ష సభ్యులు చేసిన తప్పేంటీ?
సెప్టెంబర్‌ 7వ తేదీ అర్ధరాత్రి వేళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని ప్రకటించారు. ఆ వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విభజన చట్టంలోని హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభలో నిరసన తెలిపారు. హోదాపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైయస్‌ఆర్‌సీపీ దానిపై చర్చ జరపాలంటూ డిమాండ్‌ చేసింది. అయితే హోదాపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని మంత్రి యనమల రామకృష్ణుడు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ప్రకటన చేసిన తర్వాత చర్చకు ఆస్కారముండదని,  సభను వాయిదా వేసి వెళ్లిపోతారని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. మొక్కవోని విశ్వాసంతో చర్చకు పట్టుబడుతూ, ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి శాంతియుతంగా మూడు రోజుల పాటు నిరసన తెలిపారు. 

అయితే అధికార పక్షం కుట్ర పన్ని..సభ్యులెవరూ సభ నుంచి సస్పెండ్‌ కాకముందే మార్షల్స్‌ను రంగంలోకి దించింది. శాంతియుతంగా స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌తో నెట్టించింది. ఎమ్మెల్యేలన్నకనీస గౌరవం కూడా లేకుండా ప్రభుత్వం నియంతృత్వ పోకడను అవలంభించింది.  ఏకంగా వీడియో కెమెరా మెన్లను స్పీకర్‌ పోడియం వద్ద ఏర్పాటు చేసుకొని ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను చిత్రీకరించారు. ఇందులో కొన్ని మిక్సింగ్‌లు చేసి స్పీకర్‌పై, అసెంబ్లీ సిబ్బందిపై ప్రతిపక్ష సభ్యులు దాడికి పాల్పడ్డారని గోబెల్స్ ప్రచారం చేశారు. సభ చివరి రోజు అనగా సెప్టెంబర్‌ 10న శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష సభ్యులను ఏకంగా మూడేళ్ల పాటు సభ నుంచి సస్పెండ్‌ చేయాలని ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. మరో రెండున్నరేళ్లు ఉండే అవకాశం ఉంది. అలాంటిది మూడేళ్ల పాటు సస్పెండ్‌ చేయాలని మంత్రి స్పీకర్‌ను కోరడంలోనే కుట్ర దాగి ఉంది. 

ఇదే అంశంపై ప్రివిలేజ్‌ కమిటీలో చర్చించి ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపేందుకు ప్లాన్‌ రూపొందించారు. ఈ ప్రివిలేజ్‌ కమిటీలో వైయస్‌ఆర్‌సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే జ్యోతుల నెహ్రూ టీడీపీ ప్రలోభాలకు లొంగి, చంద్రబాబు పంచన చేరిపోయారు. ఆ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ పదవులకు, ప్రివిలేజ్‌ కమిటీకీ రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ప్రతిపక్ష సభ్యులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకునేందుకు సమావేశమైన ప్రివిలేజ్‌ కమిటీకి హాజరై అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉండదు. ఆయన స్థానంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కొనసాగించాలన్న ప్రతిపాదనను స్పీకర్‌ పక్కన బెట్టారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదు. గతంలో కాల్‌మనీ– సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో కూడా వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన చేపట్టడంతో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరిని సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యే  రోజాను రూల్స్ కు విరుద్దంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. అధికార టీడీపీ ఇష్టారాజ్యంగా సభను నడుపుకుంటూ సభా సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతోంది. ప్రజాసమస్యలను, రాష్ట్ర హక్కులను ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్న టీడీపీ దుర్మార్గపు పాలనపై ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.  

Back to Top