విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చంద్రబాబు వెన్నుపోటు

మరోసారి ఆంధ్రుల ద్రోహిగా సీఎం చంద్రబాబు

మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చంద్రబాబు ఉరి బిగించే కుట్ర

కేంద్రంతో కుమ్మక్కై సంస్థ ప్రైవేటీకరణకు సీఎం స్కెచ్‌

సీఐఐ సదస్సులో ‘వైట్‌ ఎలిఫెంట్‌‘ వ్యాఖ్యల వెనుక అర్థం అదే 

ప్రైవేటీకరణకు అనుకూలమని చంద్రబాబు సంకేతాలు

మాజీ మంత్రి విడదల రజిని స్పష్టీకరణ

జగన్‌గారి వల్లనే ఆ 5 ఏళ్లూ ఆగిన ప్లాంట్‌ ప్రైవేటీకరణ

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని జగన్‌గారు వెల్లడి

అదే విషయాన్ని కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోదీకి నివేదన

బహిరంగ సభలో లక్షలాది ప్రజల సాక్షిగా చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌

ప్లాంట్‌ను కాపాడే మార్గాలు సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ 

ప్రెస్‌మీట్‌లో సాక్ష్యాధారాలతో సహా చూపిన మాజీ మంత్రి

తాడేపల్లి:    సీఎం చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలకు తెర లేపారని, సీఐఐ సదస్సు తర్వాత ఆయన చేసిన వైట్‌ ఎలిఫెంట్‌ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్‌ కార్మికులు పని చేయకుండా తిని కూర్చుంటున్నారంటూ, వారి వల్లే ప్లాంట్‌ నష్టపోయిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ ఆలోచన చేస్తున్న కేంద్రానికి ఆయుధం అందించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు చేసిన వాగ్దానాలకు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న విడదల రజిని, పథకం ప్రకారం ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని వివరించారు. 
    ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ కాకపోయినా గడిచిన ఐదేళ్లు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా వైయస్‌ జగన్‌ నిలువరించగలిగారని, కానీ టీడీపీ సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయని మాజీ మంత్రి ఆక్షేపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, సంస్థను ప్రైవేటుపరం చేయడం లేదంటూ ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని విడదల రజిని సవాల్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్‌ ఫార్ములా:
    ‘విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో, 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూడడమే కాకుండా, ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన ఆ సంస్థపై ఆయన చేసిన చౌకబారు విమర్శలు వేలాది కార్మికులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వైట్‌ ఎలిఫెంట్‌తో పోల్చి మాట్లాడ్డం అత్యంత దారుణం. ఆ విధంగా ఆయన ప్లాంట్‌ కార్మికుల ఉద్యోగాల పట్ల తనకు బాధ్యత లేదని చెప్పదల్చుకున్నారా?.
    ఎక్కడైనా, ఏ సీఎం అయినా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతంపై దృష్టి పెడతారు. కానీ చంద్రబాబు దీనికి భిన్నంగా ఆలోచిస్తుంటాడు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రయినా ప్రైవేటీకరణ ఫార్ములాతో పాలన సాగిస్తుంటాడు. ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్‌కి ఇచ్చేయడం ఎలాగా అని ఆలోచించడమే ఆయన పని. ఆయన సీఎం అయిన ప్రతిసారీ కొన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మూడినట్టే. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. 

సంపద సృష్టి. అంతా ఒట్టి..:
    సంపద సృష్టిస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, విలువైన ప్రభుత్వ భూములను సూట్‌కేస్‌ కంపెనీలకు కేటాయించి వారికి సంపద సృష్టించి పెడుతున్నాడు. పేదరిక నిర్మూలన చేస్తానని చెప్పే ఈ మహానుభావుడు ఏకంగా పేదలనే నిర్మూలించే ఆలోచనలతో పని చేస్తున్నాడు. రాష్ట్ర రైతాంగ సమస్యలు, విద్యార్థుల కష్టాలు, ఆస్పత్రుల్లో రోగుల అవస్థల గురించి పట్టించుకునే తీరిక లేని చంద్రబాబు.. ఇప్పుడు ఏ మాత్రం ఆచరణకు సాధ్యం కాని విజన్‌–2047 అంటూ డ్రామా చేస్తున్నారు.
అప్పుడలా..ఇప్పుడిలా:
    విశాఖ సీఐఐ సమ్మిట్‌లో ప్రెస్‌మీట్‌లో స్టీల్‌ ప్లాంట్‌ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మెల్లిగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద రుద్దడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
(అంటూ ఆరోజు ఆయన మాట్లాడిన మాటలతో పాటు, ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యలను కూడా మీడియాకు చూపారు).
    ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటానని, అందుకోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను ప్రాధేయపడిన చంద్రబాబు.. వారి ఓట్లతో అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్రానికి భారమైపోయిందంటూ వైట్‌ ఎలిఫెంట్‌తో పోల్చాడు. ఓట్ల కోసం స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులపై ప్రేమను ఒలకబోసిన చంద్రబాబు.. అవసరం తీరిపోయాక పని చేయకుండా పడుకుంటున్నారు, వారి వల్లే నష్టం వచ్చిందన్నట్టు మాట్లాడటం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనం. స్టీల్‌ ప్లాంట్‌కి ఎలా ఉరేస్తున్నాడని చెప్పడానికి ఈ వీడియో కన్నా వేరే నిదర్శనం అవసరం లేదు.

వైయస్‌ జగన్‌గారి కృషితోనే ప్రైవేటీకరణ ఆగింది:
  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా నాటి సీఎం వైయస్‌ జగన్‌ అడ్డుకున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకమని నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాబట్టే ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం ముందడుగు వేయలేకపోయింది. సంస్థ పునరుద్ధరణకు తగిన ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ ఆరోజు ఆయన తన లేఖలో కూలంకషంగా వివరించారు.
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకునేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తామని జగన్‌గారు చెప్పారు.
కేవలం లేఖతో సరిపెట్టకుండా, విశాఖలో జరిగిన బహిరంగసభలో కూడా ప్రధాని నరేంద్రమోదీకి అదే విషయాన్ని స్వయంగా విన్నవించారు. రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని ఆ వేదికపై ప్రధానిగారికి స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక.. మళ్లీ మొదలు:
    రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా, సంస్థను ముక్కలు చేస్తున్నారు. ఇప్పటికే 32 విభాగాలను ప్రైవేటుపరం చేశారు. సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు. సంస్థకు భూములిచ్చిన 8 వేల కుటుంబాలు 40 ఏళ్లయినా ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్లాంట్‌ కార్మికులకు యాజమాన్యం జీతాలు కూడా బకాయిలు పెట్టింది. కూటమి ప్రభుత్వం వైఖరితో 20 వేల మంది శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలు ప్రత్యక్షంగా నష్టపోతున్నాయి. పరోక్షంగా లక్షలాది మందిపై ఈ ప్రభావం కనిపిస్తోంది.
    అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్‌ చేశారు. ఆ దిశలో తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని, సంస్థ కార్మికులతో కలిసి పోరాడతామని ఆమె వివరించారు.

Back to Top