తాడేపల్లి: వైయస్‌ఆర్‌సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు రెడ్ బుక్ పైశాచికత్వానికి పరాకాష్ట మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కాకీ చొక్కాలను అడ్డం పెట్టుకుని ప్రజలు, ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్న చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజా కోర్టులో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. రెడ్ బుక్ పేరుతో శిశుపాలిడిలా లోకేష్ చేస్తున్న తప్పులను శ్రీకృష్టుడి తరహాలో ప్రజలు లెక్కిస్తున్నారన్న నాని... కొడుకు తప్పిదాలకు ధృతరాష్ట్రుడిలా వంతు పాడుతున్న చంద్రబాబుకు అదే గతి పడుతుందని తేల్చి చెప్పారు. ఎంతమందిని అరెస్టు చేసినా ప్రభుత్వ తప్పులని ఎత్తి చూపుతూనే ఉంటామన్న ఆయన... మా గొంతునొక్కాలన్న మీ ప్రయత్నం కలగానే మిగులుతుందని స్పష్టం చేశారు. సతీష్ కుమార్ మృతిపై పోలీసులు నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే.. ఇష్టమొచ్చిన రీతిలో మీడియా ట్రైల్స్ నిర్వహిస్తూ... కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకముందు హత్య అంటూ వరుస కధనాలు ప్రసారం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా కధనాలు ప్రసారం చేస్తున్న ఈనాడు, టీవీ 5 మూర్తి సహా ఇతరుల మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. విద్వేషాలు రేగేలా పోస్టు పెట్టినందుకే వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసామన్న పోలీసులకు... టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో అడ్డగోలు రాతలు కనిపించడం లేదా? అని నిలదీశారు. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజగొంగల ముఠా అంటూ అడ్డగోలు రాతలు రాస్తూ.. మీడియాలో మాట్లాడుతుంటే టీడీపీ అధ్యక్షుడ్ని, పట్టాభిని ఎందుకు అరెస్టు చేయడం లేదని పేర్ని నాని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... నిజం గొంతు నొక్కుతున్న చంద్రబాబు ప్రభుత్వం... రెడ్ బుక్ పేరుతో, పోలీసుల కాకీ చొక్కాలను అడ్డుపెట్టుని.. తప్పుడు కేసులతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. రాబోయే 24-25 నెలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాతాళానికి పడ్డానికి ఇవన్నీ దోహదపడతాయి. తెలుగుదేశం పార్టీ కుట్రలను, కుతంత్రాలను, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎండగడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కారుమూరు వెంకటరెడ్డిని రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఇవాళ అరెస్టు చేశారు. మఫ్టీలో వచ్చిన వ్యక్తులను చూసిన వెంకటరెడ్డి కుటుంబసభ్యులు చంద్రబాబు పంపించిన గూండాలేమోనని భయపడ్డామన్నారు. ఇంటిలోనూ, బెడ్రూమ్ లోనూ చొరబడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదు. చట్టం, పోలీస్ నిబంధల మేరకు ప్రవర్తించకుండా గూండాల్లో, బందిపోటుల్లా ఇంటిలో చొరబడ్డారని వెంటకరెడ్డి భార్య తీవ్ర భయాందోళనలకు గురవుతూ చెబుతున్నారు. తన భర్తను ఎందుకు ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం, సంస్కృతిలేకుండా తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్న వ్యక్తులు వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజల తరపున పనిచేస్తున్న పోలీసు అధికారులు ప్రజలేర్పచుకున్న చట్టం మేరకు కాకుండా పాలకుల అభీష్టం మేరకు ప్రవర్తించడం అన్నది ఎంతవరకు ధర్మం అని వెంకటరెడ్డి కుటుంబసభ్యుల ప్రశ్నిస్తున్నారు. వెంటకరెడ్డి మీద పెట్టి కేసుల వివరాలకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ చూస్తే .. బీఎన్ ఎస్ 353 ఆఫ్ 2 అంటే రాజకీయంగా ఉన్న వ్యతిరేకులను రెచ్చగెట్టే ప్రకటనలు చేశాడని కేసు నమోదు చేశారు. బీఎన్ ఎస్ 196-1 అంటే రెండు, మూడు మతాల మధ్య, జాతుల మధ్య, భిన్న భాషల మాట్లాడే వ్యక్తులు లేదా భిన్న ప్రాంతాల మద్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, వారి మధ్య శతృత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, మరో సెక్షన్ బీ ఎన్ ఎస్ 352 ప్రకారం ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలను రెచ్చగొట్టడం, బీఎన్ ఎస్ 353 ఆప్ 1 ప్రకారం ప్రజలను రెచ్చగొట్టి వారు దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు చేయడం, పుకార్లు రేపడం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పాత్రికేయుల ద్వారా తెలిసింది. వెంటకరెడ్డి ప్రశ్నలో తప్పేంటి? కారుమూరి వెంకటరెడ్డి సమాజంలో జాతులు, కులాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు? తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కనున్న పోలీసు అధికారి సతీష్ కుమార్ మరణం, ప్రభుత్వ హత్యే అని అనుమానంగా ఉందని మాట్లాడాడు. అందులో తప్పేంటి? కేసు నమోదు చేసిన పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పండి. కారణం ఏమిటంటే... ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు కంటి మీద కునుకు రానివ్వకుండా వాళ్ల తప్పులన్ని, పాపాల్ని ఎండగడుతూ... కారుమూరి వెంకటరెడ్డి వైయస్‌ఆర్‌సీపీ గొంతుగా బ్రతకడంతో అది మీ దృష్టిలో నేరం. మీరు ఓ కేసు పెడితే కారుమూరి వెంకటరెడ్డి ఆగుతాడా? ఆగితే వైయస్.జగన్ మనిషెందుకు అవుతాడు? వైయస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకున్న రోజే వైయస్.జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. వైయస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకుని జై జగన్ అన్న ప్రతికార్యకర్త నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఒత్తిడిని, అమానుషాన్ని ఎదుర్కొన్నవాడే. వేధింపులు ఉంటాయని తెలిసే జై జగన్ అన్నారు. దానికి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండేళ్లలో ఎన్ని కేసులు పెట్టినా ఏ గొంతునన్నా ఆపగలిగారు. వైయస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకున్న కార్యకర్త చేతిలోంచి ఆ జెండా పారవేయించగలిగారా? అలా చేయగలమనుకుంటే అవి మీ పిచ్చి భ్రమలే చంద్రబాబునాయుడుగారూ? వైయస్.జగన్ ని ప్రేమిస్తూ.. వైయస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకున్న ఏవైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అయినా అదిరేది లేదు, బెదిరేరి లేదు, ఈ విషయాన్ని నీ కొడుకు లోకేష్ కి కూడా చెప్పు చంద్రబాబూ. వైయస్‌ఆర్‌సీపీ తరపున పోలీసధికారులను ప్రశ్నిస్తున్నాం? ప్రజలనూ ఆలోచన చేయమని చెబుతున్నాం. చంద్రబాబు పాలనలో దగాపడ్డ సామాన్యుడు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూలివాడికి పని, వ్యాపారస్తుడి వ్యాపారం, ఉద్యోగులకు కంటినిండా నిద్ర లేకుండా పోయింది. సామాన్యుడికి పేదవాడికి చదువు దూరం అయింది. కులంతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి వర్గాల పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారమైంది. చిన్న జబ్బు వస్తే బ్రతుకుతామే లేదో అన్న పరిస్థితి.. లేదా ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితుల్లో తాళిబొట్టు తాకట్టు పెట్టినా భర్తను బ్రతికించుకనే పరిస్ధితి ఉందో? లేదో ? అన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు వీటిపై ఆలోచన చేయాలి. సతీష్ కుమార్ మృతిపై ఇష్టంవచ్చిన కథనాలు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో పనిచేసిన సతీష్ కుమార్ అనే పోలీసుఅధికారి.. పరకామణిలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. కొద్ది రోజుల తర్వాత నిందితుడు టీటీడీకి లేఖ రాసి... హుండీలో డబ్బులు లెక్కపెట్టేటప్పుడు తాను దొంగతనానికి పాల్పడ్డం ద్వారా పాపం చేశానని.. తన ఆస్తిని దేవుడికి రాసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్టు మీడియాలో వచ్చింది. దాన్ని టీటీడీ ఆమోదిస్తే.. దీంతో ఉన్నతాధికారులు ఆదేశం మేరకు గతంలో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ తన పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. ప్రస్తుతం రైల్వేలో సీఐ గా పనిచేస్తున్న సతీష్ కుమార్ 13 వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఇంటిలో నుంచి బయటకు వచ్చాడని కుటుంబసభ్యులు చెబుతుండగా... రాత్రి 12 గంటలకు రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ఎక్కాడని టీడీపీ మీడియా చెబుతోంది. 14వ తేదీ ఉదయం 9.15 నిమిషాలకు ట్రాక్ పరిశీలన చేసే కీమెన్ సతీష్ కుమార్ మృత దేహాన్ని ఐడీ కార్డు సహాయంతో గుర్తించి.. సమాచారమిచ్చాడన్నది మీడియా కధనం. వెంటనే రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చిన పోలీసులు ఆ తర్వాత సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు. విచిత్రంగా ఇంటిని దిగ్బంధం చేసి.. ఇల్లంతా జల్లెడ పట్టడానికి వచ్చారని కుటుంబసభ్యులు కధనం. ఫిర్యాదీ దారుడి కుటుంబంపై నిర్భంధం... ఒక పోలీస్ అధికారి మృతి చెంది విగతజీవిగా పడిఉంటే సాటి పోలీసులుగా తనిఖీలు చేయడం విచిత్రంగా ఉంది. సాటి పోలీసు పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించారని సతీష్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. సతీష్ ది ఆత్మహత్యా? హత్యా ? అని తెలుసుకునే లోపే పోలీసులు అతని ఇల్లంతా తనిఖీ చేశారు. సతీష్ మృతి దేహం దగ్గరకు రెండు గంటలపాటు ఇతర మీడియాను, కుటుంబసభ్యులను, అన్నదమ్ములను, భార్యను రానివ్వకుండా... కేవలం టీవీ5 ని మాత్రమే ఎలా అనుమతించారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారు? టీవీ5 తప్ప మీ అనుకూల చానెల్స్ ని కూడా ఎందుకు అనుమతించలేదు. చివరకు మృతుడి సతీష్ భార్య ఫోన్ కూడా పోలీసులు తీసుకెల్లడం దారుణం. పరకామణి కేసులు సతీష్ కుమార్ ఫిర్యాదు దారుడు మాత్రమే. ఆయన టీటీడీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కేసు విత్ డ్రా చేసుకున్నాడని మీడియాలో రాశారు. ఆయన ఎలా దోషి అవుతాడు. ఆయన భార్య ఫోన్ లాక్కోవడానికి అవిడ ఎలా నిందితురాలు అవుతుంది. ఇంతవరకు ఆ ఫోన్ ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి ఎందుకు చెప్పరు? సతీష్ కుమార్ కాల్ డేటా కూడా ఎందుకు చెప్పడం లేదు. సతీష్ కుమార్ 12.53 నిమిషాలకు గుంతకల్లులో ఏ-1 బోగీలో ఎక్కినట్లు రైల్వే అధికారులు చెప్పారని... మీడియాలో చెబుతున్నారు. మరో మీడియాలో బెర్త్ నెంబరు 29 అని చెబుతుంటే.. మరో ఛానెల్ లో ఆ బోగీలో 54 మంది ఉన్నారని చెబుతున్నారు. అంటే 54 మంది మధ్య సతీష్ కుమార్ ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత గుత్తి, తాడిపత్రిలో రైలు ఆగుతుంది. తాడిపత్రికి 6 కిలోమీటర్ల ముందు మరుసటిరోజు ఉదయం సతీష్ కుమార్ మృతి చెంది పడి ఉన్నాడని చెబుతున్నారు. సతీష్ మృతిపై మీడియా ట్రైల్స్- నోరు విప్పని పోలీసులు... అదే రోజు కనీసం మృతదేహానికి పంచనామా అవ్వకుండానే... అది హత్యో, ఆత్మహత్యో తెలియకుండానే మధ్యాహ్నం 12.47 నిమిషాలకు టీవీ 5 మూర్తి పరకామణి దొంగలు ప్రాణం తీశారా? అంటూ మొదలుపెట్టాడు. తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? అంటూ మరో కథనం ప్రసారం చేశారు. మహానాడు మీడియా పేరుతో మధ్యాహ్నం 2.53 నిమిషాలకు వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు...అంటూ సంబంధం లేని కధనాలు రాసి.. మరో 4 నిమిషాల తేడాతో పరిటాల హత్య కేసులో సాక్షులు వరుస మరణాలు అంటూ మరో కథనం రాసారు. మరలా సాయంత్రం 6 గంటలకు సతీష్ కుమార్ మృతి వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది, శ్రీవారి హుండీని దొంగిలించి రాజీ చేయడం ఏంటి?రాజీ చేయడానికి ఇది పులివెందుల పంచాయితీనా? అంటూనే సతీష్ హత్య కేసులో కుట్ర కోణం ప్రభుత్వం వెలికితీస్తుందని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పేరుతో వార్త. వీళ్లంతా పచ్చమూక పెయిడ్ ఆర్టిస్టులు. ఎఫ్ ఐ ఆర్ రాకుండానే వీళ్లకు తూచినట్లు కథలల్లుతారు. వీళ్లకు ఎంత పోయేకాలం అంటే... 2018లో వైయస్.జగన్ పాదయాత్రలో విశాఖలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ యాదవ్ కు బ్రెయిన్ హేమరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు. ఆయన్ను బ్రతికించుకోవడం కోసం వైయస్.జగన్ చేయని ప్రయత్నం లేదు. అనేక సర్జరీలు కూడా చేశారు. ఆయన లేచి తిరగడమే కష్టం అయితే... వైయస్.జగన్ దంపతులుతో కారులో వచ్చాడని రాస్తున్నారు. అనారోగ్యంతో మృతిపై కూడా అనుమానం అని రాస్తాడు. వైయస్.జగన్ మామయ్య, వైయస్.భారతి తండ్రి గంగిరెడ్డి గారి గురించి రాస్తూ... ఆయన మృతికి వివేకానంద రెడ్డి హత్యకు ముడిపెడతాడు. వీరి పాపాలకు అంతు లేకుండా పోతుంది. వీటన్నింటినీ ఏమంటారు? డీజీపీ గారినికూడా ప్రశ్నిస్తున్నాను? సతీష్ కుమార్ ది ప్రభుత్వ హత్యేనని మాకు అనుమానంగా ఉందన్న కారుమూరి వెంకటరెడ్డిపై మీ తాడిపత్రి ఎస్ఐ నిన్న సాయంత్రం కేసు నమోదు చేస్తారు... మరి ఈ మీడియాలో వచ్చిన వాటిపై ఏం చెబుతారు? కనీసం శవపంచనామా జరగక్కుండా ఏ రకంగా ఇలా వార్తలు రాస్తారు? ఇంతవరకు సతీష్ కుమార్ మృతిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్, విచారణాధికారి, జిల్లా ఎస్పీ ఎవరూ ఈ హత్యలో ఫలానావాళ్లు ఉన్నారని చెప్పలేదు. గుట్టుబయటపడుతుందని భయపడ్డారా అని రాసిన ఈనాడు.. మరో పేజీలో కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు అని మహానాడు మీడియాలో వచ్చిందే ఈనాడులో రాస్తారు. మహానాడు మీడియా స్థాయికి ఈనాడు దిగజారిందా? అంటే తెలుగుదేశం పార్టీ ఏ కంటెంట్ అయితే తయారు చేసి ఇస్తుందో దాన్నే మహానాడు మీడియా ముందు ప్రచారం చేస్తాడు. ఆ తర్వాత ఈనాడు తీసుకుంటుందని అమాయకులకు కూడా అర్ధం అవుతుంది. పోస్టు మార్టమ్ రిపోర్టు రాకుండా, పోలీసులు చెప్పకుండానే ఈనాడులో సతీష్ అడ్డులేకుండా పోతే తప్పించుకోవచ్చని భావించారా? సీఐడీ విచారణకు వెళ్తున్న వ్యక్తి విగత జీవిగా ఎలా మారాడు? తలవెనుక భాగంలో బలమైన ఆయుధంలో కొట్టిన గాయాలు అంటూ రాశారు. నిజానికి ఇవాల్టి వరకు ఒక్క పోలీస్ అధికారి కూడా దీనిపై స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అన్నీ వీల్లే రాస్తారు. ఈనాడుకు ప్రభుత్వ నజరానా: మరోవైపు ప్రభుత్వం తాజాగా ఓ జీవో విడుదల చేసింది. అందులో ఈనాడు సంస్థలకు చెందిన ఈటీవీలో వచ్చిన కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమం మధ్యలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి, ప్రభుత్వం గురించి ప్రచారం చేసినందుకు రూ.90 లక్షలు ప్రకటనల కోసం విడుదల చేసింది. ప్రజలకిచ్చిన పథకాలేవీ లేవు. పెన్షన్ తప్ప అన్ని పథకాలు మోసాలే. రెండేళ్లకు రైతులకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటివరకు కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. ప్రజలకు పెద్ద శఠగోపం పెట్టిన చంద్రబాబు... తనకు అనుకూలంగా రాస్తున్న ఈనాడుకు అంత పెద్ద మొత్తంలో దోచిపెడుతున్నాడు. ఏడాదికి మోదీతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తామన్నచంద్రబాబు... వారిని మోసం చేయడం అన్నది రైతువారీ భాషలో చెప్పాలంటే... ఓట్లకు కన్నం వేయడమే. పోలీసులు మాట్లాడకుండానే మీడియా ట్రైల్స్ నిర్వహిస్తున్న టీవీ5 మూర్తితో పాటు ఇతరులు మీద ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు? వీళ్లనెందుకు అరెస్టు చేయరు? తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్ లో పరిటాల నుంచి పరకామణి వరకు పాత్రధారుల పనయ్యాక పరలోకానికే, కేసులో సాక్ష్యం గల్లంతైతే నేరగాళ్ల నేరం నిరూపితమవడం కష్టమే? చదువులేకపోయినా ఒక కరుడుగట్టిన నేరగాడిగా ఈ విషయం ఆ రాజకీయ నేరస్తుడికి బాగా తెలుసు..అందుకే కేసు కొలిక్కి వస్తున్న దశలో సాక్షి చనిపోయాడు, పరిటాల రవి కేసు నుంచి నేటి వరకు అదే ఫార్ములా అని మృచిచెందిన సతీష్ పోటో, వివేకానందరెడ్డి ఫోటో, వైయస్.జగన్ ఫోటో వేసి పోస్ట్ చేశారు. ఇది టీడీపీ అధికారిక వెబ్ సైట్. తెల్లవారుజామున వెళ్లి... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడ్ని వాళ్ల కొడుకు, భార్య చేతిలో కాగితం, వివరాలు లేకుండా ఎందుకు ఎత్తుకురారు? అదే టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజగొంగల ముఠా ఉంది అంటూ బోసీడీకే పట్టాభి గారు మాట్లాడతారు. పరకామణి కేసులో కీలకసాక్షి సతీష్ ది ఆత్మహత్య కాదు హత్యే అని 14వ తేదీన పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకముందే ప్రకటిస్తారు. వీళ్లద్దరినీ అరెస్టు చేయరా? వీళ్లద్దరిలో ఎవరో ఒకరిని డీజీపీ గారు ఎత్తుకురారా? కారుమూరి వెంకటరెడ్డిని ఎత్తుకెళ్లినట్లు వీళ్లనీ ఎందుకు ఎత్తుకురారు. కేసు వైయస్.జగన్ వరకు వెళ్తుందనగానే ఎందుకు సాక్ష్యులు మరణిస్తారు? పరిటాల రవి, వివేకా హత్య నుంచి పరకామణి కేసు వరకు అదే జరుగుతుంది. నవంబరు 16 ఉదయం 9.18 గంటలకు పోస్ట్ టీడీపీ అధికారిక సైట్ లో పోస్ట్ చేశారు. టీడీపీ అధ్యక్షుడిని అరెస్టు చేయరా? వీళ్లు మత విద్వేషాలను, కుల విద్వేషాలను రెచ్చగొచ్చినట్లు కాదా? అదే విధంగా నరసింహయాదవ్ మాట్లాడుతూ... వైసీపీ పెద్దల డైరెక్షన్ లోనే సతీష్ కుమార్ హత్య జరిగిందని ప్రకటిస్తున్నారు. ఇలా మాట్లాడిన వాళ్లను, మాట్లాడించిన వాళ్లను అరెస్టు చేయరా? మృతిచెందిన సతీష్ కుమార్ తమ్ముడు ఆయనతో పాటు శాలివాహన సంఘం ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే సతీష్ కుమార్ కుటుంబానికి నమ్మకం లేదని అర్ధం. విద్వేషాలు రేపుతున్నది టీడీపీ మూకలే... టీవీ5లో టీడీపీ నాయకుడు మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ తోనే హత్య, వైయస్.జగన్ హస్తం ఉందని వార్త ప్రసారం చేశాడు. మరో టీడీపీ నేత మాట్లాడుతూ దొరికిపోతారని హత్య చేశారని మాట్లాడుతున్నాడు. ఇంతమంది పాపాత్ములు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి ఇంత పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తుంటే వీళ్లను ఉదయం 6 గంటలకు వెళ్లి ఎత్తుకురారా? రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి. ఈనాడులో చెప్పినట్లు.. బోగీలో గొడ్డలితో తలవెనుక నరికితే బోగీలో రక్తపు మరకలు ఉన్నాయా? చివరి స్టాప్ గా తిరుపతి చేరినప్పుడు రక్తపు మరకలు ఉన్నాయని రైల్వే సిబ్బంది పోలీసులుకు ఫిర్యాదు చేయలేదా? 54 మంది ప్రయాణికులు ఉన్నారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అందులో ఎంతమందిని విచారించారు.? ఎందుకుగుట్టుగా విచారించారు? సతీష్ కుమార్ పై గొడ్డళ్లు, మారణాయుధాలతో దాడిచేస్తే ప్రక్కనున్న వాళ్లకు ఆయన కేకలు వినిపించలేదా? ప్రజలు ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ పోలీసులను ఎందుకు అడగలేదు? పచ్చమూకల విషప్రచారం... మధ్యాహ్నం 12 గంటల నుంచే సతీష్ కుమార్ ది హత్య, వైయస్.జగన్ చేశాడంటూ వార్తల్లో ప్రచారం చేసిన టీవీ5 మూర్తిని మీరు హైదరాబాద్ వెళ్లి ప్రశ్నించారా? ఆయన వద్ద నున్న ఆధారాలు తీసుకోరా? వైయస్‌ఆర్‌సీపీ నేతలైతే ఎత్తుకెల్తారా? టీవీ5 మూర్తిని ఎందుకు ఎత్తుకెళ్లరు ? అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన సతీష్ కుమార్ 12.50 వరకు ఎక్కడెక్కడ సంచరించారు? ఎవరితో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారో విచారించారా? ఎందుకుపోలీస్ వ్యవస్ధ గుంభనంగా వ్యవహరిస్తోంది? పోలీసులు నోరు మెదపకుండా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా టీడీపీ మూకలకు అవకాశం కల్పిస్తోంది? వాళ్ళ నోళ్లు ఎందుకు మూయించడం లేదు? పరకామణి కేసు కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృత దేహం దగ్గరకు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఎందుకు రానివ్వడం లేదు. వీటన్నింటికీ పోలీస్ వ్యవస్ధ సమాధానం చెప్పాలి పోలీసులు నోరు విప్పకుండా పచ్చమూకలతో విష ప్రచారం ఏంటి? ఎందుకు వాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. నాడు దృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చుని దుశ్శాసనుడి దుశ్చర్యలకు కూడా అడ్డుచెప్పకుండా తన్మయత్వం పొందినట్లు చంద్రబాబు కూడా తన్మయత్వం పొందుతున్నాడు. రెడ్ బుక్ పాలన లో లోకేష్ తప్పులను.. నాడు శిశుపాలుడి పాపాలను లెక్కించిన శ్రీకృష్ణుడు తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మౌనంగా లెక్కిస్తున్నారని పేర్ని నాని హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని.. లేనిపక్షంలో ప్రజా కోర్టులో తగిన శిక్ష ఖాయమని హెచ్చరించారు.