రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి దగా

పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులు కట్‌

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

2024 జూన్‌ నుంచి సూపర్‌ సిక్స్‌ అన్న బాబు మాటలు బూటకం

తొలి ఏడాదే రైతుల పెట్టుబడి సాయానికి ఎగనామం

రెండో ఏడాది కూడా అదే తరహా మోసం. అరకొర సాయం 

వైయస్‌.జగన్‌ హయాంలో 53.58 లక్షల మందికి రైతుభరోసా

వారి సంఖ్యను 46.85 లక్షలకే కుదించిన కూటమి ప్రభుత్వం

ఇది పూర్తిగా రైతు ద్రోహి ప్రభుత్వం

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి «ధ్వజం

రైతులను తీవ్రంగా వేధిస్తున్న యూరియా కొరత

రేషన్‌ కార్డు తరహాలో యూరియా కార్డులు

రూ.150 అదనంగా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు

సకాలంలో రైతులకు అవసరమైన యూరియా అందించాలి

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌

నెల్లూరు: రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని.. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి గెల్చిన తర్వాత మొహం చాటేయడం బాబుకు అలవాటేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. 2024 జూన్‌ నుంచి సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. తొలి ఏడాదే రైతుల పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టగా.. రెండో ఏడాది అరాకొర సాయంతో 7 లక్షల మంది రైతులకు మెండి చేయి చూపించారని మండిపడ్డారు.
    నెల్లూరు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వైయస్‌.జగన్‌ హయాంలో 53.58 లక్షల మందికి రైతుభరోసా అందితే.. వారి సంఖ్యను 46.85 లక్షలకే కుదించిన చంద్రబాబుది రైతు ద్రోహి ప్రభుత్వమని  ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌ మార్కెట్‌ లో రూ.150 వరకు అధిక ధరకు అమ్ముకుంటున్నా..  రైతులకు కనీసం యూరియా అందించలేని ప్రభుత్వ అసమర్థతను ఆక్షేపించారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా వైయస్‌.జగన్‌ ప్రభుత్వం నిలబడితే... రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

రైతులంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం:
    చంద్రబాబు నాయుడుకి రైతుల పట్ల చిత్తశుద్ధి శూన్యం. రైతులకు ఎన్నికల్లో హామీలిచ్చి వారితో ఓట్లేయించుకుని.. ఎన్నికల గడిచిన తర్వాత వారిని వదిలేయడం చంద్రబాబుకి అలవాటు. అందులో భాగంగానే 2014 ఎన్నికల్లో  రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశాడు. 2024 ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ పేరుతో మోసం చేశాడు. వైయ‌స్ఆర్‌సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. మాపై విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా మా పైనా, పార్టీ కార్యాలయాల పైనా దాడులు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. 
    జూన్‌ 2024 నుంచి సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తానన్న హామీ గుర్తుందా చంద్రబాబూ? అదే సమయంలో రైతుకి రూ.20 వేలు ఇస్తామన్నారు. ఏడాదికి రూ.1.04 లక్షలు  ఐదేళ్లకి రూ.5.20లక్షలు ఇస్తామన్నారు. దానికి కట్టుబడి ఉన్నారా? జూన్‌ 2024 నుంచి ఇస్తామన్న మాట మీద నిలబడ్డారా? లేదు మాట తప్పామని ఒప్పుకుంటున్నారా? చంద్రబాబు హామీలను మర్చిపోయిన నటిస్తున్నాడు, ఆయన మర్చిపోయిన మేం గుర్తు చేస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. 

రైతులకు నిలువునా మోసం:
    వాస్తవానికి వైయస్‌.జగన్‌ ప్రభుత్వంలో ఆఖరి ఏడాది 53.58 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చేనాటికి ఆ సంఖ్య పెరుగుతుందే తప్ప, తగ్గదు. కానీ మీరు తొలి ఏడాదే రూ.20వేలు కేంద్రప్రభుత్వంతో సంబధం లేకుండా ఇస్తామని చెప్పారు. ఆ లెక్క ప్రకారం రూ.10,716 కోట్లు, రెండేళ్లకి రూ.21,432 కోట్ల రైతులకు మీరిచ్చిన హామీ ప్రకారమే జమ చేయాలి. కానీ తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.10,716 కోట్లకు గానూ ఒక్క రూపాయి రైతులకు జమ చేయలేదు. రెండో ఏడాదికి వచ్చేసరికి పెట్టుబడి సాయం అందించాల్సిన రైతుల సంఖ్య 53.58 లక్షల నుంచి 46.85 లక్షల మందికి కుదించారు. ఇవ్వాల్సిన సాయంలో కూడా కోత పెట్టి రూ.14 వేలు మేము ఇస్తాం, రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి.. తన వాటా రూ.6,300 కోట్లు అని లెక్కకట్టి.. అందులో గతంలో రూ.2,300 కోట్లు ఇచ్చారు, రేపు చంద్రబాబు మరో రూ.2,300 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అంటే రైతులకి ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 21,432 కోట్లకు గానూ రేపు జమ చేయబోయే మొత్తంతో కలుపుకుంటే కేవలం రూ.4,600 మాత్రమే రైతులకు ఇచ్చినట్లు లెక్క. అంటే రైతులను ఎంత దారుణంగా మోసం చేశారో తెలుస్తుంది. 
    వైయస్‌.జగన్‌ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయం కింది అందిస్తే.. ఇవాళ కూటమి ప్రభుత్వం దాదాపు 7లక్షల మంది రైతులకు కోత విధించడంతో పాటు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి కేవలం రూ.14 వేలు మాత్రమే ఇవ్వడం ఒక ఎత్తైతే... అందులో కూడా ఒక ఏడాది రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగరగొట్టడం మరింత దుర్మార్గం.

కౌలు రైతుల గురించి నోరు మెదపని పవన్‌ కళ్యాణ్‌:
    చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకు రెండేళ్లు కూడా మొండిచేయి చూపించింది. ఆరోజు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని మొసలి కన్నీరు కార్చి, వారిని పరామర్శించిన పవన్‌కళ్యాణ్‌ ఇవాళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఉపముఖ్యమంత్రిగా ఉంటూ కూడా కౌలురైతులను చంద్రబాబు మోసం చేస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు మాట్లాడ్డం లేదు? కచ్చితంగా వారికి పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలి?.

అన్నదాత సుఖీభవలో ఆంక్షల పేరుతో కోత:
    మరోవైపు రైతులు వారికి సంబంధించిన భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వం... వెబ్‌ ల్యాండ్‌ లో భూముల వివరాలు నమోదు కాని వారికి పెట్టుబడి సాయాన్ని అందించడం లేదు. వాస్తవానికి వైయస్‌.జగన్‌ ప్రభుత్వ హయాంలో ఈ   నాన్‌ వెబ్‌ ల్యాండ్‌ రైతుల వివరాలను కూడా నమోదు చేసుకుని వారికి కూడా రైతు భరోసా అందించారు. ఎవరైనా రైతు చనిపోతే... ఆ కుటుంబంలో ఉన్న వారసుడి కోసం ప్రత్యేకంగా మాడ్యూల్‌ రూపొందించి ఫ్యామిలీ సర్టిఫికేట్‌ ప్రకారం వారసుల్లో ఒకరికి రైతు భరోసా సాయం అందించాం. ఇవాళ ఈ సాఫ్ట్‌వేర్‌ ను కూడా కూటమి ప్రభుత్వం లేకుండా చేసింది. 
    రీసర్వే పేరుతో వెబ్‌ల్యాండ్‌ను హైడ్‌ చేస్తున్నారు. రైతులకు సంబంధించి రీ సర్వే జరుగుతున్న భూముల్లో ఫైనల్‌ నోటిఫికేషన్‌ అయి, ఆర్వో అయినంతవరకు ఆ రైతులకు అన్నదాత సుఖీభవ రాదు. ఇక డీకేటీ, ప్రభుత్వభూములని  వ కాలమ్‌ లో  ఉంటే వారికి కూడా పెట్టుబడి సాయం అందడం లేదు. ఇలా రకరకాలుగా నిబంధనలు పెట్టి లక్షల సంఖ్యల్లో అన్నదాత సుఖీభవ పథకానికి ఎగనామం పెట్టారు. దానికి సంబంధించి గ్రీవెన్స్‌ లో ఫిర్యాదు చేసుకుంటే దానికి కూడా అతీ, గతీ లేదు. వైయస్‌.జగన్‌ హయాంలో వారంరోజుల్లో గ్రీవెన్స్‌కి వెళ్లి రైతుభరోసా రాలేదంటే దాన్ని పరిష్కరించే పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో రేపు పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పినా... ఆ జాబితాలో లేని రైతులు తమ గ్రీవెన్స్‌ ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి. అంటే కేవలం మొక్కుబడి వ్యవహారం తప్ప... నిజంగా రైతులకు మేలుచేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 7 లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. చివరకు ప్రభుత్వం ప్రకటించిన 46.85 లక్షల మందికైనా  సక్రమంగా జమ చేసిందా అంటే అది కూడా లేని పరిస్థితి... జాబితాలో తమ పేర్లు ఉన్నా డబ్బులు అకౌంట్‌ లో జమ కాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి. 

రైతులను పూర్తిగా గాలికొదిలిన కూటమి ప్రభుత్వం:
    మీ అధికారి పత్రికలోనే యూరియా కొరత వెంటాడుతుందని ప్రధాన శీర్షికలో వార్తలు రాశారు. బ్లాక్‌ మార్కెట్‌ లో రూ.150 అదనంగా అమ్ముతున్నారు. ప్రశ్నిస్తే నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారని రాస్తే... ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నెల్లూరు జిల్లాలో తీవ్రంగా యూరియా కొరత వేధిస్తుంది. ఇటీవల మీరు నిర్వహించిన ఓ సమావేశంలో 7.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రకటించారు.  దానికి సంబంధించి ఎంత మేర యూరియా అందుబాటులో ఉండాలి.  డీఏపీ లాంటి దుక్కుపిండి ఎంత అందుబాటులో ఉండాలన్నది కనీసం లెక్కలు వేసుకోలేదు. ఫలితంగా రూ.270 అమ్మాల్సిన యూరియా బస్తా రూ.420–రూ.450 అమ్ముతుంది. రైతు నిలువుదోపిడీకీ గురవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. పైగా అంతా సవ్యంగా జరుగుతుందని సిగ్గుమాలిన చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలివ్వడం దారుణం. సక్రమంగా రైతులకు యూరియా ఇవ్వలేక రేషన్‌ కార్డుల తరహాలో ఎకరాకు 3 బస్తాలిస్తామని.. యూరియా కార్డులిస్తున్న దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం మాత్రమే. వైయస్‌.జగన్‌ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా సరఫరా చేశాం. కారణం వైయస్‌.జగన్‌ ప్రభుత్వానికి రైతులంటే చిత్తశుద్ధి ఉంది, వారి సంక్షేమం కోసం పని చేయబట్టే యూరియా కొరత లేదు. 

రైతుకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం:
    రైతులకంటే చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. జగన్‌గారి హయాంలో ఉచిత పంటలబీమా ఉంటే దానికి చంద్రబాబు మంగళం పాడాడు. ఇ–క్రాప్‌ రద్దు చేశాడు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాకు అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి.. పథకాన్ని కూడా కుదించాడు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఉండే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌ లకూ మంగళం పాడాడు. అరటి రైతుల ధర లేక ఆక్రందనలో ఉన్నారు. గతంలో అరటి కేజీ రూ.20–25 ఉంటే ఈ ప్రభుత్వంలో కేవలం రూ.6 నుంచి రూ.7కు అమ్ముడుపోతుంది. దాన్ని నోటిఫైడ్‌ క్రాప్‌ కాకపోయినా వైయస్‌.జగన్‌ గిట్టుబాటు ధర కల్పిస్తే...  ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. మొన్న మొంధా తుపానుతో సగం నష్టపోతే.. ఇవాళ గిట్టుబాటు ధర లేక మిగిలినది కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నా వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వానికి కనీస స్పందన లేదు.

మా హయాంలో నోటిఫైడ్‌ కాని పంటలకూ సాయం:
    నోటిఫైడ్‌ క్రాఫ్‌ కానివాటికి కూడా వైయస్‌.జగన్‌ హయాంలో సీఎం యాప్‌ (కాంప్రెహెన్షివ్‌ మోనిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌ మెంట్‌) పెట్టి.. రైతుల ఉత్పత్తుల రేటుపై నిరంతరం మానిటరింగ్‌ చేశాం. మార్కెట్‌ లో రైతుల ఉత్పత్తులకు ధర ఎలా ఉంది, ఒకవేళ రైతు నష్టపోయే విధంగా ఉంటే.. ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి ధర కల్పించడానికి ఏకంగా రూ.3వేల కోట్లతో ధరలస్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. రైతు పంటలు వేసిన వెంటనే ఇ–క్రాప్‌ ద్వారా ఉచిత పంటల బీమా రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండానే 75 లక్షల ఎకరాలకు సంబంధించి 85 లక్షల రైతు కుటుంబాలకు అందించాం. ఐదేళ్లలో రూ.7800 కోట్లు రూపాయులు, ఒకే ఏడాదిలో రూ.2987 కోట్లు పరిహారం రైతులకు చెల్లించి వారిని అదుకున్న ఘతన వైయస్ జగన్‌ దే. ఏ సీజన్‌ లో రైతులు పంట నష్టపోతే అదే సీజన్‌  ముగిసేలోగా వారికి ఇన్‌ పుట్‌ సబ్సిడీ చెల్లించాం. 
    ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో పంటల బీమా చేసుకున్న రైతుల సంఖ్య కేవలం 19 లక్షలు మాత్రమే. ఈ–క్రాప్‌లో నమోదైన రైతులకు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లించి.. ఉచిత పంటల బీమాకు మాత్రం మంగళం పాడిందని, రైతుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top