విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలపై కక్షసాధింపు చర్యలు అధికమయ్యాయని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచగోళ్ల రమేష్ యాదవ్ మండిపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుంటుంబాన్ని మంగళవారం వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం నాయకులు, ఎమ్మెల్సీలు రాచగోళ్ల రమేష్ యాదవ్ , మురుగుడు హనుమంతరావు, కవురు శ్రీనివాస్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట రమణ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మార్తా శ్రీనివాసరావు, వివిధ జిల్లాల బిసి సెల్ అధ్యక్షులు, నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ..బలహీన వర్గాలు నాయకుడు జోగి రమేష్ ను అక్రమ కేసులతో జైలు పాలు చేసినంత మాత్రాన, ఆయన గొంతుక ఆగదన్నారు. మా గొంతుకును ఆయన గొంతుకగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తామని హెచ్చరించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగ ఎల్లవేళలా సాగదని, న్యాయవస్థల పై నమ్మకం ఉందన్నారు. జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తప్పుడు కేసులతో బీసీల గొంతు నొక్కలనుకోవడం చంద్రబాబు నాయుడు అవివేకమన్నారు. కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి, అక్రమ కేసులను ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వారి వివరాలు మా డిజిటల్ బుక్ లో నమోదు అవుతున్నాయని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.