హాస్యాన్ని పంచుతున్న 'మీకోసం' వస్తున్నా..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 'మీకోసం వస్తున్నా' పాదయాత్రపై తనదైన శైలిలో వ్యంగ్యోక్తులతో ప్రవాస భారతీయుడు గురవారెడ్డి విశ్లేషణ ఇది. ప్రజాప్రస్థానానికీ దీనికీ పోలికే లేదని ఆయన తేల్చిచెప్పారు.


అధికారంలోకి వచ్చేందుకు నేతలు పాదయాత్రలను చివరి అస్త్రంగా ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 2004 ఎన్నికల ముందు ఇదే అంశాన్ని ఎంపికచేసుకుంది. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 2003వ సంవత్సరం ఎర్రటి ఎండలో ఆయన పాదయాత్రను చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళనుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగిన ఈ యాత్ర నేరుగా ప్రజల గుండెలను తాకింది. వారిలో చిరస్థాయిగా స్థానాన్నీ సంపాదించింది. ఆయన యాత్ర.. ప్రజాప్రస్థానం దిగ్విజయం కావడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్య కారణాలు కొన్నే.. అవి
ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డి అధికారంలో లేరు. అప్పటి తెలుగు దేశం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను  యాత్రలో ఎండగడుతున్నపుడు ప్రజలు రాజశేఖరరెడ్డిలో విభిన్న ఆలోచనలతో ఉన్న ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. 

మహానేత యాత్రను ప్రజలు అధికారం కోసం చేపట్టిన యాత్రగా చూడలేదు.

రాష్ట్రం అప్పట్లో కరవు రక్కసి కోరల్లో నలిగిపోతోంది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తెలుగు దేశం ప్రభుత్వం ఈ విషయాలను అసలు పట్టించుకోలేదు. ప్రజలు తమ బాధలు చెప్పుకున్నప్పటికీ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అయ్యింది. అవన్నీ ప్రతిపక్షాలు చెబుతున్న అబద్ధాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టిపారేశారు. ఆయన దృష్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై తప్ప వ్యవసాయంపై ఉండేది కాదు. వ్యవసాయం తెలిసిన... స్వతహాగా రైతు అయిన వైయస్ఆర్ రైతుల ముంగిటకు ఈ విషయాన్ని సూటిగా తీసుకెళ్ళగలిగారు. 

డాక్టర్ వైయస్ఆర్ సంప్రదాయ ఆహార్యం.. చెప్పింది ఓపిగ్గా వినడం ఆయనకు ప్రజల మనసుల్లో సుస్థిరస్థానాన్ని సముపార్జించింది. తక్కువ మాట్లాడి ఎక్కువ వినడాన్ని ఆయన సిద్ధాంతంగా పెట్టుకున్నారు. 

మండుటెండలో  సాగించిన ప్రజాప్రస్థానం ఆయనకు విశ్వసనీయతను సంపాదించి పెట్టింది. మరింత ప్రభావవంతంగా సాగేలా చూసింది.

ప్రజాప్రస్థానం వైయస్ఆర్‌కు కాంగ్రెస్ కార్యకర్తలలో నాయకుడంటే ఇలా ఉండాలనే నమ్మకాన్ని కలిగించింది. తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొట్టగలరే విశ్వాసాన్నీ పాదుగొల్పింది.
ఓ నాయకుడు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికీ, వారితో మాట్లాడే విధానం తెలుసుకోవడానికీ ప్రజాప్రస్థానం 
ఉపయోగపడింది. వైయస్ఆర్ దీనిని అతి సమర్థంగా వినియోగించుకుని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ప్రజల హృదయాల అంతరాంతరాలను మీటారు. ఇందుకు ఆయన సినిమా దర్శకుల సాయం తీసుకోలేదు. రచయితలతో సంభాషణలు రాయించుకోలేదు. పాదయాత్ర ఎలా సాగించాలనే అంశంపై స్క్రిప్టు రాయించుకోలేదు. ప్రజలతో ఎలా మమేకం కావాలనే అంశంపై మానసిక నిపుణలతో శిక్షణ పొందలేదు. ఎందుకంటే ఆయన జన్మతః నాయకుడు.

ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర సినీ ఫక్కీలో సాగుతోంది. దాక్కున్న మిమ్మొదల.. అన్న తీరులో ఆయన వెతికి మరీ ప్రజలతో సంభాషిస్తున్నారు. ప్రఖ్యాత దర్శకులు, రచయితలు ఈ అంశంలో ఆయనకు సహకరిస్తున్నారు. ఆయన జీవితంలో మొదటిసారి హిందూపురంలో తన భార్యతో హారతి ఇప్పించుకున్నారు. పిల్లలను ముద్దాడడం, కౌగిలించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆనందాంబుధిలో ఓలలాడుతున్నారు. 

మరో కీలకాంశం.. ఆయన వి సంకేతాన్ని ప్రదర్శించకపోవడం. మొట్టమొదటిసారి నమస్కారాలు చేస్తూ సాగుతున్నారు. సీఎంగా ఉన్న సమయంలో  తనను తాను రాష్ట్రానికి సీఈఓగా చెప్పుకున్న బాబు ఇలా వ్యవహరిస్తుండడం అధికారం కోసం ఆయన అనుసరిస్తున్న వైఖరిని వెల్లడిస్తోంది. మారిన తీరు పార్టీ శ్రేణులకు ఇంపుగా ఉందేమో కానీ సామాన్య జనానికి కాదు. తొమ్మిదేళ్ళ పాలన కాలంలో పేదల అవస్థలు పట్టని నేతగానే బాబును వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షకుడిగానే చూస్తున్నారు. 

కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఎందుకు మీరు పాదయాత్ర చేస్తున్నారంటే బాబు దగ్గర జవాబు లేదు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైన చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ పాలనను నిరసిస్తూ పాదయాత్ర చేపట్టే హక్కులేదు.  ఇది జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి నిరోధించడమనే అంతర్గత సూత్రంతో సాగుతున్న బాబు కాలినడకను ప్రజలు లక్ష్యపెడతారా అనేది సందేహమే.
1994లో 44శాతం ఓటింగు ఉన్న తెలుగుదేశం పార్టీకి 2010-12 మధ్య కాలంలో సీమాంధ్ర ప్రాంతంలో 19.5శాతం కంటె తక్కువ గానూ, తెలంగాణ ప్రాంతంలో 15శాతం కంటె తక్కువగానూ నమోదైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభైనాలుగు శాతం ఓట్లను సాధించగలిగింది. ముస్లింలు, క్రిస్టియన్లు తెలుగు దేశం పార్టీకి దూరంగా జరిగారు. చంద్రబాబు అనుసరించిన అవకాశవాద రాజకీయాలు, సిద్ధాంతాలూ ఇందుకు మూలకారణం. 2009 తర్వాత 45 అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. చంద్రబాబు విశ్వసనీయత ఎంత ఉందో చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా!

మునిగిపోతున్న తెలుగుదేశం నావను ఏ శక్తీ కాపాడలేని స్థితికి వచ్చింది. అయినప్పటికీ చిన్నచిన్న అతుకులతో దానిని గట్టెక్కించగలమని చంద్రబాబు, ఆయన మద్దతుదారులు భావిస్తున్నట్లుంది. ఇంతకంటే హాస్యస్ఫోరకమైన అంశం మరోటుంది. అదే ఎల్లో మీడియా.. తమ వార్తలతో ఇప్పటికీ ప్రజలను ప్రభావితం చేయగలమని భావిస్తోందది. అసత్య కథనాలు.. ప్రసారాలతో యధాశక్తి తన కృషి తాను చేస్తోంది.

ముంబయిలో ప్రత్యేకంగా చేయించుకున్న ఏసీ బస్సులతో( ఒకటి తాను ఉండడానికీ, మరోటి తనకు ఆహార పదార్థాల తయారీకీ) అట్టహాసంగా యాత్ర సాగుతోంది. ఆయనకోసం ప్రత్యేక పదార్థాలను వండి వారుస్తున్నారు. పళ్ళరసాలు, చిరుతిళ్ళు చేయాడానికి ఈ బస్సును ఉపయోగిస్తున్నారు. బాబు.. ఇప్పటికీ తాను తప్ప లోకంలో అంతా అవినీతిపరులేనని ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. 
ఇదో సినీ డ్రామాలా నడుస్తోంది. ఇప్పటికే నలబై ఐదుసార్లు ప్రజా కోర్టులో దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఈ యాత్ర ఊపిరులూదకపోగా.. నవ్వులపాలుచేస్తోంది.
రచయిత ఈమెయిల్: reddy.gurava@yahoo.com

Back to Top