ముంచుకొస్తున్న ముంపు

– పోలవరం నిర్వాసితులకు అందని ప్రభుత్వ సాయం
– సరిహద్దు సమస్యలతో నలుగుతున్న గిరిజనం
– ఏజెన్సీ బతుకుల్లో నిప్పుల కుంపటిగా మారిన పోలవరం
– కాళ్లవాపు, ఇతర రోగాలతో మరణిస్తున్న గిరిజనులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఒక జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఎవరి కాపురం వారు పెట్టుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు పేరుతో ఖమ్మం నుంచి ఆంధ్రాలో కలిపిన ఐదు మండలాలు, వాటి పరిధిలోని గ్రామాల పరిస్థితి దుర్భరంగా మారింది. తాము ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తామో ఏ ప్రభుత్వం తమను చేరదీస్తుందో అర్థంకాక సరిహద్దు సమస్యతో అల్లాడిపోతున్నారు. సంక్షేమ పథకాలు అందవు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అధికారులు కాదు కుదరదంటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.. ఆదుకునే దిక్కులేదు. ప్రభుత్వాలు స్పందించవు.. నాయకులు కరుణించరు.. కష్టాలు తీరవు. జబ్బు చేస్తే చూయించుకుందామంటే ఆస్పత్రులుండవు.. టౌన్‌కి వెళ్లాలంటే సరైన రోడ్లుండవు.. శుద్ధమైన తాగు నీరు దొరకదు. ఇక్కడున్న గిరిజన ప్రాంతవాసుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వీరిని పట్టించుకోవడం మానేశాయి. ఆంధ్రా ప్రాంతంలోకి వచ్చిన గ్రామాల బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడిదే అయినా ఆయన కన్నెత్తి కూడా చూడరు. తమకు తెలియకుండా తమ అనుమతి లేకుండా తాము నివసించే ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతానికి బలవంతంగా మార్చి వేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా వారిది అరణ్య రోదనగానే మిగిలింది. 

గిరిజనుల జీవితాలతో ఆటలా
ఆధునికతవైపు ప్రపంచం పరుగులు పెడుతున్నా, ఇంకా సాంప్రదాయాలను వదలని గిరిజనం. వేష, భాష, కట్టుబాటు అంతా పాతదే. ఇంకా బాహ్య ప్రపంచంతో కొన్ని గ్రామాలకు సంబంధాలే లేవన్నది వాస్తవం. అడవి జంతువులను వేటాడటం, కలివిడిగా బతకడం, అప్పుడప్పుడు చేపలను పట్టడం తప్ప వారికి మరెమీ తెలియదు. అటువంటి గిరిజనులను ఇక్కడ పోలవరం కడుతున్నాం, మీరు ఖాళీ చేయం డంటూ చెప్పగానే ఉలిక్కి పడ్డారు. వారికి ప్యాకేజీల గురించి, ప్రాజెక్టుల గురించి తెలియదు. ఇక్కడేదో ప్రాజెక్టుకు కడుతున్నారనీ, తమ ఇళ్లు, భూములు మునిగిపోతాయని మాత్రమే వారికి తెలుసు. తాము నమ్ముకున్న అడవిని వదలుకుని ఎలా జీవించాలని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. 

ముంపు ప్రాంతాలు గనుక అభివృద్ధి చేయరట
పోలవరం విలీన ప్రాంతాలైన నెల్లిపాక, కూనవరం, చింతూరు, విఆర్‌ పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. మునిగిపోయేవి గనుక ఈ ముంపు ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులూ చేయమంటున్నారు అధికారులు. కనీసం తాగునీటి సమస్యలు కూడా పరిష్కారం చేయడంలేదు. గతంలో తుపాన్‌కు చెరువులకు గుండ్లు పడ్డాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. రోడ్లు చెడిపోయాయి. గోదావరి నుంచి ఏర్పాటుచేసిన తాగునీటి వనరులన్నీ పాడైపోయాయి. మోటార్లు పాడైపోయాయి. బాగుచేయండని అడిగితే జిల్లా కలెక్టర్‌ దగ్గర నుంచీ అధికారులందరిదీ ముంపు ప్రాంతం రిపేర్లు చేయడం జరగదని ఒకటే సమాధానం. 

కలెక్టర్‌ను కలవాలంటే 250 కిమీ వెళ్లాలి
భద్రాచలం డివిజన్‌ నుంచి విడదీసిన నెలిపాక, చింతూరు, కూనవరం, విఆర్‌ పురం మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను అశ్వారావుపేట నుంచి విడదీసి పశ్చిమగోదావరి జిల్లాలో కలిపేశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలు ముఖ్యంగా గిరిజనులు కాకినాడ వచ్చి కలెక్టర్‌ను కలిసి తమ బాధ చెప్పుకోవాలంటే 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. రైలు లేదు. బస్సే దిక్కు. ఒకరోజులో వెళ్లిరావడం సాధ్యంకాదు. కచ్చితంగా రాత్రి కాకినాడలో బస చేయాల్సిందే. ఎక్కడ బస చేస్తారు? భరించలేని ఖర్చు. ఇంతకీ వెళ్తే కలెక్టర్‌ దర్శనం దొరుకుతుందన్న గ్యారంటీలేదు. ముందుగా కలెక్టరు అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి వీళ్లేమైనా ఎమ్మెల్యేలా? ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇక ఐటిడిఎ రంపచోడవరం కూడా 200 కిలోమీటర్లు. అక్కడా ఇదే బాధ. విమానాల్లో తిరిగేవాళ్ళు చేసిన నేరానికి సామాన్య గిరిజనులు, సామాన్య ప్రజలు బలైపోతున్నారు.

నలిగిపోతున్న విద్యార్థులు, నిరుద్యోగులు
ఈ మధ్య జరిగిన డిఎస్సీకి విలీన ప్రాంతంలో చదువుకున్న యువతీ యువకులు అప్లికేషన్‌ పెట్టగా మీరు భద్రాచలం, ఇతర తెలంగాణలో చదువుకున్నారు గనుక మీరు స్థానికులు కారని తిరస్కరించారు. తెలంగాణ నుంచి విడిపోయినందున అక్కడ స్థానికులు కారు. అక్కడ చదువుకున్నందున ఇక్కడ స్థానికులు కాదంటున్నారు. ఇంతకీ విలీన ప్రాంతాల ప్రజలు ఎక్కడ స్థానికులో మాత్రం చెప్పడంలేదు. స్థానిక గిరిజన యువత వందలాదిమంది ఉన్నత విద్యార్హత కలిగి ఉన్నా, బిఇడి, టిటిసి కలిగి ఉన్నా వారిని నియమించడంలేదు.

టీచర్లు లేరు–డిగ్రీ కాలేజీ లేదు
తెలంగాణాకు చెందిన టీచర్లు, లెక్చరర్లు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ స్థానాలను భర్తీచేయలేదు. అత్యధిక స్కూళ్లు మూతబడగా మిగిలినవి విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నా సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్నాయి. ఉదాహరణకు కుక్కునూరు మండలంలో 75 స్కూళ్లలో 145 మంది టీచర్లు ఉండాలి. మిగిలింది 14 మంది టీచర్లే. కొంచెం అటూ ఇటూగా విలీన మండలాలన్నింటిలో ఇదే పరిస్థితి. జూనియర్‌ కాలేజీల్లో తెలంగాణకు చెందిన లెక్చరర్లు, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు వెళ్లిపోయారు. కాలేజీల్లో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరు. డివిజన్‌లో ఒకే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భద్రాచలంలో ఉన్నది. భద్రాచలం తెలంగాణకు పోవడంతో విలీన ప్రాంతంలో విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు కాలేజీ లేదు. చదవాలనుకుంటే రాజమండ్రి, కాకినాడల్లో ప్రైవేటు కాలేజీల్లో చేరాలి. అంత ఆర్థిక స్థోమత లేక విద్యార్థులకు దారి దొరకడంలేదు. విద్యార్థులకు బస్సుపాస్‌ల కోసం భద్రాచలానికి వెళ్తే మీద ఆంధ్రప్రదేశ్‌ గనుక గోకవరం పోయి తీసుకోండి అంటున్నారు. 150 కిలోమీటర్లు వెళ్లి గోకవరంలో పాస్‌ తీసుకునేందుకు ఎంత ఖర్చు, ఎన్ని తిప్పలు. విలీన గ్రామాల్లో తిరుగుతున్న బస్సుల్లో అత్యధికం భద్రాచలం డివిజన్‌వి. ఈ ఆంధ్రా పాస్‌లు వాటిలో చెల్లుబాటు కావడంలేదు. డివిజన్‌లో ఉన్న ఒకే ఒక్క బీఈడీ కాలేజీ కాగా తెలంగాణకే పోయింది. స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, టీచర్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. 

పునరావాసం ఊసేలేదు
ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖా మంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ పోలవరం మూడేళ్ళలో పూర్తిచేస్తామంటున్నారు. కాకుంటే నాలుగేళ్లలో పూర్తిచేసేస్తామని ప్రకటనలు ఇవ్వని రోజు లేదు. అదే ముఖ్యమంత్రి నోటి నుంచి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం అని ఒక్కరోజు కూడా రాలేదు. పోలవరం ముంపు ప్రాంతంగా భావించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రంతో వివాదం రాకుండా ఉండేందుకు నెలిపాక, కూనవరం, చింతూరు, విఆర్‌ పురం మండలాల్లోని దాదాపు రెండు లక్షల జనాభా గల గ్రామాలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 60 వేల జనాభా గల గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు. ప్రభుత్వ లెక్కల్లో కొంత తేడా ఉంటుంది. 2,50,000 మంది ప్రజలను నిర్వాసితులుగా ప్రకటించినట్లయింది. దాదాపు 70–80 వేల కుటుంబాలు ఉంటాయి. వీరందరికీ పునరావాసం కల్పించాలి. ప్రతి కుటుంబానికీ 5 సెంట్లు ఇల్లు కట్టుకునేందుకు ఇవ్వాలి. చట్ట ప్రకారం గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలి. ఇంత వరకు పునరావాసం ఫలానా చోట కల్పిస్తాం. ఫలానా చోట భూమి ఇస్తామని చెప్పింది లేదు. చూపించిందీ లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న గ్రామాలకు కూడా చేయాల్సిందంతా చేయకుండా భయపెట్టి వెళ్లగొట్టారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డలో కేవలం 70 గిరిజన కుటుంబాలకు భూమి ఇవ్వలేని ప్రభుత్వం పోలవరంలో వేలకు వేల గిరిజన కుటుంబాలకు భూమి ఎప్పుడిస్తుంది? ఎక్కడిస్తుంది? తెలిసిన వారందరికీ ఆందోళనగానే ఉంది. తోటపల్లి బేరేజీలో 22 గ్రామాలు, వంశధార ఫేజ్‌–2లో 23 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గత 12 సంవత్సరాలుగా వాటికి పునరావాసం కల్పించలేకపోయారు. వందలాది గ్రామాలు, లక్షల ప్రజలు మునిగే పోలవరం ప్రాజెక్టు నిజంగా చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నట్లు మూడు నాలుగేళ్లలో పూర్తిచేస్తే వీళ్లు పోలవరంలో మునిగిపోవాల్సిందే తప్ప పునరావాసం అసాధ్యం. 
Back to Top