ఎపి లో ఫైబ‌ర్ గ్రిడ్ కుంభ‌కోణం

కాదేదీ చంద్ర‌బాబు కుంభకోణానికి అన‌ర్హం. ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా 149రూ.కే టివి, ఇంట‌ర్నెట్, టెలిఫోన్ క‌నెక్ష‌న్ అంటూ మూడేళ్లుగా ఊద‌ర‌గొడుతున్నారు చంద్ర‌బాబు. ఏడాది క్రితం ప‌ట్టాలెక్కిన ఈ ఫైబ‌ర్ గ్రిడ్ ప‌నులు ఇప్ప‌టికీ ఒక కొలిక్కి రాలేదు. కానీ ఐటి శాఖామాత్యులు లోకేష్ గారు మాత్రం సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకు ల‌క్ష క‌నెక్ష‌న్లు ఇచ్చేస్తున్నాం , 2019 చివ‌రిక‌ల్లా 50ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లు ఇచ్చేస్తామ‌ంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఫైబ‌ర్ గ్రిడ్ క‌నెక్ష‌న్ గురించి ప‌క్క‌న పెడితే ఇందుకోసం ప‌ని చేసే కంపెనీల య‌జ‌మానుల‌కు చంద్ర‌బాబుకు ఉన్న క‌నెక్ష‌న్ గురించి తెలుసుకోవ‌డం ఇక్క‌డ ప్ర‌ధానం. ఎందుకంటే ఫైబ‌ర్ గ్రిడ్ క‌థ‌కు అస‌లు మూలం అక్క‌డే ఉంది మ‌రి. 

సెట్ టాప్ బాక్సుల క‌థ‌
చౌక ధ‌ర‌ల‌కే ఇంట‌ర్నెట్, టివి కోసం కొత్త సెట్ టాప్ బాక్స్ కొనుక్కోవాల‌న్న‌ది చంద్ర‌బాబుగారి నిబంధ‌న‌. దీని ఖ‌రీదు 4000. ఇప్ప‌టికే కేబుల్ ప్ర‌సారాల‌కోసం 1500 ఇంకా ఎక్కువ కూడా వెచ్చించి ప్రజ‌లు సెట్ టాప్ బాక్సుల‌ను కొనుగోలు చేసారు. ఇప్పుడు మ‌ళ్లీ నాలుగు వేల‌తో ఈ బాక్సును కొనాలి అంటే అంద‌రికీ ఇది సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఇక సెట్ టాప్ బాక్స్ ల‌ను అందిచ‌డం, క‌నెక్ష‌న్ల కోసం టెరా సాఫ్ట్ అనే సంస్థ కు గుత్తంగా ఈ ప్రాట‌జెక్టును అప్ప‌చెప్పారు చంద్ర‌బాబు . ఇంత‌కీ ఈ టెరా సాఫ్ట్ ఎవ‌ర‌య్యా అంటే చంద్ర‌బాబు గారి హెరిటేజ్ కంపెనీలోని భాగ‌స్వామి. ఇంకా, ముఖ్య‌మంత్రిగారికి స‌మీప బంధువు కూడాను. ఇదిలా ఉండ‌గానే ఐటి మంత్రి లోకేష్ అమ‌ర్ రాజా, యాగ్ టెక్నాల‌జీ సంస్థ‌ల‌ను క‌లిసి సెట్ టాప్ బాక్స్ ల కొనుగోలుకు చ‌క్రం తిప్పేసారు. చైనాలో త‌యారైన సెట్ టాప్ బాక్సుల విడిభాగాల‌ను ఈ రెండు సంస్థ‌లు అసెంబుల్ చేసి అందిస్తాయి. ఇప్ప‌టిదాకా 1500 ఉన్న సెట్ టాప్ బాక్స్ కేవ‌లం ఈ కంపెనీల కార‌ణంగా 4000 ఖ‌రీదై కూర్చుంది. ఎందుకంటే అమ‌ర్ రాజా సంస్థ చిత్తూరుకు చెందిన ఒక టిడిపి నేత‌ది కాగా, యాగా టెక్నాల‌జీస్ కృష్ణాజిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన మ‌రో అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధిది. 

రాష్ట్రంలో మూడు కోట్ల కేబుల్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. నారావారి స‌హోద‌ర కంపెనీలు అంట‌గ‌ట్టే సెట్ టాప్ బాక్స్ ల‌వ‌ల్ల 12వేల కోట్లు వ‌స్తాయి. అందులో వాస్త‌వ ఖ‌ర్చులు పోగా మిగిలిన 4500 కోట్లు ప్ర‌జ‌ల‌నుంచి అధికంగా వ‌సూలు చేసిన సొమ్మే. ఇది ఆయా కంపెనీల‌కు వారి ద్వారా చేతులు మారి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు క‌మీష‌న్ల రూపంలో చేర‌నుంది. ఇక ఈ సెట్ టాప్ బాక్సుల‌ను ఇళ్ల‌కు చేర‌వేయ‌డానికి కూడా నిధుల‌ను స‌మీక‌రించి ప్ర‌భుత్వ‌మే అందించ‌డం మ‌రో విడ్డూరం. సొంత వారికి దోచిపెట్ట‌డం, అందిన‌కాడికి అందులోంచి క‌మీష‌న్లు దండుకోవ‌డం కోస‌మే ఈ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ క‌నెక్ష‌న్ అని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా కేబుల్ వ్య‌వ‌స్థ‌ను గుప్పెట్లో పెట్టుకోవ‌డం, కేవ‌లం అధికార పార్టీ కోరుకున్న వాటినే ప్ర‌జ‌ల‌కు అంద‌జేసేందుకు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Back to Top