బాబుపై డౌట్‌!

  • –అమరావతిపై ప్రపంచ బ్యాంకుకు అనుమానం
  • – క్రెడా అధికారులతో వరల్డ్‌ బ్యాంకు సంప్రదింపులు
  • – రూ. 4వేల కోట్లు అప్పు తీర్చే సత్తా ఉందా అని ఆరా
  • – సీఎం చెబుతున్న అబద్దాలతో విసిగిన బ్యాంకు బృందం 
అమరావతి:  ప్రపంచ బ్యాంకు జీతగాడిగా ముద్రపడిన చంద్రబాబుపై ఇప్పుడా ఆ బ్యాంకు అనుమానంతో ఉంది. ఈ రెండేళ్లలో ఏపీ సీఎం అంతగా మారిపోయాడనడానికి ఆయన చేసిన అవినీతే కారణంగా చెప్పుకోవచ్చు. అధికారంలోకి వచ్చింది మొదలు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా, అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడం, శంకుస్థాపనలతో మమ అనిపించడం ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు అప్పు ఇవ్వాలనుకున్న ప్రపంచ బ్యాంకుకు అనుమానం కలుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి చుట్టూ అల్లిన ఊహల పందిరిపై ప్రపంచ బ్యాంకుకూ సందేహం వచ్చింది. అమరావతిలో భూముల పేరిట జరుగుతున్న రియల్‌ దందాపై ఒక కన్నేస్తూ వస్తున్న ప్రపంచ బ్యాంకు తాజాగా రూ. 4000 కోట్ల అప్పు కోరుతున్న క్రెడా అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ అప్పు తీర్చే శక్తి వుందా అంటూ ఆలోచనలో పడింది. చంద్రబాబు సంగతి తెలిసిన ప్రపంచ బ్యాంకు పెద్దలు తీవ్ర ఆలోచనల్లో పడ్డారు. ఇప్పటికే కాకినాడ– రాజమహేంద్రవరం రహదారి విషయంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పెడచెవిన పెట్టిన చంద్రబాబును నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. మూడేళ్లలో 6 శాతం పనులు పూర్తి చేసిన రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీని పనుల నుంచి తొలగించాలని వరల్డ్‌బ్యాంకు పలుమార్లు సూచించినా చంద్రబాబు లెక్కచేయలేదు. దీంతో వారే పనుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి బాబుకు షాకిచ్చారు. ఇదంతా గతం. తాజాగా వాటి ప్రభావం అమరావతి నిర్మాణంపైనా పడినట్టే కనిపిస్తుంది. 

నివేదికలపై అసంతృప్తి
మెకెన్సీ కంపెనీ ఇచ్చిన నివేదికలు సంతప్తిగా లేకపోవడంతో బ్యాంకు బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ భవన సముదాయం నిర్మించడానికి ఎంత సమయం పడుతుంది, కేంద్రం నుంచి ఎంత వస్తుంది, దీనివల్ల జనాభా, ఆదాయం ఏ మేరకు పెరుగుతాయి వంటి విషయాలపై మరింత స్పష్టత కావాలని బ్యాంకు భావిస్తుంది. అంతేగాక కొండవీటి వాగు ముంపు నివారణ పథకాలపైన, పర్యావరణ పరిరక్షణ నమూనాలపైన కూడా సందేహాలు వెలిబుచ్చింది. నిజానికి రాజధాని నిర్మాణంపై సింగపూర్‌ ఉచితంగా డిజైన్లు ఇచ్చిందని చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వం రూ. 11 కోట్లు ఈ కంపెనీలకు కేటాయించింది. ఇప్పుడు వాటిని రూపొందించిన మాకీ అసోసియేట్స్‌ను పక్కనపెట్టి సొంతంగానే డిజైన్లు తయారు చేయిస్తున్నది. ఇందులో అన్నీ అరకొరగా అస్పష్టంగా ఉన్నాయి. ఎవరిని భాగస్వామిని చేసుకోవాలో తేల్చలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బుతోనూ ఇతరత్రా సమీకరణలతోనూ దశలవారీగా నిర్మించుకునే బదులు అంతర్జాతీయ ప్రమాణాలంటూ వాణిజ్య బాణీలు మిళితం చేయడంతో మొత్తంగానే పని నత్త నడకలో పడిందని, నమ్మకం తగ్గిందని పాలక పక్ష నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఐసీ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే రుణాల మంజూరుకు నిరాకరించాయి. హడ్కోతో మాత్రం చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.58 వేల కోట్ల మేరకు రుణాలు సేకరించేందుకు మార్గాలు అన్వేషించాలని ఆదేశించారు గాని అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇచ్చిన వాటికి లెక్కలు అడగడంతోనే సరిపెట్టేస్తుంది. సింగపూర్‌పై చంద్రబాబు ఆశలు ఫలించేట్టు కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

సమీక్షలతో హడావుడి 
పదవీ కాలం సగం దాటిపోయినా ముందుకుసాగని అమరావతిలో అద్భుతం జరుగుతుందని కలరింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలలో మునిగితేలుతున్నారు. ఏదో అద్భుతం చేసేస్తున్నట్టు హడావుడి చేయడం తప్ప అక్కడ ఒక్క పనీ జరగడం లేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు కూడా వేయలేదు. కేవలం మూడు గ్రామాల్లో మాత్రమే అది కూడా అంతర్గత రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌  భూమి చదును దశలోనే వుండిపోయింది. ఈ ఆలస్యం,  అస్పష్టత భూములిచ్చిన రైతులను కూడా కలవరపెడుతున్నాయి. ఈ లోగా నోట్ల రద్దు నిర్ణయంతో భూముల రేట్లపై ఆశలు అడుగంటాయి. విజయవాడకు అనుసంధానం, కృష్ణానది నీటి సరఫరా, హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్ల మార్పు వంటివి కూడా ముందుకు సాగలేదు. ఎన్‌టీఆర్‌ జలసిరి ద్వారా నీటిఎద్దడి లేకుండా చేస్తామన్న హామీ కూడా అమలుకు నోచలేదు. ఉపాధి కోల్పోయిన యువతకు నెలకు రు.2500 చెల్లింపు సక్రమంగా జరగడం లేదు. వీరికి సహాయంగా వుంటాయన్న అన్న క్యాంటీన్లు సచివాలయం మినహా మరెక్కడా ఏర్పడలేదు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే చంద్రబాబు అమరావతి నిర్మిస్తారన్న నమ్మకం ప్రపంచ బ్యాంకు బృందానికి కలుగడం లేదు. దీంతో ఆయనపై అపనమ్మకంతో ఆ బృందం రాష్ట్రంలో పర్యటించింది.
 
 
Back to Top