రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటయిన మంత్రుల కమిటీ ముక్కీ మూలిగీ, నిక్కీ నీలిగీ చివరికి ఓ నివేదికను బయటపెట్టింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తలెత్తుకోలేని రీతిలో పరాజయం -కాదు, పరాభవం!- పాలవడానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారించి, విశ్లేషించి, ఈ దుస్థితి మళ్లీ దాపరించకుండా ఉండాలంటే ఏంచెయ్యాలో సూచించడం ఈ కమిటీకి నిర్దేశించిన లక్ష్యం. కాగా, ధర్మాన కమిటీ తెగబోలెడు కసరత్తు చేసి, గంభీరమయిన చర్చోపచర్చలు సాగించి కడకు నివేదికను వెలికితీసింది. అందులోని తుక్కూ దూగరా చెరిగిపోసి, సారాంశమేమిటో చూస్తే తేలేది అయిదే విషయాలు. 1,. నిత్యం రోడ్డెక్కి త్వం శుంఠ అంటే త్వమేవ శుంఠ అని దుమ్మెత్తిపోసుకుంటున్న కాంగ్రెస్ నేతలు తక్షణమే సదరు బూతుల పంచాంగాన్ని కట్టిపెట్టేయాలన్నది ధర్మాన కమిటీ తొలి సూచన.2. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో తక్షణమే సంస్కరణలు జరిపించి, చెక్క భజన కళాకారులను ఇళ్లకు పంపించి, పార్టీకోసం పనిచేసేవాళ్లను ప్రోత్సహించాలన్నది మరో సూచన.3. రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సిన నామినేటెడ్ పదవుల నియామకం అర్జెంటుగా చెయ్యకపోతే, నక్కాశతో ఇన్నాళ్లుగా పార్టీని అంటిపెట్టుకు తిరిగేవాళ్లు కూడా గల్లంతయిపోతారనీ- అంచేత ఆ పనేదో వెంటనే పూర్తి చెయ్యలనీ ధర్మాన కమిటీ సూచించింది!4. ఇప్పుడు జరిగిన శృంగభంగం చాలదన్నట్లుగా, రాష్ట్రంలో స్థానిక సంస్థలకు వెనువెంటనే ఎన్నికలు జరిపించాలన్నది ఈ కమిటీ సూచనల్లో మరొకటి.5. ఈ నాలుగింటినీ మించినది అయిదో సూచన! ప్రభుత్వం తక్షణమే ఓ వార్తా పత్రికనూ, పనిలో పనిగా ఓ టీవీ చానెల్‌నూ కూడా ఏర్పాటు చేసుకోవాలని ధర్మాన కమిటీ సిఫారసు చేసింది.మొత్తానికి ఈ కమిటీ సూచనలన్నీ కాంగ్రెస్ ఆలోచనా విధానానికి అక్షరాలా సరిపోయేలాగాఉన్నాయి. అమలు జరగడం అనుమానాస్పదం కావచ్చుకానీ, సూచనలు మాత్రం భేషుగ్గా ఉన్నాయి. అవేంటో చూద్దాం!కాంగ్రెస్ నేతలకు సిగపట్లు పట్టుకోడమంటే మహాఇష్టం! అది వాళ్ల అభిమాన క్రీడ అని కూడా చెప్పుకోవచ్చు. ఛోటామోటా నాయకుడి దగ్గిర్నుంచి, కొమ్ములు తిరిగిన పోటుగాళ్ల వరకూ ఈ క్రీడలో ఆరితేరినవాళ్లే. అలాంటి పార్టీకి పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన బొత్స సత్యనారాయణలాంటి మహానుభావుడికి ఈ క్రీడలో నైపుణ్యం ఉండడం సహజం. అలాగే, పైనుంచి ఉత్తరమ్ముక్క తెచ్చుకుని ఈ పార్టీ తరఫున ఎకాయెకీగా ముఖ్యమంత్రి జాక్‌పాట్ కొట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డిలాంటి నేతకూ ఈ క్రీడలో గొప్ప నేర్పు ఉండేఉంటుంది. (అందునా, ఆయన నిజజీవితంలో కూడా స్పోర్ట్స్‌మన్ కావడం వల్ల ఇలాంటి ఆటల్లో ఆరితేరి ఉంటాడు.) అంతటి క్రీడాకారులను ఆటకట్టేసి, గప్‌చిప్‌గా కూర్చోమనడం భావ్యమేనా? ధర్మాన కమిటీ సిగ్గు విడిచి సూచించినప్పటికీ ఈ సూచన అమలు జరగడం -కాంగ్రెస్ పార్టీలో- అసంభవం.ఇకపోతే, చెక్క భజన కళాకారులనూ, తొత్తులనూ, చెమ్చాలనూ పక్కనపెట్టి- కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరిపించాలన్న సూచన ధర్మాన కమిటీ ఆత్మ వంచనకు నిదర్శనం. అసలా పార్టీకి సంస్థాగతమయిన అస్తిత్వమే లేదు. అధినాయకుడికి ప్రీతి కలిగించేలా కీర్తనలు పాడి పబ్బంగడుపుకోవడమే ఆ పార్టీనేతల వృత్తీ, ప్రవృత్తీ కూడా! అలాంటి పార్టీలో నిజంగా సంస్థాగతమయిన ఎన్నికలు జరపడం సాధ్యమేనా? కర్మకాలి ఒకవేళ ఎవరయినా అలాంటి సాహసానికి ఒడిగట్టడమే జరిగితే, కాంగ్రెస్ పార్టీ ఉనికి మిగిలేనా??చెంపదెబ్బతో బుద్ధితెచ్చుకుని, గోడదెబ్బతప్పించుకునేంత తెలివి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ లేదు! అదీ ఇదీ కూడా తగిలితే తప్ప ఆ పార్టీకి తృప్తి ఉండదు. నిన్నగాక మొన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కని విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినట్లుంది. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలే గనక జరిపిస్తే, సార్వత్రిక స్థాయిలో దివాలా తీసి కుదేలవడం ఖాయం. ధర్మాన కమిటీ సూచనలన్నింటిలోకీ ఇది ఆత్మవినాశకరమయిన సూచన! ఇంతకు మించిన నీచమయిన ఆలోచన సొంత పేపరూ, చానెలూ పెట్టుకోవాలన్నది. కాంగ్రెస్ పార్టీ హస్త మహిమ తెలిసిన వాళ్లందరూ, ఆ పార్టీ సొంత పేపరూ చానెలూ మొదలుపెట్టిన నాటి నుంచీ అవెంత సుందరముదనష్టంగా ఉండబోతాయో తేలిగ్గానే గ్రహించగలరు.ధర్మాన కమిటీ లోలోపల కుమ్మకుని, గుద్దుకుని వెలువరించిన నివేదిక మొత్తంలోకి కాస్తంత సమంజసంగా ఉన్న సూచన ఒక్కటే. నామినేటెడ్ పదవుల ఎరవేసి, ఇప్పటికీ తమవెంటే తిరుగుతున్న అర్భకులను ఆకట్టుకోవాలన్నదే ఆ సలహా. ఈ ‘పంచశీల’ చెప్పని ముఖ్యమయిన విషయం ఒకటుంది. కాంగ్రెస్ పార్టీకి -ఆ మాటకొస్తే మొన్నటి ఉప ఎన్నికల్లో దాని చంకెక్కి కూర్చున్న తెలుగుదేశం పార్టీకి కూడా- ఈ ఉప ఎన్నికల్లో మానం దక్కకపోవడానికి మూలకారణం ఏమిటి? ఆ పార్టీలు రెండింటికీ ప్రజల్లో విశ్వసనీయత నశించిపోవడమే ఈ పరిణామానికి మూలకారణం. ఇంత మామూలు విషయం తెలియనట్లు నటించి, గంభీరమయిన నివేదిక రూపొందించి సమర్పించిన ధర్మాన కమిటీ సభ్యులకు ఏ నంది అవార్డో ఇప్పించాలని జనం సూచిస్తున్నారు. వినబడిందా ముఖ్యమంత్రి గారూ?!