అసలు నగరమే లేదు, మితి మీరిన జనాభా అంత కన్నా లేదు. అయినా సరే, రింగు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ఉరకలు వేస్తోంది. కొత్తగా నిర్మించబోయే అమరావతి రాజధానికి ఇప్పటి నుంచి రింగు రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలైపోయాయి.ఇందు కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని చుట్టు 210 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రింగ్‑రోడ్డు కోసం 7,784 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనున్నారు.భూ సేకరణ, భూ సమీకరణ.. పేరు ఏదైనా కానీ.. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కోవటమే అని అందరికీ తెలుసు. ఈ సారి రింగురోడ్ పేరుతో తెలుగు తమ్ముళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా భూములు కోల్పోయే రైతులకు రాజధాని సమీపంలో ప్లాట్లు ఇచ్చేందుకు సింగపూర్ కంపెనీలు అంగీకరించటం లేదు. అందుచేత ఈ రైతుల్ని రింగురోడ్డు ఎక్కించి ఆ పక్కగా ప్లాట్లు ఇచ్చి సరిపుచ్చుతారన్న మాట వినిపిస్తోంది. అందుకే తాజాగా మంత్రి నారాయణ కూడా రింగ్ రోడ్ వివరాలు చెబుతూ ఈ పని పూర్తవుతూనే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల విషయం మీద ద్రష్టి సారిస్తామని చెప్పారు.