ప్రతిపక్షమే టార్గెట్‌

  • మూడేళ్లూ ముచ్చట్లే
  • హోదా కోసం నినదిస్తే విమానాశ్రయంలోనే వైయస్ జగన్‌ నిర్బంధం
  • మహిళ పార్లమెంటు సదస్సు రోజునే మహిళా ఎమ్మెల్యే రోజాపై దాష్టీకం
  • వైయస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి హత్యతో పరాకాష్టకు చేరిన రాజకీయ హత్యలు
  • కిడ్నాప్‌లను తలపించే నిర్బంధాలు..నిరసనలపై సెక్షన్‌లతో దాడి
  • రాష్ట్రంలో మూడేళ్లుగా కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ
  • ఇది హక్కులపై చంద్రబాబు సర్కారు మోపిన ఉక్కుపాదం
అమరావతి : రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా పాలన సాగుతోంది. చంద్రబాబు సర్కారు గత ఏలుబడికి ఏమాత్రం తీసిపోని రీతిలో పోలీస్‌ నిర్బంధం హద్దులు దాటుతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోయి సగటు మనిషి బతుకు నెట్టుకు రావాల్సిన భయంకరపమైన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేతల పట్ల, ప్రజల సమస్యలపైన, ఉద్యమాల విషయంలోను పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష నేతలపై కిడ్నాప్‌లను తలపించే నిర్బంధాలు కొనసాగుతున్నాయి. నిరసనలు తెలియజేసే వారిపై సెక్షన్‌లతో పోలీసులు చేస్తున్న దాడి తీరు రాష్ట్రంలో మూడేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నట్టు ఉంది. ఇది హక్కులపై చంద్రబాబు సర్కారు మోపిన ఉక్కుపాదం అంటూ మేథావులు, పౌరసమాజం మండిపడుతోంది.

ప్రత్యేకహోదా నినాదంతో ఈ ఏడాది జనవరి 26 తేదీన వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో శాంతియుతంగా కొవ్వొత్తుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు లాంజ్‌లోకి కూడా వెళ్లనీయకుండా రన్‌వే పైనే నిర్బంధించి పోలీసుల చేసిన అత్యుత్సాహానికి అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా ఉన్న విశాఖ విమానాశ్రయం సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) ఆధీనంలో ఉంటుంది. దాని లోపలికి నిబంధనలకు విరుద్దంగా చొరబడిన ఏపీ పోలీసులు రాష్ట్ర ప్రతిపక్ష నేతకు సెక్షన్‌ 143 నోటీసు ఇచ్చి రన్‌వే పైనే గంటల తరబడి నిర్బంధించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆహ్వానం మేరకు జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా పట్ల పోలీస్‌ దాష్టీకం పలు విమర్శలకు తావిచ్చింది. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రోజాను కిడ్నాప్‌ తరహాలో పోలీసులు నిర్బందించారు. ఆమె సమయస్పూర్తితో సోషల్‌ మీడియా ద్వారా పోలీస్‌ నిర్భందాన్ని సభ్య సమాజానికి చాటిచెప్పడంతో పోలీసులు ఆమెను కారులో హైదరాబాద్‌ తీసుకెళ్లి ఇంటి వద్ద వదిలేసారు.

సెక్షన్‌లు.. కేసులతో కట్టడికి సర్కారు యత్నాలు
నిరసనలు, ర్యాలీలు జరపకుండా ఐపీసీ సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 అమలు చేస్తున్నారు. ఉద్యోగులు హక్కుల కోసం, ప్రజలు సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు నిరసన తెలిపే అవకాశం లేకుండా నోరు నొక్కేస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతీసారి కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేతలను , వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్‌ తదితర నేతలతో పాటు ఎంతో మందిని గృహనిర్బంధం చేయడానికి పోలీసులు సెక్షన్‌ 151ను ప్రయోగిస్తున్నారు. దివీస్, తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొన్న వైయస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు చేశారు. వైయస్సారీసీపీకి చెందిన గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా హత్యకేసులో ఇరికించారు. టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్న తీరును ఇటీవల వైయస్సార్‌సీపీ నేతలు బృందంగా వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో కాలుష్యకారక మెగా ఫుడ్‌పార్కును వ్యతిరేకించినందుకు ఆ గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతి, ఆమె తనయుడు ఆరేటి వాసుతో పాటు మరో ఐదురుగురిపై 2016 సెప్టెంబర్‌లో నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి ప్రభుత్వం జైల్లో వేయించింది. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన తమకు పునరావస ప్యాకేజి అందించాలని శాంతియుత నిరసనలు తెలిపిన ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం నిర్వాసితులపై దాదాపు 500 కేసులు నమోదు చేశారు. అదే తరహాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపైనా ప్రభుత్వం పోలీస్‌ మార్కు బలప్రయోగం చేయించింది. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలు రైతుల నుంచి గుంజుకునే ప్రయత్నాలపై సాగిన నిరసనలపై పోలీసు కేసులు పెట్టి వేధింపులకు దిగడం గమనార్హం. కాలుష్యకారకంతో పాటు తమ ఉపాధిని దెబ్బతీసే తూర్పుగోదావరి జిల్లా దివీస్‌ మందుల ప్యాక్టరీని వ్యతిరేకించినందుకు మహిళలపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు, అధికారులు, పోలీసులపై టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు దాడులకు దిగుతున్నా కేసులు నమోదు కావడం లేదు. దీనికితోడు టీడీపీ నేతలపై పాత కేసులు ఎత్తివేస్తూ గడిచిన మూడేళ్లలో 132 జీవోలు జారీ చేయడం దారుణం

పెచ్చుమీరుతున్న రాజకీయ హత్యలు
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని అధికార పార్టీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అక్రమ కేసులు, బెదిరింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ దారికి రాకుండా అడ్డువచ్చిన వారిని మట్టుబెడుతున్న సంఘటనలు కోకొల్లలు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయుల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న వారు, తీవ్రగాయాలపాలైన ప్రాణాలు దక్కించుకున్న వారు చాలా మందే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్య రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పరాకాష్టగా చెబుతున్నారు. నారాయణరెడ్డి హత్య వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యకు గురౌతున్న ఘటనలపై పోలీసుల దర్యాప్తుపైన అధికార టీడీపీ ఒత్తిడిలు పనిచేస్తున్నాయి.
Back to Top