<br/>అడ్డగోలు పాలనతో అటు ప్రజలతో తిట్లు, ఇటు న్యాయస్థానాలతో చీవాట్లు తినడం చంద్రబాబుకు అలవాటు అయిపోయింది. రాజధాని భూములను విదేశాలకు కట్టబెట్టడం, చీకటి జీవోలు పాస్ చేయడం, అవినీతికి అడ్డదారులు సిద్ధం చేయడం, రాష్ట్రాన్ని సొంత ఆస్తిలా భోం చేయడం, ప్రైవేటు ఆస్తుల వేలాన్ని అస్మదీయులకు ప్రయోజనకరం చేయడం, దేవాలయం ఆస్తులను హాంఫట్ చేసే మాయాజాలం ప్రదర్శించడం ఇవన్నీ ముఖ్యమంత్రికి హైకోర్టు నుంచి అక్షింతలు పడేలా చేసిన విషయాలు. తాజాగా ఆ జాబితాలో మరోశుభకార్యం కూడా చేరింది. గుంటూరు జిల్లాలో అక్రమ సున్నపురాయి తవ్వకాలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమాలకు కారణమైన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ బాబు సర్కార్ పై మండిపడింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎపి ప్రభుత్వం జుట్టును కాగ్ చేతికి అందించింది. అక్రమ సున్నపురాయి తవ్వకాలవల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించమని కాగ్ ఆదేశించింది ధర్మాసనం. ఎపి ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసును సిఐడికి అప్పగించామని, తుది వివరాలు అందించేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని కోర్టును కోరినా దాన్ని ధర్మాసనం తోసి పుచ్చింది. 1వారంలోపే పూర్తి వివరాలు సమర్పించే తీరాలని గడువు విధించింది. పల్నాడులో గత మూడేళ్లకు పైగా సున్నపు రాయి తవ్వకాలను అధికార టిడిపి నాయకులే గంపగుత్తగా నిర్వహిస్తున్నారు. అనుమతులను మించి తవ్వకాలు, అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం కిమ్మనలేదు. ఈ తీరుపై పోరాటం చేసిన ప్రతిపక్షపార్టీని నిజనిర్థారణకు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా అక్రమార్కులకు, వారికి సహకరించిన అధికారులకు హైకోర్టు ఆదేశాలు చెంపదెబ్బలయ్యాయి. ఇన్ని అక్రమాలు జరిగినా పట్టించుకోని మొద్దునిద్ర ప్రభుత్వానికి, సొంత పార్టీ నేతల అవినీతికి రాష్ట్ర ఆస్తులను రాసిస్తున్న చంద్రబాబు సర్కార్ కు హైకోర్టు వేసిన మరో చురక ఈ తాజా ఆదేశం.