నోటీసులిస్తారని పారిపోతున్నారు
సెక్షన్ -8 ఇప్పుడే గుర్తుకొచ్చిందా.?
అది బాబు గొంతు కాదా.. బాస్ బాబు కాదా..
రేవంత్ రిమాండ్ పొడిగింపుతో దేశం డీలా..
ఫెన్ నాట్ బిఫోర్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో దూకుడు పెంచిన ఏసీబీ ఏ క్షణాన్నైనా నిందితులందరికీ నోటీసులిచ్చే అవకాశముందని మీడియాలో కథనాలు పెరిగాయి. పదిరోజుల గడువు ముగియడంతో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మరోమారు నోటీసు ఇవ్వాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నోటీసులు ఇస్తారన్న భయంతోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు టూర్లు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎద్దేవా చేశారు. కార్యక్రమాలేవీ లేకపోయినా కావాలని పర్యటిస్తున్నారని విమర్శించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో సోమవారం కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈకేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రిమాండ్ను ఏసీబీ కోర్టు వచ్చే నెల 13 వరకు పొడిగించింది. స్టీఫెన్సన్ దాఖలు చేసిన ‘నాట్ బిఫోర్’ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సెక్షన్ 8 అమలుపై దాఖలైన మరో పిటిషన్ను కూడా న్యాయస్థానం కొట్టేసింది. సెక్షన్ 8 అమలు కోసం ప్రత్యేకంగా కేంద్రాన్ని కోరాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు కోట్లు ఉదంతంపై నెల రోజుల తర్వాత స్పందించిన పవన్ మరోమారు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల తర్వాత గానీ వారాంతంలో గానీ ఈ వ్యవహారంపై స్పందిస్తానని పేర్కొన్నారు.

ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో సంభాషిస్తూ దొరికిపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు. ఏసీబీ నోటీసులిస్తుందన్న భయంతోనే హైదరాబాద్ను వదిలి ఆంధ్రప్రదేశ్కు టూర్లు చేస్తున్నారు. జిల్లాల్లో కార్యక్రమాలను పురమాయించుకుని అక్కడే మకాం వేస్తున్నారు. ఏసీబీ నుంచి నోటీసులొస్తాయని అనుమానం వచ్చినపుడల్లా కార్యక్రమాలేవీ లేకపోయినా రాజమండ్రి, విజయవాడ అంటూ పర్యటనకు పరిగెత్తుతున్నారు. ఈ పర్యటనలు అభివృద్ధి కోసమైతే పరవాలేదు కానీ నోటీసుల నుంచి తప్పించుకోవడం కోసమే కావడం బాధాకరం.
ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులు బయటపడి నెలరోజులుగా ఏసీబీ విచారణ జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడుగానీ, తెలుగుదేశం పార్టీ గానీ కొన్ని మౌలికమైన ప్రశ్నలకు సమాధానమే ఇవ్వడం లేదు... అవి ఏమిటంటే...ఆడియో టేపులో సంభాషణలు చంద్రబాబువా కాదా?తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి ఇచ్చిన రు. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? రేవంత్ రెడ్డికి బాస్ ఎవరు? చంద్రబాబా కాదా?చంద్రబాబుకు నోటీసులిస్తారన్న భయంతోనే సెక్షన్-8 గుర్తుకొచ్చింది. అంతకుముందు సెక్షన్ -8ని ఎందుకు పట్టించుకోలేదు?
రేవంత్కు నో బెయిల్..
రిమాండ్ ముగుస్తుండడంతో బెయిల్ కోసం రేవంత్రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కేసువిచారణ కీలక దశలో ఉన్నందున రేవంత్రెడ్డికి బెయిల్ ఇవ్వరాదంటూ ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో రేవంత్తో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ్సింహాల జ్యుడిషియల్ కస్టడీ సోమవారంతో ముగిసింది. దాంతో అధికారులు వారిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు నిందితులకు జులై 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. విచారణ అనంతరం రేవంత్రెడ్డిని అధికారులు జైలుకు తరలించారు. రేవంత్కు రిమాండ్ పొడిగించడంతో మంగళవారం విచారణకు రానున్న బెయిల్ పిటిషన్తో ఎలాంటి ఉపయోగమూ లేదని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఈ కేసులో బయటపడే దారులు మూసుకుపోతున్నాయని తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన పెరిగింది.

స్టీఫెన్సన్ పిటిషన్కు తిరస్కరణ
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పిటిషన్ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్పై విచారణను వేరే బెంచ్కు బదిలీ చేయాలని స్టీఫెన్సన్దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ ఓటుకు కోట్లు కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని స్టీఫెన్సన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. సెక్షన్ -14ప్రకారం స్టీఫెన్సన్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది. స్టీఫెన్సన్ దాఖలు చేసిన ‘నాట్ బిఫోర్’ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి శివశంకరరావు తీవ్రంగా స్పందించారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పిటిషనర్పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించిన న్యాయమూర్తి ఆ తర్వాత కొద్దిసేపటికి శాంతించారు. తన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని చెప్పారు. అవసరమైతే అడ్వకేట్ జనరల్ ఈ విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉండొచ్చని జస్టిస్ శివశంకరరావు అన్నారు. ఒకవేళ ఇదే బెంచ్ విచారణ కొనసాగించాల్సి వస్తే కేవలం న్యాయవాదులను మాత్రమే అనుమతించి విచారణ జరుపుతామని, వాదనలను చీఫ్జస్టిస్ ముందు ఉంచుతామని అన్నారు.

సెక్షన్ 8 అమలుపై పిటిషన్ కొట్టివేత
సెక్షన్ -8 అమలుపై పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుపై సెటిలర్స్ ఫోరం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఆదేశిస్తేనే గవర్నర్ సెక్షన్ 8 అమలు చేయాలని ఎక్కడా లేదని హైకోర్టు బెంచ్ పేర్కొంది. సెక్షన్ 8 అమలయ్యేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించిన సంగతి తెల్సిందే.

రెండురోజుల్లో స్పందిస్తానంటున్న పవన్
పదవుల కోసం కాదు.. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ఘనంగా ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ ఓటుకు కోట్లు ఉదంతం చోటు చేసుకున్న నెలరోజుల తర్వాత తీరిగ్గా స్పందించారు. అది కూడా చంద్రబాబును వెనకేసుకొస్తున్నట్లుగా, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ పడాలన్నట్లుగా ఉండడంతో విమర్శలు చెలరేగాయి. పవన్ స్పందన చూస్తుంటే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని స్పందిస్తున్నట్లుగా ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబుకు పవన్ పెయిడ్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు. ఇదే అంశం మీద ఎన్టీవీ సోమవారం నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో 85 శాతం మంది అంబటి వ్యాఖ్యలను సమర్థించగా 15 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. ఓటుకు కోట్లు ఉదంతాన్ని రెండు జాతుల మధ్య వైరంగా పోల్చుతూ నెల్సన్ మండేలాని వివాదంలోకి లాగిన పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన మరోమారు స్పందించారు. మరో రెండు రోజుల్లో ఓటుకు కోట్లు వ్యవహారంపై స్పందిస్తానని పేర్కొన్నారు. నెల రోజులుగా రెండు రాష్ట్రాలలోనూ అనేక పరిణామాలకు మూలబిందువైన ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరం. రాజధాని భూముల విషయంలో చంద్రబాబును ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఆ తర్వాత చాలా రోజుల పాటు ముఖం చాటేశారు.