చంద్రబాబుకు నోటీసులు


అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యయత్నాన్ని మసిపూసి మారేడు కాయ చేసి, చిన్న పాటి దాడి సంఘటనగా తేల్చేయాలనుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వస్తున్న వైఎస్ జగన్ పై కోడిపందేల కత్తితో ఎటాక్ చేసిన శ్రీనివాస్ రావును కాపాడేందుకు టిడిపి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేసింది. ఇంత పెద్ద ఘటనను అతి సామాన్యమైన విషయంలో పేలవమైన విచారణ చేసింది. ఘటన జరిగిన మరుక్షణం నుంచే విచారణపై ప్రభుత్వం, టిడిపి నాయకులు, పోలీసు బాసులు కలిసి విచారణను తమకు నచ్చిన విధంగా జరిగేలా ప్రభావితం చేసారు. 
ప్రభుత్వంపై, పోలీసులపై, న్యాయవ్యవస్థపై నమ్మకముంచి మౌనంగా వెళ్లిపోయిన వైఎస్ జగన్ ప్రభుత్వం తనపై జరిగిన హత్యా ప్రయత్నానికి సంబంధించిన విచారణలో కనపరుస్తున్న నిర్లక్ష్యాన్ని చూసి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తు విచారణ పక్షపాత ధోరణిలో ఉందని, సమగ్ర దర్యాప్తు జరగడం లేదని అత్యున్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఎపి, తెలంగాణా డీజీపీలతో పాటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వానికి 2వారాల సమయం ఇచ్చింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
జగన్ పై హత్యాప్రయత్నం కేసును నీరుగార్చాలని టిడిపి అధినేత పడే తాపత్రయం  చూస్తే సామాన్యులకు కూడా అనుమానం కలిగించేలా ఉంది. ప్రాధమికంగా ఉన్న ఎన్నో ఆధారాలను, అనుమానిత కోణాలను పోలీసులు కనీసం పట్టించుకోలేదు. విచారించలేదు. చంద్రబాబు, ఆయన మంత్రులు, పోలీస్ బాస్ ఇచ్చిన స్టేమెంట్ రూట్ లో మాత్రమే దర్యాప్తు కొనసాగింది. ఇది వాస్తవాలను దాచే ప్రయత్నమని, కుట్రలో భాగస్వాములు తప్పించుకుంటున్నారని అనుమానించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు దోషులెవరని తెలియాలంటే కేంద్రానికి చెందిన దర్యాప్తు సంస్థలకే ఈ విచారణను అప్పగించాలని డిమాండ్ చేసింది. జగన్ కు ఎపి పోలీసులపై నమ్మకం లేదని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అని చిందులేనిసిన చంద్రబాబు, ఇక్కడ దాడి ఘటన అనంతరం దిల్లీకి పరుగులు పెట్టారు. నేషనల్ మీడియా ముందు తాను నిర్దోషినని గగ్గోలు పెట్టారు. గుమ్మడికాయ దొంగ పేరు చెబితే భుజాలు తడుముకున్నట్టున్న చంద్రబాబు ప్రవర్తనకు వెనుక రహస్యమేమిటో, హైకోర్టు ఆదేశాలతో అయినా బయటపడతాయేమో చూడాలి. 
 
Back to Top