క్రైమ్ రైజింగ్ స్టేట్‌గా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గారు సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ‌, క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ నివేదిక‌లే ఇందుకు ప్ర‌త్య‌క్ష్య సాక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌

మద్దిలిపాలెంలోని వైయస్‌ఆర్‌సీపీ విశాఖ సిటీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు మీడియాతో మాట్లాడారు.

కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షిణించాయి 

మహిళలకు ఇంట్లోనూ బయటా రక్షణ లేదు   

టీడీపీ నేతలే నేరాలకు కారణం

వ‌రుదు క‌ళ్యాణి తీవ్ర ఆరోప‌ణ‌లు  

112 ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్ రెస్పాండ్‌ అయ్యే సమయం నేషనల్‌ యావరేజ్‌ 18 నిమిషాలు ..ఏపీ యావరేజ్‌ 25.50 నిమిషాలు

వైయ‌స్‌ జగన్ గారి పాలనలో ఫోన్ చేస్తే 3–5 నిమిషాల్లో స్పందన  

హోం మంత్రి వైఫల్యానికి ఇదే నిద‌ర్శ‌నం

టీడీపీ నేత‌ల అండ‌తోనే డ్రగ్స్, గంజాయి స‌ర‌ఫ‌రా

రెడ్‌బుక్ రాజ్యాంగంతో నేరాలకు ఊతం  

ప్రజలు కూటమి పాలనను మెచ్చుకోవడం లేద‌న్న చంద్రబాబు వ్యాఖ్యలే సాక్ష్యం

మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి తీవ్ర ఆక్షేపం

విశాఖ‌: రాష్ట్రాన్ని సన్‌రైజ్‌ స్టేట్‌గా మారుస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ను ‘క్రైమ్‌ రైజింగ్‌ స్టేట్‌’గా మార్చిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మహిళల రక్షణను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించి పోయాయని  వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు. శ‌నివారం మద్దిలిపాలెంలోని వైయస్‌ఆర్‌సీపీ విశాఖ సిటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో వ‌రుదు క‌ళ్యాణి ఇంకా ఏమ‌న్నారంటే..

● కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లేఖ‌నే సాక్ష్యం

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయన్న‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని సన్‌రైజ్‌ స్టేట్‌గా మారుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఈ 18 నెల‌ల పాల‌న‌లో ఏపీని ‘క్రైమ్‌ రైజింగ్‌ స్టేట్‌’గా మార్చిందన్న ఆరోపణలు నిజమవుతున్నాయి. దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగినట్టు కలెక్టర్ల సమావేశ గణాంకాలే చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్కటే 1458 మహిళలపై అత్యాచారాలు, 5035 వేధింపులు చోటుచేసుకోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సూచిస్తోంది. మహిళల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబుకు రాసిన లేఖతోనూ స్పష్టమైంది. 112 ఎమర్జెన్సీ కాల్‌కు ఫోన్ చేస్తే దేశ సగటు స్పందన 18 నిమిషాలైతే, ఏపీలో 25.50 నిమిషాలు తీసుకుంటుండటం పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. ముఖ్యమంత్రి నివసిస్తున్న జిల్లాలోనే మహిళలపై నేరాలు 11 శాతం, హోం మంత్రి ఇన్‌చార్జ్‌ జిల్లా విజయనగరంలో 19 శాతం పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం వల్లే నేరస్థులకు రక్షణ లభిస్తున్నదని, ఫలితంగా మహిళలకు ఇంట్లోనూ బయటా, పని ప్రదేశాల్లోనూ భద్రత కరువైంది. 

● బాబు గారూ..ప్ర‌జ‌లు మీ పాల‌న‌ను మెచ్చుకోవ‌డం లేదు

చంద్రబాబు ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ‘మీరు బాగా పని చేస్తున్నారని నేననుకుంటున్నాను, నేను బాగా పని చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మన పాలనను మెచ్చడం లేదు’ అని స్వయంగా చెప్పడం ఆయన పాలనకు అద్దం పడుతోంది. ప్రజలు మీ పాలనను నిజంగానే మెచ్చుకోవడం లేదని, పాలన సరిగా లేదని మేము పదే పదే చెబుతున్నాం.  డేటా డ్రివెన్‌ గవర్నెన్స్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం వాస్తవానికి దోపిడీ డ్రివెన్‌ డిజాస్టర్‌ గవర్నెన్స్‌ను అమలు చేస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే కేవలం 18 నెలల పాలనలో ఇంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదే మొదటిసారి. 

● టీడీపీ నేత‌లే నేర‌స్థులు

కబ్జాదారులు, హత్యలు, అత్యాచారాలు చేసే నేరస్థులను ఈ ప్రభుత్వమే కాపాడుతుండటమే శాంతిభద్రతలు ఇంతగా క్షిణించడానికి కారణం. మహిళలను వేధించేవారు, మైనర్లపై అఘాయిత్యాలు చేసేవారు, నకిలీ మద్యం తయారీ, డ్రగ్స్‌ సరఫరా, ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ ఉద్యోగుల వేధింపులు, పేకాట క్లబ్‌ల నిర్వహణ..ఇవన్నీ టీడీపీ నేతలే చేస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. క్రైమ్‌ రేట్‌ పెరగడానికి ప్రధాన కారకులు టీడీపీ నేతలేనని, అలాంటి నేరస్థులను అదుపు చేయలేక చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేశారు. 

● బిజినెన్స్‌ రిఫార్మ్స్‌ అవార్డు ఏ ప్ర‌మాణాల‌తో ఇచ్చారో..

చంద్రబాబుకు బిజినెన్స్‌ రిఫార్మ్స్‌ అవార్డు వచ్చిందని టీడీపీ, కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నా, వాస్తవంగా ఆయన పాలనలో గూండాగిరి, నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ప్రజలు భావిస్తున్నారు. లా అండ్‌ఆర్డర్‌ ఇంత దారుణంగా దిగజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పడమే కాకుండా, చంద్రబాబు స్వయంగా కలెక్టర్ల సమావేశంలో వెల్లడించిన అంశాలే దీనికి సాక్ష్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇలా క్షీణిస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. బిజినెన్స్‌ రిఫార్మ్స్‌ అవార్డు ఏ ప్రమాణాలపై ఇచ్చారో తెలియదుగానీ, గంజాయి, డ్రగ్స్‌, కల్తీ మద్యం వ్యాప్తిలో మాత్రం చంద్రబాబు పాలన దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

● డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌లో 16 జిల్లాలు రైజింగ్ స్టేజ్‌

ఇటీవ‌ల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వెల్లడైన గణాంకాల ప్రకారం డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌లో రాష్ట్రంలోని 16 జిల్లాలు రైజింగ్‌ స్టేజీలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 213 శాతం, నెల్లూరులో 121 శాతం, కోనసీమలో 72 శాతం, ఏలూరు–కర్నూలులో 50 శాతం, గుంటూరులో 44 శాతం, ప్రకాశంలో 37 శాతం, కాకినాడ, పశ్చిమగోదావరిలో 36.4 శాతం, విజయనగరంలో 28.4 శాతం, ఎన్టీఆర్‌ జిల్లాలో 24.3 శాతం, కృష్ణాలో 20 శాతం, పల్నాడులో 6.7 శాతం, అన్నమయ్యలో 5.9 శాతం, తిరుపతిలో 1.3 శాతం డ్రగ్స్‌, గంజాయి, కల్తీ మద్యం గ్రోత్‌ రేటు పెరిగిందని ప్రభుత్వమే ఇచ్చిన రిపోర్టులు చెబుతున్నాయి. ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమవడంతో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి.

● రాష్ట్రం నుంచి మ‌హిళ‌లు వల‌స వెళ్లే ప్ర‌మాదం ఉంది

రాష్ట్రంలో రోజుకు 70–80 మంది మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని, గంటకు ముగ్గురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ప్ర‌భుత్వ లెక్క‌లే చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాష్ట్రం నుంచి మహిళలు వలస వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఈ ఘోరాలకు బాధ్యత వహించాల్సిన హోం మంత్రి అనితకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? కేంద్ర హోంశాఖ నివేదికలో ఏపీ 36వ స్థానానికి పడిపోయింది. గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంటే చర్యలు తీసుకోలేని హోం మంత్రి, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి సర్వేలో కూడా హోం మంత్రి పనితీరు బాగోలేదని తేలింది, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్టే ఆమె అత్యంత అసమర్ధురాలైన ఫెయిల్యూర్‌ హోం మంత్రిగా నిలిచారు. 

● ఇక‌నైనా క‌ళ్లు తెర‌వండి..

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని విస్మరించడమే రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకువచ్చింది.  ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి 112 ఎమర్జెన్సీ కాల్‌లకు వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలని వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

Back to Top