భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసమే ఇందుకు నిదర్శనం

హడావిడిగా సాధారణ శివలింగం ఎందుకు పెట్టారు ?

వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపణ

రాజమహేంద్రవరం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

చంద్రబాబు పాలనలో ఆలయాలకు రక్షణ కరవు

18 నెలల కూటమి పాలనలో లెక్కలేనన్ని ఘటనలు

తిరుమల నుంచి ద్రాక్షారామం వరకూ అపచారాలు

తప్పు కప్పిపుచ్చుకునేందుకే ద్రాక్షారామంలో హడావిడి నిర్ణయాలు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం 

రాజమహేంద్రవరం :         కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ  18 నెలల కాలంలో రాష్ట్రంలో ఆలయాల్లో లెక్కలేనన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటన వీటన్నింటికీ పరాకాష్ట అని వైయ‌స్ఆర్‌సీపీతూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. కూటమి పాలనలో  తిరుమల లడ్డూ నుంచి మొదలుపెడితే.. తాజాగా చోటు చేసుకున్న కనకదుర్గ ఆలయంలో కరెంటు కోత, ద్రాక్షారామం ఘటనల వరకూ ప్రతీ చోటా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్ లో వేణుగోపాలకృష్ణ ఇంకేమన్నారంటే..

భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆటలు

     ఈ ప్రభుత్వం ఏర్పడి 19వ మాసం గడుస్తోంది. తప్పులు చేసేది వాళ్లే, తప్పించుకోవడానికి ప్రతిపక్షాలపై నెట్టడమే ఓ ఆచారంగా కొత్త రాజకీయాలు మొదలుపెట్టారు. కూటమి ఆలోచనా విధానం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. సామాన్యుడికే కాదు ముక్కంటికే రక్షణ కరవైంది. తిరుమల క్షేత్రం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కాశీబుగ్గ క్షేత్రం, వైకుంఠ ఏకాదళిలో తిరుమలలో తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురు, సింహాచలం ప్రహరీ కూలిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఇంత మంది ప్రాణాల్ని బలిగొన్న చరిత్ర చంద్రబాబుది. రాజకీయ లబ్ది కోసం, పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని భయంకరమైన ఆరోపణలు చేసారు. తిరుమలలో నెయ్యి సరఫరాలో టెస్టు పాస్ కాని ట్యాంకర్లను వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో 18సార్లు తిప్పి పంపాం. ఈవో శ్యామలరావు నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపామని జూలైలో చెప్పారు. మళ్లీ ఆగస్టులో అవే ట్యాంకర్లు తిరిగి వచ్చింది నిజం కాదా ?, వాటినే లడ్డూ ప్రసాదానికి వాడారని సిట్ రిపోర్టు ఇచ్చింది. ఆ సమయంలో సీఎం, ఈవో, ఛైర్మన్ ఎవరో చెప్పండి. పరకామణి చోరీ విషయంలో నిందితుడు దొరికాడు, తన నేరాన్ని అంగీకరించి తన ఆస్తుల్లో 90 శాతం శ్రీవారికి రాసిచ్చాడు. దాన్నీ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తే.. నిందితుడు రవికుమార్ తన ప్రాయశ్చిత్తం వెలిబుచ్చినా మీ పత్రికలకు పట్టలేదు. తాజాగా కనకదుర్గ ఆలయంలో విద్యుత్ నిలిపేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. మీ ప్రభుత్వంలో రెండు శాఖలు చేసిన తప్పిదం ఇది. 

ద్రాక్షారామం ఘటనలో తీవ్ర అపచారం

     8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ద్రాక్షారామం ఆలయంలో నిన్న కపాలేశ్వర శివలింగం ధ్వంసం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరుపై సమగ్ర విచారణ చేయలేదు, అదే సమయంలో శివలింగానికి జరిగిన అపచారం తర్వాత, శృంగేరీ పీఠాధిపతుల సలహా తీసుకోకుండా, మూఢాన్ని కూడా లెక్కచేయకుండా సాయంత్ర సమయంలో విగ్రహాన్ని హడావిడిగా ప్రతిష్టించారు. సృష్టికర్త అయిన పరమశివుడికి కూడా ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది. జరిగిన ఘటనను ప్రజలు త్వరగా మర్చిపోయేలా అపచారానికి ఒడిగట్టింది. సంప్రోక్షణ జరగకుండా, శృంగేరీ పీఠాధిపతుల్ని సంప్రదించకుండా అతి ప్రాచీన శివలింగం స్ధానంలో సాధారణ శివలింగం ప్రతిష్టించారు. ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శివలింగం స్ధానంలో సాధారణ శివలింగం ప్రతిష్టించడం ద్వారా సామాన్య భక్తుల మనోభావాల్ని ప్రభుత్వం దెబ్బతీసింది. చంద్రబాబు నాయుడికి దైవభక్తి లేదని ఈ ఘటనలో మరోమారు రుజువైంది. 

చంద్రబాబు గతమంతా అపచారాలే

    అంతర్వేదిలో గతంలో రథం దగ్ధమైతే దానిపై శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సీబీఐ విచారణకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో సీబీఐ విచారణ ఏమైంది ?, ఇప్పుడు ద్రాక్షారామం విగ్రహ ధ్వంసం ఘటనపైనా రాజకీయ కోణం ఉండటం వల్లే ఇలా హడావిడిగా పునఃప్రతిష్ట చేశారని అర్దమవుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వాల్లో లెక్కలేనన్ని ఆలయాల కూల్చివేతలు జరిగాయిఎవరి అభ్యంతరాలూ లెక్కచేయకుండా సత్రాలు విక్రయించిన చరిత్ర ఆయనది. తిరుమల క్షేత్రంలో వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదే. సదావర్తి భూముల్ని కాజేయడానికి ఆయన చేసిన కుట్రల్ని మేమే అడ్డుకున్నాం. తిరుమల దర్శనానికి వెళ్తే ఆయన బూట్లు కూడా తీయరు. హథీరాం మఠం భూముల్ని ప్రైవేటు వాళ్లకు అప్పగించాలని ప్రయత్నించారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో భక్తుల ప్రాణాల్ని బలిగొన్న చరిత్ర కూడా ఆయనదే. అయ్యప్ప భక్తులు మద్యం సేవించక ఆదాయం తగ్గిపోతుందని బాధపడ్డ ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు హయాంలో రికార్డుల్లో నుంచి వందలాది ఎకరాలు మాయమైనట్లు దేవాదాయశాఖ చెప్పింది. విజయవాడ దుర్గగుడి అమ్మవారి కిరీటం దొంగతనం జరిగిందని, నకిలీది చేయించి పెట్టారని ఆరోపణలు రాలేదా ?, మీ హయాంలోనే అహోబిలం నరసింహస్వామి ఆలయ హుండీ చోరీ జరిగి 20-30 లక్షలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఇప్పటికీ ఆయన భక్తుల మనోభావాలతో ఆడుకుంటూనే ఉన్నారు.

Back to Top