18 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

ప్రజల నుంచి పాజిటివ్ అవుట్ పుట్ రావడం లేదన్న సీఎం

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్వయంగా అంగీకరించిన  చంద్రబాబు

2 ఏళ్లు కాక ముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం

పాలనలో ఫెయిలైన కూటమి ప్రభుత్వం

తేల్చి చెప్పిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్

విశాఖపట్నం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా 
అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.

ఏ రోజు కా రోజు అప్పు - లేదంటే కొడుకు గురించి డప్పు

18 నెలలుగా ఇదే చంద్రబాబు దినచర్య 

రోజుకి సగటున రూ.500 కోట్లు చొప్పున రూ.2.75 లక్షల కోట్లు అప్పు

ప్రభుత్వాలు అప్పు చేస్తే ఆస్తి రూపంలో ఉండాలి

కాదంటే ప్రజల సంక్షేమంలో కనిపించాలి

బాబు పాలనలో అభివృద్ధి - ప్రజా సంక్షేమం రెండూ శూన్యం

50 శాతం ప్రజల అసంతృప్తే దీనికి నిదర్శనం

స్పష్టం చేసిన గుడివాడ అమర్నాధ్

ప్రముఖ కంపెనీల పేరుతో విశాఖలో భూదోపిడీ

టీసీఎస్, కాగ్నిజెంట్ లకు 99 పైసలకే ఎకరా కేటాయింపు

ఉద్యోగాలిచ్చే కంపెనీలకు భూములివ్వడంలో తప్పులేదు

అదే ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకూ భూసంతర్పణ

విశాఖలో హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30 నుంచి రూ.50 కోట్లు ఖరీదు

చౌకగా ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటికే కేటాయింపు 

ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

కంచే చేను మేస్తే కాపాడేదెవరు?

మీ దోపిడీపై ప్రజల తిరుగుబాటు ఖాయం

మిమ్నిల్ని చట్టం ముందు నిలబెట్టే రోజు తప్పకుండా వస్తుంది

అవినీతి పాలనపై అమర్నాధ్ ఫైర్ 

విశాఖపట్నం: కేవలం 18 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో తమ పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ అవుట్ పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన తేల్చి చెప్పారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు  కాక ముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన దేశంలో తొలి ప్రభుత్వం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఏ రోజు కా రోజు అప్పు- లేదంటే కొడుకు గురించి డప్పు కొట్టడమే 18 నెలలుగా  చంద్రబాబు దినచర్యగా మారిందని ఆక్షేపించారు. రోజుకి సగటున రూ.500 కోట్లు చొప్పున ఇప్పటి వరకు చేసిన రూ.2.75 లక్షల కోట్లు అప్పు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాలు అప్పు చేస్తే ఆస్తి రూపంలో ఉండాలని, కాదంటే ప్రజల సంక్షేమంలో కనిపించాలన్న అమర్నాధ్... చంద్రబాబు పాలనలో అభివృద్ధి- ప్రజా సంక్షేమం రెండూ శూన్యమని స్పష్టీకరించారు. 50 శాతం ప్రజల అసంతృప్తే దీనికి నిదర్శనమన్నారు. మరోవైపు  ప్రముఖ కంపెనీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో భూదోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి ఉద్యోగాలిచ్చే కంపెనీలకు 99 పైసలకే ఎకరా కేటాయించడం తప్పుకాదన్న అమర్నాధ్... అదే ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకూ భూసంతర్పణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విశాఖలో హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30 నుంచి రూ.50 కోట్లు ఖరీదు చేసే భూమిని అత్యంత కారు చౌకగా  ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటికే కట్టబెట్టడమంటే... దోపిడీ కాక మరేంటని నిలదీశారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కంచే చేను మేస్తే కాపాడేది ఎవరని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ దోపిడీపై ప్రజల తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

● ఏం చేశారని ప్రజలు మెచ్చుకుంటారు బాబూ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కేటాయించి భూములు, చేస్తున్న పనులలో అవినీతి చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో కొన్ని వాస్తవాలు మాట్లాడారు. గడిచిన 18 నెలలుగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ... ప్రజల నుంచి మనమీద పాజిటివ్ అవుట్ పుట్ రావడం లేదు, మనం చేసిన పనులకి ప్రజలెవరూ మెచ్చుకోవడం లేదని ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో పాటు రాష్ట్ర ప్రజలనుద్దేశించి చెప్పారు.
సాధారణంగా మనం ప్రజలకు మేలు చేసినప్పుడు, వారికిచ్చిన హామీలు నిలబెట్టుకున్నప్పుడే వారి నుంచి పాజిటివ్ అవుట్ పుట్ వస్తుంది. ఈ 18 నెలల్లో మీరు ప్రజలకు చేసిన మంచి ఏమిటి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలైనా నిలబెట్టుకున్నారా? చెప్పిన పనులేవైనా చేశారా? కనీసం ఇవి చేసి ఉంటే ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వచ్చి ఉండేది. మీ పాలనా వైఫల్యాలు, మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై అనేక వేదికలపై మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పలు దఫాలుగా మాట్లాడారు. మా పార్టీ నేతలు సైతం అనేక సందర్భాల్లో చెప్పాం. 
ఇక విశాఖపట్నంలో మీ ప్రభుత్వం చేస్తున్న భూసంతర్పణ గురించి సైతం చాలాసార్లు మాట్లాడాం. ప్రధానంగా కొన్ని ప్రముఖ కంపెనీల పేరు చెప్పి.. వాటి మాటున జరుగుతున్న భూకేటాయింపులు పెద్ద స్కామ్ అని నాలుగైదు మాసాలుగా చెబుతూనే ఉన్నాం.ఈ ఏడాది మార్చి, ఏఫ్రిల్ నుంచి ప్రభుత్వం కేటాయిస్తున్న భూములను చూసినా.. గతేడాది డిసెంబరులో తీసుకొచ్చిన పాలసీలో లూప్ హోల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమి అంతా వారి సొంత జాగీరులా తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 

● రియల్ ఎస్టేట్ సంస్ధలకు కారుచౌకగా భూపందేరం...

2022లో వైయస్.జగన్ టీసీఎస్ చైర్మన్ తో మాట్లాడి... విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు కృషి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ కంపెనీతో పాటు ఈ రెండు కంపెనీలకు 99 పైసలకే ఎకరా చొప్పున భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. పెద్ద కంపెనీలు కాబట్టి వాటిని ప్రోత్సహించడానికి ఆ మేరకు ఇవ్వడంలో తప్పులేదు. కానీ వీటి పేరిట ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు భూములు కారుచౌకగా కట్టబెడుతున్నారు? పక్కరాష్ట్రంలో ఇవే కంపెనీలు వేలంలో భూములు కొంటుంటే... దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇదే విధానం ఫాలో అవుతున్న సంస్థలకు ఏపీలో అదీ విశాఖపట్నానికి వచ్చేసరికి.. ఈ సంస్థలకు, ప్రభుత్వానికి ఉన్న తెరవెనుక ఒప్పందాలు ఏంటి? సత్వా సంస్థ పక్కరాష్ట్రంలో 20 ఎకరాలు కావాలనుకుంటే... ఎకరా రు.30 నుంచి రూ.50 కోట్ల వరకు కొనుగోలు చేసిన చరిత్ర ఉంది. అక్కడ ప్రైవేటుగానో, ప్రభుత్వం దగ్గర వేలంలోనే కోట్లాది రూపాయులు పెట్టి భూములు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థలకు విశాఖపట్నానికి వచ్చేసరికి ఎందుకు ఎకరా రూ.50 లక్షలకూ, రూ.1 కోటికో ఇస్తున్నారు.

హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30-50 కోట్ల ఖరీదు చేసే 30 ఎకరాల భూమిని ఎకరా కేవలం రూ.50 లక్షలకూ రూ.1 కోటికో ఇవ్వడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి? ఇదే ప్రశ్న మేమడిగింది కాదు, న్యాయమూర్తులు సైతం ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములిచ్చేటప్పుడు.. ఏ పద్దతి అనుసరించారు?.  ఎలా అలాట్ మెంట్ చేశారు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేదు. 
రియల్ ఎస్టేట్ సంస్ధలు ఉద్యోగాలిచ్చే పరిస్తితి లేదు. కావాల్సిన భూమిని తీసుకుని బిల్డింగులు కట్టుకుని.. సంస్ధలకు అద్దెకు ఇచ్చుకునే పరిస్ధితి వీళ్లది. వీళ్లకి తక్కువ ధరకే భూములు కేటాయించడంతో పాటు వీళ్ల చేపట్టే నిర్మాణాలకు అయ్యే ఖర్చుల్లో చదరవు అడుగుకి రూ.2వేలు ప్రభుత్వం చెల్లించడం ఇంకా ఆశ్చర్యకరం. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్ధకు ప్రభుత్వం కారుచౌకగా భూములిచ్చి... మరలా నిర్మాణ ఖర్చులు కూడా తిరిగి చెల్లించడంతో పాటు.. ఆయా సంస్ధలకు కేటాయించిన భూముల్లో రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికీ అనుమతినిచ్చారు. అంటే ఆపార్ట్ మెంటులు, విల్లాలు నిర్మించుకుని వారికి నచ్చిన ధరలకు అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండానే వారికి నచ్చినట్లు అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారు. ఉద్యోగాల కల్పన గురించి వీరికి ఎలాంటి నిబంధనలు కూడా వీరికి నియిమించలేదు. అంటే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్ధల పేరు చెప్పి.. మీకు కావాల్సిన బ్యాక్ డోర్ అగ్రిమెంట్ల కోసం.. కపిల్, సత్వా  ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్ధలకు భూములు కేటాయించి ఈ రకమైన మినహాయింపులిచ్చారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈ తరహా మినహాయింపులు ఎందుకు ఇచ్చినట్లు? ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోయి ఎందుకు వారికి మినహాయింపులు ఇస్తున్నట్టు? దీనిపై మాత్రం సీఎం చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ స్పందించరు.

● అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత...

అధికారంలోకి వచ్చి తొలి రెండేళ్లలో సహజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండదు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలల్లోనే మా ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, ప్రజలు మమ్నల్ని మెచ్చుకోవడం లేదని నేరుగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో మూడు దఫాలుగా చంద్రబాబు సీఎంగా చేసినా.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆయన చెప్పిన సందర్భాలు కూడా లేవు. కానీ ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలు మీద మీ ప్రభుత్వం మీద ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో అర్ధం అవుతుంది.  అయితే ఏ రోజు కారోజు అప్పు, లేదంటే తన కొడుకు గురించి డబ్బు... ఇదే 18 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం దినచర్యగా మారింది. 

● చేసిన అప్పు ఏమైంది?

రోజుకి సగటున రూ.500 కోట్లు చెప్పున గడిచిన 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వాలు అప్పు చేస్తే ఆ డబ్బు ఆస్తుల రూపంలోనైనా ఉండాలి.. లేదా సంక్షేమం, అభివృద్ధి రూపంలో ప్రజలదగ్గరైనా ఉండాలి. ఈ రెండూ కాకుండా కూటమి ప్రభుత్వం చేసిన అప్పు ఏమైంది? 50 శాతం మంది ప్రజలు ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారని వారికి సంబంధించిన పత్రికల్లోనే వచ్చింది. ప్రజలు ఎందుకు సంతృప్తిగా ఉంటారు?  చెప్పిన ఏ హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మేం చేసిన కార్యక్రమాలతో పాటు మీరు చేస్తామని ఇచ్చిన హామీలు వేటినీ అమలు చేసిన పరిస్థితి లేదు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2022లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించాం. కోర్టు ఆదేశాలతో ఆ రోజు ఆగింది. అది క్లియర్ కావడంతో ఇవాళ కానిస్టేబుళ్ల ఆర్డర్లు ఇచ్చి.. అది వీళ్ల గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే విధంగా మా ప్రభుత్వ హయాంలో డియస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాం. మీరు కేవలం ప్రచారం, మార్కెటింగ్ తప్ప మరేం లేదు. 
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో ఉద్యమం చేసి.. వాటన్నింటినీ గవర్నర్ గారికి సమర్పించాం. 

● పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు - ఇదీ మా అభివృద్ది...

ఈ 18 నెలల్లో మేం ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాం.. దాని వల్ల రాష్ట్ర ప్రజలకు ఈ మేలు జరిగిందని చెప్పగలరా? 
మా హయాంలో  పోర్టులు నిర్మాణం, ఎయిర్ పోర్టు నిర్మాణం, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, పిషింగ్ హార్బర్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, కంపెనీల ఏర్పాటు, భారీ ఎత్తున ఎనర్జీ, టూరిజం శాఖల్లో పెట్టుబడులు వైయస్.జగన్ నేతృత్వంలోనే చేశాం. నాడు నేడు కింద ఆసుపత్రులు, స్కూల్లు బాగు చేశాం. విద్యావ్యవస్ధలో సమూల మార్పులు చేశాం. ఐదేళ్ల కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇన్ని సంస్కరణలు చేయవచ్చని, ప్రజలకు ఇంత మేలు చేయవచ్చని నిరూపించిన ఘనత వైయస్.జగన్ దే.
మేం ప్రజలకు మంచి చేసినా ఓడిపోయాం. కానీ చంద్రబాబు అబద్దాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు. కానీ ఇచ్చిన హామీలను వేటినీ నిలబెట్టుకోలేని దుస్ధితిలో ఉన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా అందరికీ కనిపిస్తున్నాయి. 

● మీ ప్రతినిధుల దోపిడీపై ప్రజలు నిలదీయడం ఖాయం...

మీ ఉపముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. మన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ లో జోక్యం చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ముఖ్యంగా విశాఖలో ఈ తరహా సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఉపముఖ్యమంత్రి తన పక్కనున్న ముఖ్యమంత్రిగా నేరుగా ప్రశ్నించాలి. విశాఖలో ఎందుకు ఇలా కారుచౌకగా భూములు దోచిపెడుతున్నారో ప్రశ్నించాలి. ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్న నష్టం ఒకవైపు అయితే.. ప్రైవేటు ల్యాండ్ సెటిల్మెంట్స్ లో మంత్రుల నుంచి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దారుణంగా జోక్యం చేసుకుంటున్నారు. మిమ్నల్ని గెలిపించింది ప్రజల ఆస్తుల కాపాడి, వారికి సేవ చేయడానికా? వారి ఆస్తులు కాజేయడానికా?
కాబట్టి మీరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కాదు చెప్పాల్సింది.. ప్రజలే మిమ్నల్ని కూర్చోబెట్టి  చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు ఐదేళ్ల అధికారం ఇచ్చారు.  మరలా మూడేళ్లలో సాధారణ ఎన్నికలు వస్తాయి. మీరు ప్రజలకు మంచి చేయకపోయినా, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా కనీసం ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకోవాలన్న ఆలోచన కూడా మీకు లేదు. 
విశాఖలో ఉన్న భూములన్నీ మీకు కావాల్సిన వారికి దోచిపెట్టి... ఇక్కడ ఏ రకమైన యాక్టివిటీ లేకుండా అడ్డుకుని, అమరావతిని ఏదో ఒక రకంగా ప్రొజెక్టు చేసుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం. అమరావతిని సొంత టెరిటరీ కింద చేసుకుని దానికే ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోతుందేమో. నాకు ఇది ఇచ్చేస్తే చాలు.. మిగిలిన ప్రాంతాలేమైనా ఫర్వాలేదు అన్న ఆలోచనతోనే ఉన్నారు. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అక్కడ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు. వీటన్నింటి మీదా ప్రజల దగ్గర చర్చ జరుగుతుంది. మీరు  తీసుకున్న నిర్ణయాలు, మీరు దోచిపెడుతున్న భూముల గురించి, అందులో మీరు దోచుకున్న పరిస్థితులు అన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. మీ కేటాయింపుల మీద ఆత్మపరిశీలన చేసుకొండి. ప్రజలను, ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వం మీద ఉంది. అలాంటి ప్రభుత్వమే కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తుంటే.. ప్రజల్లో తిరుగుబాటు ఖాయమని తేల్చి చెప్పారు.  ఆ పరిస్థితి వచ్చిన రోజు చట్టం ముందు, చట్టం తీసుకునే నిర్ణయాల ముందు మిమ్నల్ని దోషులుగా నిలబెట్టే రోజు వస్తుందని ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని  అమర్నాధ్ హెచ్చరించారు. 

Back to Top