బెంగళూరు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు(డిసెంబర్ 21) సందర్భంగా బెంగళూరులో ఘనమైన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ – బెంగళూరు ఆధ్వర్యంలో IT WING SEASON–3 పేరుతో క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఉదయం బెంగళూరు నగరంలోని చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ వద్ద ఘనంగా ప్రారంభించారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌కు పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వైయస్ఆర్‌సీపీ ప్రస్తుతం అధికారంలో లేకున్నా, జననేత వైయస్ జగన్‌పై ఉన్న అపారమైన అభిమానంతో వందలాది మంది ఐటీ వింగ్ సభ్యులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరిపారు. “ This Time the Game Will be Different, Let’s Win 2029” అనే శక్తివంతమైన నినాదంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, క్రీడల ద్వారా ఐక్యత, స్ఫూర్తి, పోరాట తత్వాన్ని చాటడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో పలు జట్లు పాల్గొంటుండగా, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌ల మధ్యలో వైయస్ జగన్ పాటలతో లైవ్ కవరేజ్ నిర్వహిస్తూ ఆటగాళ్లను, జట్లను ఉత్సాహపరిచారు. దీంతో గ్రౌండ్‌లో ప్రత్యేకమైన పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతలో రాజకీయ చైతన్యం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని ఐటీ వింగ్ నేతలు తెలిపారు. బెంగళూరు వైయస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ సభ్యుల సమిష్టి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత క్రమబద్ధంగా, ఘనంగా నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. వైయస్ జగన్ గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీల ద్వారా ప్రజలతో కలిసి జరుపుకోవడం తమకు గర్వకారణమని పాల్గొన్న ఐటీ వింగ్ సభ్యులు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణకు కొత్త ఉత్సాహం, దిశానిర్దేశం ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.