చంద్రబాబుపై నిప్పులు.. ప్రభుత్వంపై పిడుగులు



అనంతపురం:

జ్వరం బాధిస్తోంది. అయినా లెక్క చేయలేదు.. ప్రజాభిమానం అనారోగ్యాన్ని పక్కకు పెట్టేలా చేసింది. జనాదరణ నానాటికీ రెట్టింపు అవుతుండటంతో వైయస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్  జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విశ్రాంతి తీసుకోకుండా కొనసాగిస్తున్నారు. తీవ్ర జ్వరం బాధిస్తున్నా శనివారం 8.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ధర్మవరం మండలం గొల్లపల్లి శివారులో బసచేసిన షర్మిలకు శుక్రవారం రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు మందులు వేసుకున్నారు. శనివారం ఉదయానికి కూడా జ్వరం తగ్గలేదు. షర్మిలను పరీక్షించిన అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దానికి ఆమె తిరస్కరించారు.   తన కోసం వేలాది మంది ప్రజలు వేచి చూస్తున్నారనీ.. వారిని కలుసుకోవడం కోసం పాదయాత్ర కొనసాగిస్తాననీ తేల్చి చెప్పారు. ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ప్రారంభమైంది. భారీ ఎత్తున తరలి వచ్చిన జనం అడుగులో అడుగేస్తూ కదం తొక్కారు. పాదయాత్ర సాగే మార్గంలో రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, మహిళలను  షర్మిల ఆప్యాయంగా పలకరిస్తూ.. దగ్గరికి తీసుకునా్నరు. వారి సమస్యలను ఆరా తీస్తూ..  భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. పాదయాత్ర బడన్నపల్లి క్రాస్‌కు చేరుకునే సరికి అప్పటికే ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది.
బడన్నపల్లి క్రాస్‌లో రచ్చబండ
బడన్నపల్లి క్రాస్‌లో సాలార్‌బాష నేతృత్వంలో ముస్లింలు బక్రీద్ పండుగ సందర్భంగా షర్మిలను కలుసుకున్నారు. వారికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జగన్‌కు మంచి జరగాలని.. పాదయాత్ర విజయవంతం కావాలని.. ప్రజలకు కష్టాలు తొలగిపోవాలని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడే షర్మిల మహిళలతో రచ్చబండ నిర్వహించారు.
‘అక్కా.. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు జయప్రద అనే బీటెక్ విద్యార్థిని స్పందిస్తూ.. ‘అక్కా.. మా నాన్న పొలానికి రాత్రి ఒంటి గంటకు వెళతారు. మళ్లీ ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. కారణం ఏమిటంటే.. సేద్యానికి కరెంట్ రాత్రి పూట ఇస్తారు. రాత్రి పూట మా నాన్నకు ఏం జరుగుతుందోనని భయంతో రోజూ ఆందోళన చెందుతున్నాం. ప్రతి రైతుదీ ఇదే సమస్య. మా నాన్న ఫీజు కట్టడానికి కష్టపడుతున్నారు. పంటలు పండక అప్పులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెడుతోంది. మాలాంటి వారు ఎలా చదవుకోవాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్ హయాంలో సేద్యానికి కచ్చితంగా ఏడు గంటలు విద్యుత్తు ఇచ్చేవారు. ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం కోతలు పెట్టడమే పనిగా పెట్టుకుంది. రాజు మంచోడైతే దేవుడి దీవెనలు కూడా ఉంటాయి’ అంటూ వివరించారు. ఆ తర్వాత రాణి అనే మహిళ మాట్లాడుతూ ‘అక్కా.. మా గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు’ అంటూ చెప్పింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైయస్ పీఏబీఆర్‌కు పది టీఎంసీలు నీటిని కేటాయించి దాహార్తిని తీరిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసి తాగునీటి కష్టాలను పెంచుతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చిగిచెర్లలో జనసంద్రం
మధ్యాహ్నం గరుడంపల్లి సమీపంలో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్న షర్మిల సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. వసంతాపురం క్రాస్ మీదుగా చిగిచెర్లకు చేరుకున్నారు. షర్మిల చేరుకునే సరికి చిగిచెర్ల జనసంద్రంగా మారింది. అక్కడ ప్రజల సమస్యలపై షర్మిల ఆరా తీశారు. ‘అక్కా.. వైయస్ ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడేవి. మంచి పంటలు పండేవి. కానీ.. ఇప్పుడు వర్షాలు పడటం లేదు. పంటలు పండటం లేదు. తాగునీటి కోసం ఆడవాళ్లు జుట్లుజుట్లు పట్టుకునే దుస్థితి దాపురించింది’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘రాజు మంచోడైతే దేవుడి దీవెనలు కూడా ఉంటాయి. వైయస్ మంచోడు కాబట్టే ప్రజలకు అంతా మంచే జరిగింది.
కానీ.. ఈ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచుతూ ప్రజలను బాధిస్తోంది. దేవుడు కూడా వర్షాలు కురిపించడం లేదు. కొద్ది రోజులు ఓపికపట్టండి. మన రాజన్న రాజ్యం వస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు. ‘అక్కా గ్యాస్ ధరలు పెంచేశారు. ఇప్పుడు ఏడాదికి ఆరు సిలిండర్లే ఇస్తారట. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఓ మహిళ మొరపెట్టుకుంది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘చంద్రబాబు సీఎం అయ్యే నాటికి సిలిండర్ ధర రూ.145 ఉండేది. ఆయన దిగిపోయే నాటికి రూ.305కు పెంచారు. ఆ తర్వాత వైఎస్ ఐదేళ్ల హయాంలో సిలిండర్‌పై ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై రూ.50 పెంచితే దాన్ని వైయస్ భరించారు.
పేదలపై మోపలేదు. కానీ.. ఈ ప్రభుత్వం సిలిండర్ ధరను సగటున రూ.850కు పెంచేసింది. ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో పాపాలు చేశారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. ప్రజలపై ఎడాపెడా పన్నులు విధించి.. పీల్చిపిప్పిచేశారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ ఎల్లోడ్రామా ఆడుతున్నారు. పాదయాత్రలో చంద్రబాబు శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లో ప్రజల కాళ్లు చేతులు పట్టుకుని క్షమాపణ అడిగినా ఆయన చేసిన పాపం పోదు’ అంటూ నిప్పులు చెరిగారు. షర్మిల ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. చిగిచెర్ల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్ద రాత్రి 7.45 గంటల సమయంలో పాదయాత్రను ముగించి, అక్కడే బస చేశారు.

Back to Top