విలువలు, సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలు


ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టిన చంద్రబాబు
ఇన్నాళ్లూ దూషించిన హస్తం అగ్రనేతలతోనే ఇప్పుడు బాబు దోస్తీ

 అమరావతి: కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెడుతుండడంపై సర్వత్రా ప్రజలు విస్తుపోతున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారతారని.. విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలిస్తారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తిలు బహిరంగంగానే తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తో కలిస్తే ప్రజలు బట్టలూడదీసి పరిగెత్తిస్తారని అయ్యన్నపాత్రుడు తీవ్రంగానే స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఎన్టీరామారావు తెలుగుదేశాన్ని స్థాపించి దేశంలోని అన్ని రాజకీయపార్టీలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటాన్ని సాగించారని, ఇప్పుడు చంద్రబాబునాయుడు అదే కాంగ్రెస్‌ పార్టీకి గులాంగిరీ చేయడానికి సిద్ధపడుతూ తెలుగుజాతి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు.

జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ సీనియర్‌ నేతలు
చంద్రబాబు.. రాహుల్‌ని ఆయన నివాసంలో కలవడాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశాన్ని ఇప్పుడు ఆ పార్టీకే తాకట్టుపెట్టేలా చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు రాష్ట్ర ప్రజల్లో పార్టీని తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని  పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి మద్దతుగా చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను తప్పుబడుతున్నారు. మరోపక్క చంద్రబాబుతో కలసి వెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సైతం విముఖంగా ఉన్నారు.


నిన్నమొన్నటివరకు తమ పార్టీని, సోనియా, రాహుల్‌ని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబుతో ఎలా కలసి నడుస్తామని వారు నిలదీస్తున్నారు. చంద్రబాబువి తొలినుంచి అవకాశవాద రాజకీయాలేనని, ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ ప్రజలను ఏమార్చేందుకు ఆయన తొక్కని అడ్డదారి లేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 1995లో ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన చంద్రబాబు నీతి, నియమాలకు తిలోదకాలిచ్చేశారని గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి ప్రకటనలు చేశారో పరిశీలిస్తే విలువలు లేని ఆయన రాజకీయాలు తేటతెల్లం అవుతాయి.
♦  1983లో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా ఉంటూ తన మామ ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన మీదే  పోటీ చేస్తానని ప్రకటించారు.
n1984 ఎన్నికల్లో బాబు ఓటమిపాలై కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలోకి జంప్‌ చేసేందుకు వీలుగా 1985లో ఎన్టీరామారావును దేవుడని కీర్తించారు.
♦ 1995లో ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని, అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని నిందించారు.
♦ 1996లో కాంగ్రెస్‌ బయట నుంచి మద్దతునిచ్చిన యునైటెడ్‌ ఫ్రంట్‌లో చంద్రబాబునాయుడు చేరారు.
♦ 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులు పెట్టుకొని పోటీచేశారు. అప్పటివరకు అంటకాగిన కాంగ్రెస్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలే చేశారు.
♦ 2004లో కూడా బీజేపీతో కలసి పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమికి బీజేపీయే కారణమని, అది మతతత్వ పార్టీ అని, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని ప్రకటించారు.
♦ 2009లో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీలతో కలసి మహాకూటమిని ఏర్పాటు చేసి పోటీలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు.
♦ 2014లో చంద్రబాబు మళ్లీ మాటమార్చేశారు. మతతత్వ పార్టీ అని, ఎన్నడూ పొత్తులు పెట్టుకోబోమని నిందించిన బీజేపీతో చేతులు కలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మద్దతు కూడా తీసుకుని  గెలుపొందారు.
♦ 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో నాడు సీఎంగా ఉన్న నరేంద్రమోదీ హైదరాబాద్‌ వస్తే అరెస్టు చేస్తానని ప్రకటించిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో అదే నరేంద్రమోదీ దేశానికి దిక్సూచి లాంటివారని కీర్తించారు.

దూషించిన పార్టీతోనే ఇప్పుడు జట్టు..
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలకు తాకట్టు పెట్టి తాజాగా ఆ పార్టీతో పొత్తులకు తహతహలాడుతున్న చంద్రబాబు గతంలో సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఎలా దూషించారో కాంగ్రెస్‌ నేతలు, రాష్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

సోనియాను ఏకంగా ఇటలీ దెయ్యంగా చంద్రబాబు అభివర్ణించారు. సోనియా, రాహుల్‌గాంధీలు అవినీతిపరులని, సోనియాను దేశం నుంచి తరిమేయాలని కూడా చంద్రబాబు ప్రకటనలు చేశారు.  కాంగ్రెస్‌ వల్లే దేశం సర్వనాశనం అయిందని, ఆ పార్టీని భూ స్థాపితం చేస్తానని భీషణ ప్రతిజ్ఞలూ చేశారు. ‘రాహుల్‌ ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తారు’ అని చంద్రబాబు ఇటీవల సైతం విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇప్పుడు అదే హస్తం పార్టీతో చంద్రబాబు కరచాలనానికి సిద్ధపడుతున్నారు.

చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీని, సోనియా, రాహుల్‌ గాంధీలను ఎలా దూషించారో ఒకసారి పరిశీలిస్తే...
15–2–2014
తెలుగు జాతిని చంపుతున్న సోనియా ‘గాడ్సే’. ఇటలీ మాఫియాను తెచ్చారు.. ఆమెకు మన సంస్కృతి తెలియదు. – పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ‘ప్రజా గర్జన’లో చంద్రబాబు విమర్శలు

05–03–2014
సోనియాను దేశంనుంచి తరిమేయాలి
సోనియాగాంధీ తెలుగుజాతిపై కక్షకట్టారు. కుమారుడిని ప్రధానిగా చేసేందుకు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఆమెను దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. క్విట్‌ సోనియా. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలి. రాహుల్‌గాంధీ జీవితంలో ఏనాడూ ప్రధాని కాలేడు. – విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బహిరంగ సభల్లో చంద్రబాబు వ్యాఖ్యలు

29–12–2013
సోనియా అవినీతి అనకొండ – తిరుపతి ‘ప్రజా గర్జన’లో చంద్రబాబు విమర్శలు

29–12–2013
కుంభకోణాలకు కర్త కర్మ క్రియ సోనియా, రాహుల్‌లే
యూపీఏ  హయాంలో జరిగిన కుంభకోణాలకు కర్త కర్మ క్రియ అన్నీ సోనియా, రాహులే. రాహుల్‌గాంధీకి తన ఇంట్లో అవినీతి కనిపించడం లేదా? బావ వాద్రా ఒక చిన్న వ్యాపారంతో ప్రారంభించి రూ.15 వేల కోట్లు ఎలా సంపాదించారు? కుంభకోణాలమయంగా తయారైన యూపీఏ ప్రభుత్వం ప్రతిపక్షనేతలను ఇబ్బంది పెట్టేందుకు విచారణలు చేయిస్తోంది.   – హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో చంద్రబాబు.

28–11–2013
వంశపారంపర్య నియంత సోనియా
వంశపారంపర్య నియంతృత్వంతో సోనియాగాంధీ వ్యవహరిస్తున్నారు. పార్టీని, దేశాన్ని సొంత జాగీరుగా భావిస్తూ సంప్రదాయాలు, రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. – విజయవాడలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు.

09–11–2013
తెలుగుజాతి విధ్వంసానికి కాంగ్రెస్‌ కంకణం
రాష్ట్ర విభజన అత్యంత జుగుప్సాకరంగా ఉంది. హేతుబద్ధంగా లేదు. తెలుగుజాతి విధ్వంసానికి కాంగ్రెస్‌ కంకణం కట్టుకుంది. –ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్లో మేథోమధన సదస్సులో చంద్రబాబు

07–12–2013
సోనియాకు ఇటలీ న్యాయమే తెలుసు
ఎక్కడో ఇటలీనుంచి వచ్చిన సోనియాగాంధీ ఇక్కడ పెత్తనం చేస్తుంటే ఇక్కడే పుట్టిన ప్రజలకు మాత్రం అవమానాలా? కనీస న్యాయం కూడా చేయరా? ఇదేం దారుణం. ఆమెకు ఇటలీ న్యాయమే తెలుసు. తెలుగుజాతి కోరుకుంటోంది భారతీయ న్యాయం. విభజన విషయంలో ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలుగుజాతిని అవమానించింది. – హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో చంద్రబాబు.

07–09–2013
సోనియాకు శంకరగిరి మాన్యాలే
కాంగ్రెస్‌ రాజకీయ స్వార్ధానికి తెలుగుజాతి బలిపశువుగా మారుతోంది. సోనియాకు శంకరగిరి మాన్యాలు తప్పవు. – గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు.

04–10–2013
నెంబర్‌వన్‌ విలన్‌ సోనియానే
ప్రజలకోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో నెంబర్‌ 1 విలన్‌ సోనియానే.   – తన నివాసంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు.

16–07–2011
రాహుల్‌ రాజకీయ అజ్ఞాని
కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ రాజకీయ అజ్ఞాని. ఉగ్రవాదుల దాడులు సర్వసాధారణమేనని, వీటిని ఆపలేమని రాహుల్‌గాంధీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. – పొలిట్‌బ్యూరోలో చంద్రబాబు తీర్మానం.

05–03–2011
సోనియాకు డబ్బు పిచ్చి
సోనియాకు డబ్బు పిచ్చి పట్టింది. విదేశీ బ్యాంకుల్లో దాచుకొనేందుకు తాపత్రయపడుతోంది. దీన్ని నిరోధించే శక్తి మన్మోహన్‌కు లేదు. ఆయన సోనియా చేతిలో రబ్బర్‌స్టాంపు. – వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో రోడ్‌షోలో చంద్రబాబు

03–07–2011
డబ్బు సంచులు లెక్కపెట్టనిదే సోనియాకు నిద్రపట్టదు
దేశాన్ని అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్‌ను త్వరలోనే ప్రజలు కనుమరుగు చేస్తారు. సోనియాగాంధీకి ప్రతిరోజు సాయంత్రం టన్నులకొద్దీ డబ్బు సంచులు లెక్కపెట్టనిదే నిద్రపట్టదు.     – అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు

25–11–2010
కాంగ్రెస్‌ది విష సంస్కృతి
కాంగ్రెస్‌ది విష సంస్కృతి. సోనియాగాంధీకి పార్టీ నిధులు సమకూరిస్తే చాలు. ఎంతటి అవినీతి, ఘోరాలనైనా ప్రోత్సహిస్తారు. –కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలు.

25–11–2010
రాహుల్‌ వెళ్లిన చోటల్లా కాంగ్రెస్‌ భూస్థాపితం
సీఎంలను తరచూ మార్చే సంస్కృతి కాంగ్రెస్‌దే. అక్రమాల్లో ఆ పార్టీకి సాటి లేదు. రాహుల్‌ గాంధీ అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ భూస్థాపితమవుతోంది. బిహార్‌ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. – కర్నూలు జిల్లా బేతంచర్ల రోడ్‌షోలలో చంద్రబాబు

27–11–2010
రూ.4.50 లక్షల కోట్లను దేశం దాటించారు
కాంగ్రెస్‌ పార్టీ కుంభకోణాల మయంగా మారిపోయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇన్ని జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ దేశానికి పెద్దశాపంగా మారింది. అవినీతి సొమ్ము రూ.4.50 లక్షల కోట్లను గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని దాటించేశారు. – అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు

13–12–2010
సోనియాకు డబ్బుపిచ్చి
’సోనియాకు డబ్బు పిచ్చి పట్టింది. 2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్‌క్రీడలు ఇతర పథకాలతో రూ.లక్షల కోట్లు దోచేశారు. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో రూ.1.76 లక్షల కోట్లు తినేశారు.     – నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో పర్యటనల     సందర్భంగా చంద్రబాబు విమర్శలు.

20–06–2010
సోనియాను నిద్ర పోనివ్వను
తెలంగాణ ఏర్పడి రెండు రాష్ట్రాలైన తరువాత కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొంటాం. సోనియాను నిద్రపోనివ్వం. నాకు జాతీయ రాజకీయాలు కొత్త కాదు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పా. మరింత చురుగ్గా జాతీయరాజకీల్లో పాల్గొని సోనియాకు నిద్రలేకుండా చేస్తా. – హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు  

11–12–2009
రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు
రాష్ట్ర విభజన లాంటి పెద్ద నిర్ణయం తీసుకొనే ముందు ఎవరితోనూ చర్చించకుండా, నచ్చచెప్పకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఒక మ్యాచ్‌ ఫిక్సింగ్‌లా చేసింది. స్వీయ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలా చేశారు. – హైదరాబాద్‌లో అసెంబ్లీ టీడీపీ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top