దోపిడీకి దొంగదారులు..రాష్ట్రానికి పంగనామాలు

  • రాజధాని వ్యవహారం మళ్లీ మొదటికి 
  • ప్రస్తుత నోటిఫికేషన్‌పై సర్కార్ యూటర్న్
  • మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తామని కొత్త డ్రామాకు నాంది 
  • రూ. లక్ష కోట్ల దోపిడీకి మరో ఎత్తుగడ
అమరావతి:  స్విస్‌ చాలెంజ్‌ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్‌ కన్సార్టియం జారీ చేసిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌లపై ముందుకెళ్లబోమని ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు నివేదించింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఏపీఐడీఈ–2001 చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్‌లు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోటీ ప్రతిపాదనలు సవాల్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి వద్ద దాఖలైన రిట్‌ పిటిషన్లు నిరుపయోగమవుతాయని అలాంటప్పుడు ప్రభుత్వం, సీఆర్‌డీఏలు దాఖలు చేసిన రిట్‌ అప్పీళ్లు కూడా నిరుపయోగమేనని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే తాజా నోటిఫికేషన్లపై పిటిషనర్లు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, అప్పుడు పాత రిట్‌ పిటిన్లలో లేవనెత్తిన అంశాలను తిరిగి పేర్కొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశారు.  

తాజా నోటిఫికేషన్‌ డ్రామా...
స్విస్‌ చాలెంజ్‌పై దేశీ కంపెనీల రిట్‌ పిటిషన్లు..., ప్రభుత్వం, సీఆర్‌డీఏల రిట్‌ అప్పీళ్ల నేపథ్యంలో తాజా నోటిఫికేషన్‌పై ముందుకెళ్లబోమని మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు విన్నవించారు. అయితే స్విస్‌ చాలెంజ్‌పై ప్రభుత్వం తీసుకున్న ఈ వెనకడుగు వెనుక మరో కుట్ర దాగి ఉంది. లక్ష కోట్లు దోచుకోవాలని రాజధాని నిర్మాణం ప్రకటించిన నాటి నుంచే పథక రచన చేసిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరని విశ్లేషిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్‌ అనేది ఓ డ్రామా మాత్రమేనని కోర్టులను తప్పుదోవ పట్టించడానికి తప్ప..దోచుకోవడం దానంతట అది జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు. స్విస్‌ చాలెంజ్‌పై కోర్టులో ఓవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనేబ్లింగ్‌ యాక్టు (ఏపీఐడీఈ– 2001)కు సవరణలు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్న ఘనులు మరో కుట్రకు బీజం వేసే ఉంటారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభించింది మొదలు అడుగడుగునా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, ఏపీఐడీఈ –2001 చట్టానికి అనుకూలంగా చేసిన సవరణలు, అవినీతి ఆరోపణలు వారి మాటలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

గతంలోనే సుప్రీంకోర్టు అభ్యంతరం 
మహారాష్ట్రలోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గృహాల నిర్మాణానికి డెవలపర్‌ (కాంట్రాక్టర్‌) ఎంపిక కేసును విచారించిన సుప్రీంకోర్టు మే 11, 2009న కీలక తీర్పును ఇస్తూ స్విస్‌ చాలెంజ్‌ విధానం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఆయా మార్గదర్శకాలను ఒక్కటి కూడా ఏపీ ప్రభుత్వం పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. 

రియల్‌ వ్యాపారం కోసమే భూ సమీకరణ 
సింగపూర్‌ ప్రైవేటు సంస్థలతో కలిసి రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టేందుకు ‘స్విస్‌ చాలెంజ్‌’ పేరుతో చంద్రబాబు సర్కారు భారీ కుంభకోణానికి తెరతీసింది. రాజధాని ఏర్పాటు ప్రకటన అధికారికంగా వెలువడకముందే వంది మాగధులకు లీకులు ఇచ్చి ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు పాల్పడ్డారు.  నిరుపేద రైతుల కడుపుకొట్టి రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్‌ కో... రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహా దోపిడీకి బరితెగించింది. భూసమీకరణ ముసుగులో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ సంస్థల కన్సార్టియంకు ధారాదత్తం చేసి.. రియల్‌ ఎస్టేట్‌ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్‌ ప్లాన్‌’ వేశారు. అందుకోసం స్విస్‌ చాలెంజ్‌ విధానం నిబంధనలనూ అడ్డగోలుగా ఉల్లంఘించి, ‘అధికారిక రహస్యాల ప్రమాణా’న్ని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేశారు. 

స్విస్‌ చాలెంజ్‌ విధానంలో పారదర్శకత వీసమెత్తు కూడా లేదని సుప్రీం కోర్టు స్పష్టీకరించినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ప్రోత్సహించవద్దంటూ కేల్కర్‌ కమిటీ తెగేసి చెప్పినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌లు వారించినా చంద్రబాబు వెనక్కు తగ్గలేదు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్‌ కేపిటల్‌)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును చేపట్టేందుకు స్విస్‌ చాలెంజ్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేశారు. స్విస్‌ చాలెంజ్‌ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలను తేటతెల్లం చేశాయి. చంద్రబాబు అండ్‌ కో, సింగపూర్‌ సంస్థల కన్సార్టియం మధ్య కుదిరిన రహస్య ఒప్పందం గుట్టు రట్టయింది.

 
Back to Top