బాబు మెచ్చిన చింగ్ చాంగ్


పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. నిజమే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పొరుగిల్లే కాదు భారతదేశం తప్ప మిగిలిన అన్నిదేశాల కూరలూ నచ్చుతాయి. ఏ దేశానికెళితే ఆ దేశాన్ని అమరావతికి తెచ్చేస్తానని ప్రజలకు పగటి కలలు చూపించేస్తుంటాడు. గట్టిగా మాట్లాడితే విదేశీ భాషల యూనివర్సిటీలు కూడా అమరావతిలో తెరిపించేస్తానంటాడు. టీసీఎల్ ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమం లో బాబుగారు తన విదేశీ మోజును మరోసారి బయటపెట్టుకున్నారు. స్వదేశీ, స్వరాష్ట్ర అయిష్టతను కూడా అదే రేంజ్ లో బట్టబయలు చేసారు. 
’చైనీయులు 9 నెల్లలో ఇక్కడ కంపెనీ నిర్మాణం పూర్తి చేయమంటే 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. వాళ్లు చాలా ఫాస్టు. అదే భారతీయులను చేయమంటే 9 నెలలా? అంటారు’...అని అక్కసు వెళ్లగక్కారు. గతంలోనూ అమరావతి నిర్మాణానికి దేశీయ ఆర్కిటెక్టులు పనికిరారని బాబు తేల్చి పడేసారు. 
మరి ఇదే బాబుగారి నాలుక తన గొప్పలు చెప్పుకునేటప్పుడు దేశ విదేశాల్లో ఇంజనీర్లు మనవాళ్లే అని అంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువాళ్లే వాళ్లందరూ గొప్పవాళ్లు కావడానికి కారణం నేనే అని కూడా నిస్సిగ్గుగా ప్రకటిస్తుంది. తన గొప్ప కోసం తెలుగు వాళ్లను పొగిడే బాబు విదేశాల ముందు మాత్రం వంగి వంగి వారి విజ్ఞానం గొప్పదని గానం చేస్తాడు. నిజంగానే అభివృద్ధి చెందిన దేశాల్లో గొప్ప టెక్నాలిజీలు ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వాలు వాటిని ప్రజల్లోకి అందుబాబులోకి తెచ్చాయి. మరి టెక్ తాతయ్యనను చెప్పుకునే చంద్రబాబు, కంప్యూటర్ ను కనిపెట్టా, ముబైల్ తయారు చేసే అంటూ గొప్పలు పోయే బాబు రాష్ట్రంలో ఆ స్థాయి టెక్నాలజీలను ఏమి తెచ్చారో మనకు బాగానే తెలుసు. మాటల్లో తప్ప చేతల్లో లేని టెక్నాలజీయే బాబు తెచ్చినది. ఏమీ లేకుండా అన్నీ ఉన్నాయనిపించేలా చేసే బాబు మాయే చంద్రబాబు టెక్నాలజీ. చైనీయులు యమాఫాస్టుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. అందుకే బాబుగారికి వాళ్లుబాగా నచ్చారు. మరి చంద్రబాబుగారు లండన్ దాకా వెళ్లి నార్మన్ పోస్టర్ లాంటి భారీ కంపెనీలను కలిసి అమరావతి డిజైన్లనే ఇంతవరకూ ఖాయం చేయలేకపోయారు. రాజధాని నిర్మాణానికి ఇటుకైనా వేయలేకపోయారు ఈ స్పీడు టెక్నాలజీ ముఖ్యమంత్రి గారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెలుగువారి మీద నెపం నెట్టాడు. విదేశీయుల ముందు సొంత గడ్డ వారిని అవమానించాడు. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని కబ్జాచేసిన చంద్రబాబు నాయుడు నేడు తెలుగువారి పరువును తీసేలా పరాయిదేశవాసుల ముందు సొంత వారిని తూలనాడాడు. చైనా చింగ్ చాంగ్ లపై ఉన్న ప్రేమలో పదోవంతుకూడా చంద్రబాబుకు తెలుగువారిమీద లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?
 
Back to Top