అత్తమీద కోపం దుత్తమీదా చంద్రబాబూ!!


ఆడలేక మద్దెల ఓడు అన్నాడట చంద్రబాబు లాంటి పెద్ద మనిషి. అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ప్రజలకు అందిచాల్సిన సంక్షేమ పథకాలను, తీర్చాల్సిన సమస్యలను పట్టించుకోలేదు. ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారంటే ఉండరా! ఏమీ చేయని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని తిరస్కరించరా! దీనికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యులు ఎలా అవుతారు? ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ప్రభుత్వ శాఖలకు అందజేయడం మాత్రమే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పని. కానీ వాటిని సమీక్షించడం, పూర్తి చేయడం ప్రభుత్వాధికారుల పని. అధినాయకులు చెప్పినట్టల్లా చేస్తున్న అధికారులు, పాలనను, ప్రజా సమస్యలను గాలికొదిలేసారు. దానికి చిరు ఉద్యోగులు ఏం చేయగలరు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని, సంతృప్తిని పెంచే బాధ్యత ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది ఎలా అవుతుంది? 

ప్రభుత్వ నిర్లక్ష్యానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ ముఖ్యమంత్రి నిర్దయగా మాట్లాడిన తీరు చూస్తే నెపాన్ని వేరే వ్యవస్థ మీదకు నెట్టడానికి చేస్తున్నట్టు స్పంష్టంగా అర్థం అవుతుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు మేపాలి అనడంలో చంద్రబాబు అహంకారం, అవసరానికి వాడుకుని అడ్డంగా వదిలేసే బుద్ధి బైటపడుతోంది. అసలు   ఉద్యోగాలకు ఆద్యుడు చంద్రబాబే. భద్రతలేని, హక్కులు లేని, నిర్దిష్ట వేతనం లేని ఈ ఉద్యోగాలు పుట్టించిన బాబు, ఇన్నాళ్లూ వారి సేవలు వినియోగించుకుని నేడు తన అసమర్థతకు వారిని కారణంగా చూపిస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలకు వారిని కారణంగా చూపి బలిపశువులను చేయాలనుకుంటున్నాడు. 

అవుట్ సోర్సింగ్ కు ఆద్యుడు చంద్రబాబే 

రాష్ట్రంలో లక్ష మందికి పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్స్ ఉద్యోగులున్నారు. 1995-2014 మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ చంద్రబాబు ప్రారంభించిన విధానమే అవుట్ సోర్సింగ్ . శాశ్వత ఉద్యోగులను నియమించకుండా కాంట్రాక్టు పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను నియమించుకున్నారు. వీరికి అతి స్వల్ప వేతనాలు ఉంటాయి. ఉద్యోగ హామీ ఉండదు. ఉద్యోగులకుండే హక్కులేవీ ఉండవు. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో అన్న భయంతో ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉంటారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుఅవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చాడు. దీనిపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఏ ఫలితం లేదు. 2016లో సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చినా మన రాష్ట్రంలో అది అమలుకు నోచుకోకపోవడం దురదృష్టం. ఇప్పటికే వైద్యమిత్ర, గోపాల మిత్ర లను తొలగించిన చంద్రబాబు సర్కార్ అదే ఊపులో మరికొందరికి ఉద్వాసన పలికేందుకే ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని ఉద్యోగులు అంటున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు లక్షలాది దరఖాస్తులను అప్లోడ్ చేయగలవు, ప్రభుత్వ ఉత్తర్వులను అందజేయగలవు అంతే కానీ పని చేయాల్సింది ప్రభుత్వమే కదా అంటూ వాపోతున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 75లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వివిధ శాఖలు వెల్లడిస్తున్నాయి. పింఛన్లు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇతర సర్టిఫికెట్లకోసం ఈ సేవ, మీ సేవల్లో చేసుకున్న దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. సమీక్షించి పూర్తి చేయాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్లిప్తంగా ఉన్నాయి. అందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అని వేరేగా చెప్పక్కర్లేదు. నిధులు విడుదల చేయక, పెండిగ్ ఫైళ్లు క్లియర్ చేయకపోవడంతో లక్షలాది అర్జీలు మురిగిపోతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తి పెరిగిపోవడానికి స్వంయంగా చంద్రబాబు, ఆయన పాలనావైఫల్యమే కారణం అని స్పష్టంగా కనిపిస్తుంటే, కలెక్టర్లను, అధికారులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యులను చేయడం చేతగానితనమే. సదస్సులు, సమావేశాలు, వారం వారం కాన్ఫరెన్సులు మాత్రమే సమస్యలను పరిష్కరించవని, ఆచరణలో జరిగితేనే వాటి ఫలితం ప్రజల సంతృప్తి రూపంలో కనిపిస్తుందని అధికారులెవ్వరూ చంద్రబాబుకు చెప్పలేరు. జెపి లాంటి ముక్కుసూటి మనిషి ఏం టెలీకాన్ఫరెన్సులయ్యా, తాసిల్దారు నుంచి బంట్రోతు దాకా అందరూ కాన్ఫరెన్సు బిజేయే. ఇంక పన్లేడౌతాయి. అవి కాస్త బందు జేయ్ అని చురకలేసినా చంద్రబాబు తీరులో మార్పు మాత్రం లేదు. 


Back to Top