బండారం బయటపడుతుందనే...

జగన్ ప్రాజెక్టుల బాటపై విషం కక్కుతున్న మంత్రులు
పోలవరం, పట్టి సీమలపై సమాధానాల్లేని ప్రశ్నలెన్నో
ఇంకుడుగుంతల బాబు ప్రాజెక్టులు కడతాడా?
ప్రాజెక్టులపై శ్వేతప్రతం ఇచ్చే దమ్ముందా?

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుల బాటపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అవాకులు చెవాకులకు అంతు లేకుండా ఉంది. జగన్‌మోహన్ రెడ్డి రైతులను కలుసుకోవడం, వారి సాధకబాధకాలను తెలుసుకోవడం, ఇంజనీర్లతో మాట్లాడడం, వాస్తవాల నిగ్గుతేల్చడం తెలుగుదేశం వారికి కంటగింపుగా ఉంది. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతు అంటే చంద్రబాబు నాయుడుకు పడదు, ఆయనకు ప్రాజెక్టులన్నా పడదు. వ్యవసాయం అంటే అస్సలు గిట్టదు. ఆయన కరువుకు మంచి స్నేహితుడు, రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు ఆయన హయాంలో నిత్యకృత్యాలు. మొత్తంగా చంద్రబాబు అంటే సంక్షోభం... సంక్షోభమంటే చంద్రబాబు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుల బాటపై తోచినట్లు మాట్లాడే వారు ఈ ప్రశ్నలకు బదులిస్తారా?
 • జగన్‌మోహన్ రెడ్డి ప్రాజెక్టుల యాత్ర చేస్తుంటే తెలుగుదేశం మంత్రులు ఇంతలా ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వారి అవినీతి బండారం ప్రజలకు తెలిసిపోతుందనా? పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో పుచ్చుకున్న ముడుపులు బయటపడతాయనా? తెలుగుదేశం హయాంలో రైతుకు, వ్యవసాయానికి ఏ ఒక్క మేలూ జరగలేదని తెలిసిపోతుందనా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 11 అంగుళాల మేర కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని తెలిసిపోతుందనా?
 • ఆంధ్రప్రదేశ్ వరప్రదాయని, బహుళార్థ సాథక ప్రాజెక్టు అయిన పోలవరం ను చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు? పోలవరాన్ని అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు తెలుగుజాతి ద్రోహిగా, చరిత్రహీనుడుగా మిగులుతాడనడం నిజం కాదా?
 • పోలవరం కట్టాలన్న ఆలోచన చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ తెచ్చి రు. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన దివంగత మహానేత రాజశేఖరరెడ్డిగారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఆయన పోలవరం ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనడం వాస్తవం కాదా?
 • రాష్ర్ట విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే ప్రకటించి విభజన చట్టంలో కూడా సెక్షన్ 90లో చేర్చిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారన్నది నిజం కాదా?
 • పట్టిసీమ ప్రాజెక్టు తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉందా? అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో పట్టిసీమ ప్రాజెక్టు హఠాత్తుగా ఎక్కడ నుంచి ఊడిపడింది? ఈ ప్రాజెక్టును తెరపైకి తేవడంలో చంద్రబాబు తెరవెనక కుట్ర ఏమిటి?
 • చంద్రబాబు అవినీతి బిడ్డే పట్టిసీమ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖరరెడ్డి గారికి మానసపుత్రిక అయితే చంద్రబాబు నాయుడి అవినీతి పుత్రిక పట్టిసీమ... దీనిని కాదనగలరా?
 • ప్రాజెక్టుల వద్ద పడుకుని అయినా పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు. చేతగాని వాళ్లకే మాటలెక్కువ అన్న చందంగా ఐదు ఏళ్లూ ఆయన ప్రాజెక్టుల వద్ద నిద్ర పోవడం తప్ప ఏమీ చేయలేరు. బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు?
 • హంద్రీ-నీవా ప్రాజెక్టు దాదాపు పూర్తి అయి ఇవాళ దాని పరిధిలోని 7 వేల చెరువుల్లో నీళ్లు నిండితే అదేదో తమ ఘనత అన్నట్లుగా దేవినేని ఉమ చెప్పుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చిందంటే అది రాజశేఖరరెడ్డి గారి ఘనత. ఈ రోజు రాయలసీమలోనూ, రాష్ర్టంలోనూ ప్రతి నీటి చుక్కలో, ప్రతి పంటలో రాజశేఖరరెడ్డిగారే కనిపిస్తారు. హంద్రీ-నీవాకు మీరు చేసిందేమిటో చెప్పగలరా?
 • ఏ ముఖ్యమంత్రి హయాంలో ఏఏ ప్రాజెక్టులు వచ్చాయి..? ఏ ప్రాజెక్టులకు ఏ ముఖ్యమంత్రి ఎంతెంత నిధులు ఖర్చుపెట్టారన్న దానిపై శ్వేతపత్రం ఇవ్వగలిగే దమ్ము ధైర్యం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నాయా?
 • చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఆయన ధ్యాసంతా ఇంకుడు గుంతల పైనే ఉండేది. ముందు తన హయాంలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా?
 • రాయలసీమ ప్రజలపై ఇపుడు ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు నాయుడు... రాజశేఖరరెడ్డిగారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చేపట్టినపుడు ఏం మాట్లాడారు? ప్రాజెక్టుల ద్వారా రాజశేఖరరెడ్డి గారు రాయలసీమకు నీళ్లు తీసుకువెళుతున్నాడని ఆరోజు చంద్రబాబు విమర్శలు చేసింది నిజం కాదా?
 • నీటిపారుదల రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే 2004-14 మధ్య కాలంలో వైఎస్ గారి హయాంలో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి రాష్ర్టంలో సాగునీటి రంగంపై చేసిన వ్యయం 95,539 కోట్లు అని, దాని వల్ల 23.49 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగిందని చంద్రబాబే అంగీకరించారు. అలానే తన 9 ఏళ్ల పాలనలో 1994-2004 వరకు రు. 10,394 కోట్లు ఖర్చు చేశానని చెప్పుకున్నారు. అంటే రాజశేఖరరెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞం ద్వారా 23 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి వచ్చిందనేది చంద్రబాబే స్వయంగా తన శ్వేతపత్రం ద్వారా అంగీకరించారుకదా..!

తాజా వీడియోలు

Back to Top