పర్యటనలన్నీ ప్రచారాలే

– చెప్పుకునేది ఘనం.. సాధించింది శూన్యం
– పైసా రాల్చని చంద్రబాబు విదేశీ యాత్రలు 
– ప్రతి రెండు నెలలకోసారి విదేశాలకు 
– పెట్టుబడుల పేరుతో వ్యక్తిగత పర్యటనలు..?

ఓట్ల కోసం గొప్పగా హామీలు గుప్పించడం.. అవి సక్రమంగా అమలు చేయలేనప్పుడు మీడియా ద్వారా ప్రజలను పక్కదారి పట్టించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చెప్పింది కొండంత– చేసింత గోరంత అన్నట్టుగా ఉన్న తన పాలనా తీరుతో ప్రజల్లో అసంతప్తి పెరుగుతున్న విషయం ఆయన కూడా గ్రహించారు.  ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కలిగించని విధానాలతో పాలన సాగిస్తూ ప్రజలందరినీ ప్రచారంతో మభ్యపెట్టవచ్చని భావించడం.. బాబుకి గతం మరచిపోయే లక్షణం ఎక్కువగా ఉందనే వాస్తవాన్ని చాటుతోంది. 

ప్రచారం కోసమే విదేశీ యాత్రలు
ఇక వర్తమానంలో చంద్రబాబు విదేశీయానం ఓ ప్రచారాస్త్రంగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి ఈ ప్రచారం మొదలవుతుంది. విదేశాల్లో ఉన్నంత కాలం రాష్ట్రానికి పెట్టుబడుల వరద తరలివస్తున్నట్టు మీడియా నుంచి కనిపిస్తుంది. ఆయన వచ్చిన తర్వాత మరో రెండు రోజుల పాటు కనీసం రెండు నెలలకొకసారి వారం, పది రోజులు ఈ హైటెక్‌ నాటకం నడుస్తుంది. పెట్టుబడుల మాట ఏమోగానీ ప్రజలకు ఈ పర్యటనల వల్ల ఒరిగిందేమిటనే ప్రశ్నకు సమాధానం ఉండదు. 

ఎక్కడికెళ్లారు? బాబు ఏం చెప్పారు? 
ఇప్పటి వరకూ చంద్రబాబు తన మూడున్నర సంవత్సరాల పాలనలో 16 విదేశీ యాత్రలు చేశారు. అంటే ప్రతి రెండు నెలలకొకసారి విదేశాలు వెళ్లి వస్తున్నారు. అందులో దావోస్‌ మూడు సార్లు వెళ్లారు. సింగపూర్‌ రెండు సార్లు , అమెరికా రెండు సార్లు, జపాన్‌ కూడా రెండు మార్లు పర్యటించారు. చైనా, టర్కీ, బ్రిటన్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, శ్రీలంక వంటి దేశాలూ చుట్టి వచ్చారు. ఆయన ప్రతి పర్యటనలోనూ ప్రధాన లక్ష్యం ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమేనని చెబుతుంటారు. అవన్నీ ఫలిస్తున్నట్టు, భారీగా ఎంవోయూలు కుదిరినట్టు, అమరావతికి తరలివస్తున్నట్టు కూడా చెప్పుకుంటారు. దేశంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్న చంద్రబాబు దానికి అదనంగా ఫారిన్‌ ట్రిప్పుల్లోనూ లక్షల కోట్లు ఏపీకి వచ్చేస్తున్నట్టు చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఈ పర్యటనల్లో ప్రకటనలు ఉంటాయి. ఉదాహరణకు ఆయన సీఎం అయిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా సింగపూర్‌లో అడుగుపెట్టారు. 2014 నవంబర్‌ రెండో వారంలో జరిగిన ఆ మూడు రోజుల పర్యటన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి జిల్లాలో ఓ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మిస్తానన్నారు. కానీ ఆ తర్వాత అది మరచిపోయారు. దాని వల్ల ఉపయోగం ఏమిటనే విషయం పక్కన పెడితే బాబు బహిరంగంగా చెప్పిన మాటను పూర్తిగా విస్మరించడం విశేషం. 

2015–2017 వరకు మూడు సంవత్సరాల పాటు వరుసగా ప్రతి జనవరిలోనూ దావోస్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. దానికోసం ఆ సదస్సులో పాల్గొనడానికి భారీ ఎంట్రీ ఫీజును కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయినా ఎంట్రీ ఫీజు కట్టిన వారందరికీ అవకాశం కల్పించే దావోస్‌కు బాబును ఆహ్వానించడమే ఘనకార్యంగా చెప్పుకోవడం కూడా విశేషం. ఆ మూడు సార్లు బాబు చెప్పిన మాటల ప్రకారం 2015లో స్పీడ్‌ రైలు వస్తుందన్నారు. 2016లో అయితే విదేశీ పెట్టుబడుల పోటెత్తి రావడం, 2017లో ఆయన మాటలను అనుసరించి విశాఖలో మాస్టర్‌ కారిడార్‌ ఏర్పాటు జరిగి ఉండాలి. కానీ ఏపీకి రైల్వే జోన్‌ చట్ట ప్రకారం రావాల్సి ఉండగా కేంద్రాన్ని నిలదీయలేని చంద్రబాబు స్పీడ్‌ రైల్‌ మాటలను కూడా స్పీడ్‌గానే మరచిపోయినట్టు మనం భావించవచ్చు. ఇక వాటికి తోడుగా 2015లో చైనా వెళ్లినప్పుడు షాంఘై తరహాలో అమరావతి నిర్మిస్తామన్నా రు. జపాన్‌ పర్యటనలో టోక్యో మాదిరిగా అమరావతి నగర నిర్మాణం సాగుతుందన్నా రు. టర్కీ వెళ్లిన సందర్భంగా ఇస్తాంబుల్‌ నగరంలా అమరావతి నిర్మించబోతున్నా మన్నారు. గత ఏడాది జులైలో కజికిస్తాన్‌ పర్యటన సందర్భంగా కాబూల్‌ కార్లు వస్తాయని చెప్పారు. రష్యా వెళ్లిన సమయంలో మెరైన్‌ వర్సిటీ వచ్చేస్తోందని చెప్పుకొచ్చారు. మొన్నటి జనవరిలో శ్రీలంక వెళ్లిన సమయంలో అమరావతికి ’మాస్టర్‌ ప్లాన్‌ శ్రీలంక’ ఇస్తుందని చెప్పుకొచ్చారు. అంతకుముందు లండన్‌ వెళ్లినప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం నార్మన్‌ ఫోస్టర్‌ను ఇప్పుడు రంగంలో దింపారు. ఇప్పడు తాజాగా 17వ పర్యటనకు వెళ్లారు. అమెరికా, దుబాయ్, లండన్‌ దేశాల్లో ఆయన పర్యటించి అమరావతికి పెట్టుబడుల వరద పారిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్థిక భారంగా పర్యటనలు...
బాబు పర్యటనలో పెడుతున్న ఖర్చు అసలే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి అదనపు భారంగా మిగలడమే తప్ప ఒరిగిందేమీ కనిపించడం లేదు. ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో ఇప్పటికీ స్పష్టత లేదు. స్విస్‌ ఛాలెంజ్‌లో గోప్యత, సింగపూర్‌ కంపెనీల పట్ల ప్రదర్శిస్తున్న అపార ప్రేమ విషయంలో అనుమానాలకు వివరణ లేదు. రాజధాని నిర్మాణం పెద్ద సందేహంగా మారుతోంది. ఇక వెలగపూడి వెళుతున్న ప్రజలకు మండు వేసవిలో కూడా గుక్కెడు నీళ్ల కోసం విలవిల్లాడాల్సి వస్తోంది. అయినా ఇప్పటికీ చంద్రబాబు విధానాల వైఫల్యాన్ని పరిశీలించుకోకుండా మరింతగా ముందుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రచారంతో నెట్టుకు రావాలని చూస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top