అదిగొ వచ్చె.. రాజన్న బిడ్డ

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా) : మహానేత రాజన్న బిడ్డ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిల పట్ల జనం అదే అభిమానం.. అదే ఆదరణ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో శనివారం వరకూ కొనసాగిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొత్తగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దారిపొడవునా జనం శ్రీమతి షర్మిలకు అఖండ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకునేందుకు, ప్రత్యక్షంగా చూసేందుకు పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల సమీపం నుంచే కళ్ళారా చూడాలని వృద్ధులు, చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులతో పాదయాత్ర దారులు జనగోదారులే అయ్యాయి. ప్రతి గ్రామంలోనూ మహిళలు శ్రీమతి షర్మిలకు ఎదురేగి మంగళహారతులు పట్టి స్వాగతం చెప్పారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారంనాడు ఖమ్మం జిల్లాలో 12.3 కిలో మీటర్లు సాగింది. ఉదయం జూలూరుపాడు మండలం సాయిరాంతండా శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తగూడెం మండలంలోని వేపలగడ్డ శివారు వరకు కొనసాగింది. ఉదయం ఏడు గంటలకే సాయిరాంతండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రం వద్దకు శ్రీమతి షర్మిలను చూసేందుకు ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వారికి అభివాదం చేసిన శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించి దండుమిట్టతండా మీదుగా పడమటి నర్సాపురానికి చేరుకున్నారు. దండుమిట్టతండా, పడమటి నర్సాపురంలలో మహిళలు రోడ్డుకిరువైపులా బారులు తీరి శ్రీమతి షర్మిలకు మంగళహారతులు పట్టారు.

రైతులు తమ సమస్యలను శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి పాదయాత్ర మాచినపేటతండాకు చేరుకుంది. అక్కడి గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. మాచినపేటతండాలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాచినపేట దా‌టాక 104 ఉద్యోగులు తమ సమస్యలపై శ్రీమతి షర్మిలకు వినతిపత్రం అందించారు. అక్కడి నుంచి కొమ్ముగూడెం మీదుగా పాదయాత్ర నాయకులగూడెం చేరుకుంది. కొమ్ముగూడెం వద్ద భారీ సంఖ్యలో మహిళలు ఊరి చివరకు వచ్చి శ్రీమతి షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు. కొమ్ముగూడెంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర కొత్తగూడెం మండలం నాయకులగూడానికి చేనగానే నియోజకవర్గ నాయకులు శ్రీమతి షర్మిలకు సాదర స్వాగతం చెప్పారు. నాయకులగూడెంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. తరువాత పాదయాత్ర సుజాతనగర్‌కు చేరుకుంది.

జనార్ణవమైన సుజాతనగర్‌ :
శ్రీమతి షర్మిల పాదయాత్ర సుజాతనగర్‌ చేరగానే అక్కడ వేచి ఉన్న మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి, ఘనంగా స్వాగతం పలికారు. సుజాతనగర్ ప్రధాన సెంట‌ర్‌లో కొద్దిసేపు శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ధ్వజమెత్తారు. శ్రీమతి షర్మిల ప్రసంగిస్తున్నంతసేపు ‘జై జగన్’ నినాదాలతో సుజాతనగ‌ర్ సెంట‌ర్ మార్మోగింది. అక్కడి నుంచి పాదయాత్ర వేపలగడ్డ చేరుకుంది. వేపలగడ్డ ధాన్యం, మొక్కజొన్నలు, పాలతో‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహానికి శ్రీమతి షర్మిల అభిషేకం చేశారు. అనంతరం ఆమె వేపలగడ్డ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు.

వికలాంగుల సమస్యలు విన్న శ్రీమతి షర్మిల : 
పాదయాత్ర దారిలో శ్రీమతి షర్మిలకు వికలాంగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖ‌రరెడ్డి హయాంలో వికలాంగులకు నెలనెలా పింఛను సక్రమంగా వచ్చేదని, ఇప్పుడు పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని శ్రీమతి షర్మిలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ మళ్లీ మంచి రోజులు వస్తాయని, జగనన్న మఖ్యమంత్రి కాగానే వికలాంగులకు రూ.వెయ్యి పింఛను అందిస్తారని వారికి భరోసా ఇచ్చారు.
Back to Top