ఆత్మీయంగా.. చిరునవ్వుతో ప్రజలతో మమేకం

అచ్చం మహానేత రాజన్నను తలపించే రీతిలో చిరునవ్వుతో షర్మిల ప్రజలతో మమైకమయ్యారు. అక్కా.. అన్నా.. అవ్వా.. తాతా అంటూ ఆత్మీయంగా పలకరించారు.. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ‘ఇప్పుడు రాబందుల రాజ్యం నడుస్తోంది.. కొన్నాళ్లు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. అందరి కష్టాలను తీరుస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు.

కొనకండ్ల: ఇదీ ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు మంగళవారం వచ్చిన జనస్పందన తీరు.  ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. గుడారం నుంచి ఆమె కాలు బయట పెట్టే సమయానికి  ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. భారీ జనసందోహం మధ్య షర్మిల పాదయాత్ర సాగించారు. మార్గమధ్యలో వజ్రకరూరుకు చెందిన ఓ రైతు చేనులోకి షర్మిల వెళ్లారు. ఆ రైతు కష్టాలను అడిగి తెసుకున్నారు. ‘అన్నా.. పంట పరిస్థితి ఎలా ఉంది.. ఏమైనా గిట్టుబాటవుతుందా’ అంటూ ఆత్మీయంగా అడిగారు. ఇందుకు ఆ రైతు స్పందిస్తూ.. ‘అమ్మా.. మూడెకరాల్లో వేరుశనగ పంట వేశా. రూ.35 వేలు ఖర్చయింది. వానలు సరిగా కురవకపోవడం వల్ల పంట పండలేదు. చేతికి రూ.పది వేలు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. బీమా పరిహారం వచ్చేలా లేదు’ అంటూ బావురుమన్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా అధైర్యపడొద్దు.. ఇప్పుడు కాంగ్రెస్ రాబంధుల రాజ్యం నడుస్తోంది. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది. రైతుకు అండగా జగనన్న ఉంటారు’ అంటూ ఆ రైతులో ఆత్మస్థైర్యం నింపారు.
ఆ తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వేలాది మంది ప్రజలు తరలి వచ్చి కమలపాడుకు క్రాస్‌కు సమీపంలో షర్మిలకు సంఘీబావం తెలిపారు. షర్మిలతో పాదం కలిపి కదంతొక్కారు. ఆ తర్వాత కమలపాడుకు చేరుకున్న ఆమె.. ఆ గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు.

కులవృత్తులకు ఏదీ దిక్కు..
     కమలపాడుకు చెందిన రజకులు మాట్లాడుతూ ‘అమ్మా.. మా గ్రామంలో బట్టలు ఉతకడానికి నీళ్లు లేవు. వైయస్  ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టించారు. ఇప్పుడు నీళ్లందడం లేదు. ఎలా బట్టలు ఉతకాలి. కులవృత్తులపై ఆధారపడి జీవించే ప్రజలపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అక్కా.. కులవృత్తులకు వైయస్ పెద్దపీట వేశారు. అందుకే ఆయన హయాంలో కులవృత్తులపై ఆధారపడిన ప్రజలు సుఖంగా జీవించారు. కొద్ది రోజులు ఓపికపట్టండి.. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. మీకు మంచి చేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు. కమలపాడుకు చెందిన మరో మహిళ మాట్లాడుతూ ‘అక్కా.. వడ్డీలేని రుణాలు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ.. ఇప్పుడు అధికారులు ముక్కుపిండి రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అక్కా.. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసి, పేదరికాన్ని తరిమికొట్టాలని రాజన్న భావించారు. అందుకే పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కానీ.. ఈ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి మొదటికే మోసం చేసింది.. కొన్నాళ్లు ఆగండి.. జగనన్న సీఎం అవుతారు. అప్పుడు వడ్డీలేని రుణాలు ఇస్తారు’ అంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడే భోజనం చేసిన షర్మిల కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.50 గంటలకు పాదయాత్రను కొనసాగించారు. గూళ్యపాళ్యానికి సమీపంలో మదనపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత బాబ్‌జాన్ వందలాది మందితో తరలివచ్చి షర్మిల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి.. కదంతొక్కారు.

Back to Top