ఆప్యాయంగా.. ఆహ్లాదంగా మరో ప్రజా ప్రస్థానం

రాప్తాడు:

కర్పూర హారతులు.. కుంకుమ బొట్లు.. కరచాలనాలతో ప్రజలు మహానేత తనయ వైయస్ షర్మిలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. అనంతపురం సిండికేట్‌నగర్ కాలనీ వాసులు షర్మిలకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కాలనీలో చౌడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షర్మిల తరువాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెబుతోందని, బ్యాంకు వాళ్లను అడిగితే లేదంటున్నారని చెప్పారు. పైపెచ్చు రుణాలకు అధిక వడ్డీలు తీసుకుంటున్నారని వాపోయారు. వైయస్ ‌పాలనా కాలంలో పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవా‌రని, అభయ హస్తంతో ప్రతి మహిళకు పెన్షన్ ఇవ్వాలని ‌చూశారని చెప్పారు. ఈ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా, కేవలం మాటలు తప్ప పనులేవీ చేయడం లేదని పిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో  వైయస్‌ఆర్‌సిపీ తరఫున ఎవరిని నిలబెట్టినా గెలిపించి తీరుతాం అని స్వయం సహాయక సంఘాల మహిళలు తెలిపారు.

        షర్మిల స్పందిస్తూ..‌ మహిళలకు వడ్డీ లేని రులు, చేనేత కార్మికులకు పావలావడ్డీకే రుణాలు ఇప్పిస్తామని వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీలో జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీని ఈ ప్రభుత్వం కాపీ కొట్టి ఇస్తామని చెప్పింది. కానీ.. ఆ ఉత్తర్వులు బ్యాంకర్లకు కూడా చేరలేదు. అభయహస్తాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకనో దీన్ని బట్టే అర్థమవుతోంది. బాధపడొద్దు.. రాజన్న రాజ్యంలో మహిళలు అందరికీ న్యాయం జరుగుతుంది అని భరోసా ఇచ్చారు. కాలనీలోని చౌడన్న అనే చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లిన షర్మిల.. కొంతసేపు మగ్గం నేశారు. చేనేత పరిస్థితి గురించి ఆరా తీశారు. ముడిసరుకుల ధరలు పెరిగాయని, తాము నేసే చీరలకు మాత్రం ధరలు పెరగలేదని, కనీసం కూలి డబ్బులు కూడా గిట్టుబాటు కావడం లేదని చౌడన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు కరెంట్ కోతల వల్ల అసలు పనులే జరగడం లేద పనులు లేక తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని షర్మిల ముందు చౌడన్న మొరపెట్టుకున్నాడు. దీనితో స్పందించిన షర్మిల మాట్లాడుతూ, రాయితీపై ప్రభుత్వమే ముడిసరుకులు సరఫరా చేస్తుందని, మీరు నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తారని, రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా ఇస్తారని ధైర్యం చెప్పారు. చౌడన్న ఇంటి నుంచి బయటికి వస్తున్నషర్మిలపై వేలాది మంది మహిళలు బంతిపూల వర్షం కురిపించారు.

          కొందరు మహిళలు షర్మిలను ఆడబిడ్డలా భావించి.. పసుపు కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించి ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. మహిళలు తనను సొంత ఆడబిడ్డలా ఆదరిస్తుండటంతో షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. రాచానపల్లిలో మహిళలు ఏర్పాటు చేసిన మహానేత వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి షర్మి‌ నివాళులు అర్పించారు. కొడిమి క్రాస్‌ వద్ద షర్మిలకు మహిళలు హారతి పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీశారు.

          ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని లెప్రసీ కాలనీ ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మార్గమధ్యలో ఆర్వీఎం స్కూలు విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత గొట్కూర్ క్రాస్ మీదుగా బ్రాహ్మణపల్లి క్రాస్‌కు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడ షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నామని, తమ గ్రామం పక్కనే వెళ్తున్న పీఏబీఆర్ నీటి పథకం పైపు లైను నుంచి నీళ్లు తీసుకుంటే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేద‌, ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడం వల్ల చదివించే స్థోమత లేక పిల్లలను చదువు మాన్పించామని ఆ గ్రామ ప్రజలు బావురుమన్నప్పుడు షర్మిల చలించిపోయారు.

            ప్రజల తరఫున పోరాడుతున్న జగన్‌పై కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుమ్మక్కై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టించారని, ఆయన ఎక్కడ ఉన్నా మీ గురించే ఆలోచిస్తున్నారని, మీ కష్టాలు తెలుసుకోవడానికి నన్ను మీ వద్దకు పంపారని షర్మిల వారిక చెప్పారు. కొద్ది రోజులు ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని, రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగన్ నిలబెట్టుకుంటారని భరోసా ఇచ్చారు.

          ఇలా ప్రతి చోటా షర్మిలకు బ్రహ్మరథం పడుతూ, తమ తమ కష్టాలను ఆమెతో జనం పంచుకుంటున్నారు. షర్మిల పాదయాత్ర ఆసాంతమూ విజయవంతంగా కొనసాగుతోంది.

Back to Top