చంద్రబాబు గర్జనలు, గాండ్రింపులెందుకు?

హైదరాబాద్, 24 డిసెంబర్ 2013:

చంద్రబాబు చేసేది సమైక్య గర్జతో లేక విభజన గర్జనో స్పష్టం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. దేని కోసం ఆయన గర్జించాలనుకుంటున్నారని నిలదీసింది. ప్రజా గర్జన నెపంతో చంద్రబాబు నాయుడు ఈ గర్జనలు, గాండ్రింపులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. గర్జన పేరుతో సభలు నిర్వహించడానికి ఒక అర్థం, అర్హత ఉండాలని అంది. ఎన్టీఆర్‌ పెట్టిన గర్జనను వాడుకుంటున్న చంద్రబాబు పిల్లి కూతలు కూయడం తప్ప చేయగలిగిందేమీ లేదని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు. సమైక్యం అనే మూడక్షరాల పదం తన నోటితో పలకడానికి ఇష్టపడని చంద్రబాబుపై టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు గర్జించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబు ఓ విష సర్పం అని పద్మ అభివర్ణించారు.

సోనియా ఆధ్వర్యంలో తెలుగు జాతి మీద కుట్ర జరుగుతున్నదని, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని అందరూ పోరాడుతుంటే.. తన గర్జన సభ ఎందుకోసం పెడుతున్నారో మాత్రం చెప్పరట అని పద్మ విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచండని చంద్రబాబు గర్జించాలనిసమైక్యాంధ్ర కోరుకునే టీడీపీ శ్రేణులు  ఒత్తిడి తేవాలని ఆమె పిలుపునిచ్చారు. ఏ ప్రాంతం వారు ఆ డ్రామా ఆడండని చంద్రబాబు నాయుడు ముసుగులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. మన రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకుంటున్న 75 శాతం మంది ప్రజల అభిమతాన్ని ఆయన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో సోనియా, మన దగ్గర చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నారన్నారు.

రాష్ట్ర విభజనపై జూలై 30 వ తేదీన సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు స్వాగతించారని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు అనేక మార్లు స్వరం మార్చడాన్ని చూసి ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోతుందని ఎద్దేవా చేశారు. నాలుగైదు లక్షల కోట్లిస్తే చాలని ఆనాడు అన్న చంద్రబాబు ఇప్పుడు సమంగా విడిపోవడం లేదని అంటున్నారని అన్నారు.

మన రాష్ట్రం కలిసే ఉండాలన్న ఆశయంతో త్యాగాలకు సిద్ధమై, కష్టాలు, నష్టాలు, లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైళ్ళను కూడా లెక్క చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి సమైక్యం అనే మాట అనకుండా చంద్రబాబు గర్జించేది ఏమిటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కీలకమైన తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, చర్చ జరిగే సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని పద్మ నిలదీశారు. టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ అని, ప్రాంతాల వారీగా మాట్లాడమని నాయకులను చంద్రబాబు ఎగదోస్తున్నారని ఆరోపించారు. ఎంతసేపూ రాష్ట్రం విడిపోవాలనే కానీ, కలిసి ఉండాలనే కోరిక చంద్రబాబుకు ఎందుకు కలగడం లేదని పద్మ ప్రశ్నించారు.

ఇప్పటికైనా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అడిగితే, అలాంటి విజ్ఞప్తితో చంద్రబాబు ఒక లేఖ ఇస్తే.. సమైక్యవాదులకు ఊరటగా ఉంటుందన్నారు. చంద్రబాబు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచారని సంతోషిస్తారన్నారు. ఈ రాష్ట్రం విడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మహిళలు నిలదీస్తే ఏం చేస్తారని అన్నారు. సమైక్యం కోసం తాను కూడా నిలబడతానని చెప్పాల్సిన బాధ్య చంద్రబాబు ఉందన్నారు. తెలంగాణ వాదం, టీఆర్ఎస్‌ పుట్టిందే చంద్రబాబు వైఖరి వల్ల అని శ్రీకృష్ణ కమిటి నివేదికలో చెప్పిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు. చంద్రబాబు పాలన వల్ల, ఆయన చేతకానితనం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ వచ్చిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులు, పొరపాట్ల నుంచి బయటపడి రాష్ట్రాన్ని కలిపి ఉంచేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గర్జన పేరుతో గూడుపుఠాని చేయడానికి వెళితే సమైక్య వాదులు సహించబోరని చంద్రబాబును వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top