హైదరాబాద్, సెప్టెంబర్ 2013:
ప్రజల ఆరోగ్యానికి వైయస్ఆర్ కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారంనాడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల చేశారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో పోస్టర్ విడుదల చేసిన అనంతరం శ్రీ జగన్ మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం విషయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు. విషజ్వరాల బాధితులకు రక్తం అవసరం అధికంగా ఉన్న ఈ తరుణంలో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అక్టోబర్ 1 వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జి. శివభరత్‌రెడ్డి వివరించారు. రక్తదాన శిబిరాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు, మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ శివభరత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది ప్రస్తుతం విషజ్వరాలతో బాధ పడుతున్నారని, ఈ తరుణంలో వారికి అందించేందుకు సరిపడిన రక్తం నిల్వలు మన దగ్గర లేవని డాక్టర్ శివభరత్‌రెడ్డి తెలిపారు. ఒక మహత్తర ప్రయోజనం కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు.