తెలంగాణ వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం


హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభించారు. లోటస్‌పాండ్ వద్ద గల సీపీ కేంద్ర కార్యాలయంలోని రెండో అంతస్తలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం.. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రార్థనలను నిర్వహించారు. విజయమ్మ రాకకు పూర్వం  పార్టీ రాష్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు , కె, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తదితరులు శాస్త్రోక్తంగా, వేదపండితుల మంత్రాల మధ్య పూజలు నిర్వహించారు. అంతకుముందు నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మేళతాళాలతో ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు మేళతాళాలతో ఉత్సాహంగా తరలివచ్చారు. వైఎస్సార్ అమర్హ్రే..! జై జగన్..! జై విజయమ్మ.. జై షర్మిల.. అంటూ నినాదాలు చేశారు. ఇక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీట్లో కూర్చుండబెట్టించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పార్టీ నియమావళి ప్రకారం..‘క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడిపనిచేస్తామని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా కృషి చేస్తామని, పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడకుండా, పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా నిజాయితీతో, చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని, దివంగత మహానేత వైఎస్సార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి విజయమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సేవాలాల్, మహారాజ్ జయంతి చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు.
Back to Top