బస్సు ప్రమాదంపై జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్, 30 అక్టోబర్ 2013

: ‌బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్సుకు చెందిన వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించడం పట్ల వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబ్ నగ‌ర్ జిల్లా కొత్తకోట వద్ద బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది. బస్సు దగ్ధం ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు శ్రీ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోర్టు ఆదేశాల కారణంగా తాను బస్సు ప్రమాదం సంఘటనా స్థలానికి వెళ్ళలేకపోతున్నానని శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. అయితే, పార్టీ సీనియర్‌ నాయకులు తక్షణమే బయలుదేరి వెళ్ళి పరిస్థితిని సమీక్షించాలని శ్రీ జగన్‌ ఆదేశించారు. ప్రమాద వార్త తెలిసిన వెనువెంటనే మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు వీలైనంతగా సహాయపడాలని మహబూబ్ నగ‌ర్ జిల్లా పార్టీ నాయకులను కోరారు.

బెంగళూరు నుంచి హైదరాబా‌ద్ వస్తున్న జబ్బార్‌ ట్రావెల్సుకు చెందిన వోల్వో బస్సు బుధవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో రొడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. ఆ కల్వర్టుకు డీజిల్ ట్యాంక్ తగలడంతో అది పగిలిపోయి మంటలు చెలరేగాయి. దాంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికుల్లో నలుగురు మాత్రం ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగిలిన వారంత అగ్ని కీలలకు ఆహుతైపోయారు.

తాజా వీడియోలు

Back to Top